Telugu Global
Cinema & Entertainment

అక్కడి థియేటర్లకూ ఇక్కట్లే!

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ సినిమా థియేటర్ల మనుగడ కత్తి మీద సాములా వుంది. అక్కడా వేల సంఖ్యలో థియేటర్లు మూత బడ్డాయి.

అక్కడి థియేటర్లకూ ఇక్కట్లే!
X

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ సినిమా థియేటర్ల మనుగడ కత్తి మీద సాములా వుంది. అక్కడా వేల సంఖ్యలో థియేటర్లు మూత బడ్డాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ థియేటర్ ఓనర్స్ (నాటో) ప్రకారం 2019 నుంచి మొత్తం స్క్రీన్‌ల సంఖ్య దాదాపు 3,000 తగ్గి 39,356 కి చేరుకుంది. ఇది కోవిడ్ మహమ్మారి ప్రత్యక్ష ఫలితం. ఇది కొంతకాలం థియేటర్లు మూతబడేలా చేసి స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌లలో పెరుగుదలని ప్రేరేపించింది. అనేక ప్రాంతీయ థియేటర్ చైన్లు మూతబడ్డాయి. తర్వాత హాలీవుడ్ లో సినిమాల నిర్మాణం సాధారణ స్థితికి వచ్చినప్పటికీ, స్టూడియోలు (బ్యానర్లు) చేయగలిగిన దానికంటే ఎక్కువ సినిమాల్ని అందిస్తున్నప్పటికీ, థియేటర్ల మూత తప్పనిసరి పరిస్థితిగా మారింది. ఉన్న థియేటర్లలో ట్రెండ్ ప్రకారం కొత్త టెక్నాలజీలకి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఆరేళ్ళకోసారి టెక్నాలజీ మారిపోతే, మునుపు పెట్టిన పెట్టుబడి తిరిగి రాక ముందే, మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఈ టెక్నాలజీ ట్రెండ్ విషవలయంలా మారింది.

సౌండ్‌లు, పిక్చర్ క్వాలిటీలతో బాటు సీటింగ్‌ని మెరుగుపరచడం, ఆహార పానీయాల ఏర్పాటు, ఈవెంట్‌లని, ప్రత్యామ్నాయ కార్యక్రమాల్నీ మెరుగుపరచడంలో కూడా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అయితే ఇప్పటికి టిక్కెట్ల విక్రయాల్లో పురోగతి కనిపిస్తోంది. 2023 లో బాక్సాఫీసు టికెట్ల అమ్మకాల్లో 958.5 మిలియన్ డాలర్లతో వృద్ధి కనిపించింది. ఇది 2022 సంవత్సరంతో పోలిస్తే దాదాపు 50% పెరిగింది. మహమ్మారి పూర్వం 2019 టో పోలిస్తే కేవలం 25% తగ్గింది.

ఇలా ప్రేక్షకుల సంఖ్య మెరుగుపడింది. ఎంట్‌టెలిజెన్స్ డేటా ప్రకారం, మహమ్మారికి ముందు రెండు దశాబ్దాలలో, సంవత్సరానికి సగటున 1.1 బిలియన్ టిక్కెట్ల అమ్మకాలు జరిగాయి. 2022లో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసి నప్పటికీ, ఆ సంవత్సరానికి కేవలం సగానికి పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. స్టూడియోలు మరిన్ని సినిమాలు విడుదల చేస్తున్నందున 2023లో టిక్కెట్ విక్రయాలు పెరిగాయి. అయితే ఇంత జరుగుతున్నా, స్టూడియో ప్రొడక్షన్ పెరిగిందని సినిమా ఆపరేటర్లు సంతోషిస్తున్నా, సినిమాల్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదని అసంతృప్తితోనే వుంటున్నారు ఆపరేటర్లు.

దీంతో ఆపరేటర్లు ప్రొజెక్టర్లని అప్‌గ్రేడ్ చేయడం ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా, సినిమా థియేటర్ ఆపరేటర్లు సాంప్రదాయ డిజిటల్ ప్రొజెక్టర్‌లని తీసివేసి, లేజర్ యూనిట్‌లని ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఇది కాలక్రమేణా ఖర్చు ఆదా అయ్యే పనే. పైగా సినిమాకొచ్చే ప్రేక్షకులకి నాణ్యమైన బొమ్మ కనిపిస్తుంది. ఈ అప్ గ్రేడేషన్ కొంచెం ఖరీదైనది, కానీ ఇది తెరపై మంచి బొమ్మని ప్రదర్శిస్తుంది. సాంప్రదాయ డిజిటల్ బల్బుల్ని దాదాపు 2,000 గంటల తర్వాత మార్చాల్సి వుంటుందని, పైగా అవి చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయనీ, ప్రొజెక్టర్ గదుల్ని ఎయిర్ కండిషన్ చేయడానికి, అది నిర్వహించడానికీ తడిసి మోపెడవుతుందనీ అంటున్నారు ఆపరేటర్లు. అదే లేజర్ యూనిట్ భాగాలు 20,000 గంటల పాటు పనిచేస్తాయి గనుక ఏళ్ళ తరబడి మార్చే అవసరం రాదనీ అంటున్నారు. చాలా మంది థియేటర్ ఆపరేటర్లు సౌండ్ సిస్టమ్‌లకి ఇలాంటి అప్‌గ్రేడ్‌లని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు, తమ ఆడిటోరియంలలోకి నాణ్యమైన స్పీకర్‌లని తీసుకురావడానికి డాల్బీ వంటి కంపెనీలతో భాగస్వామ్యం కలిగి వున్నామని చెప్పారు.

మేము డాల్బీ అట్మోస్‌లో పెట్టుబడి పెట్టాము.., మేము కొత్త స్క్రీన్‌లలో పెట్టుబడి పెట్టాము… మేము లేజర్ ప్రొజెక్షన్‌లో పెట్టుబడి పెట్టాము... ఇలా చెప్పుకుంటూ మెరుగైన భవిష్యత్తు వుంటుందని ఆశటో వున్నారు.

దేశమంతటా పెద్దా చిన్నా థియేటర్ చైన్‌ ఆపరేటర్లు కూడా మొత్తం సినిమా అనుభవాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో, కాలం చెల్లిన స్టేడియం సీటింగ్‌లని రీక్లయినర్‌లతో భర్తీ చేస్తున్నారు. ఈ మెరుగుదలలు మహమ్మారికి ముందు ప్రారంభమైన విస్తృత ధోరణిలో భాగమే. దీంతో ప్రేక్షకుల్ని బ్లాక్‌బస్టర్ సినిమాల కోసం, మరిన్ని ప్రీమియం థియేట్రికల్ అనుభవాల కోసం ఎగబడేలా చేయాలని ఆలోచన.

పెద్ద బ్లాక్‌బస్టర్‌లు సినిమాల టిక్కెట్ల అమ్మకానికి ఎల్లప్పుడూ చోదక శక్తిగా వుంటాయి. మహమ్మారికి ముందు థియేటర్ యజమానులు ప్రధానంగా స్టూడియో ప్రకటనలపై ఆధారపడేవారు - ట్రైలర్‌లు, టీవీ స్పాట్‌లు, పోస్టర్‌లు వగైరా. ఇప్పుడు ఈ పనిని తమ ప్రాంతపు ప్రేక్షకులకోసం పర్సనలైజ్ చేసి ఎక్కువ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ఆపరేటర్లు. లాయల్టీ ప్రోగ్రాములు, డైరెక్ట్ మార్కెటింగ్, ప్రత్యేక ఈవెంట్‌లు మొదలైనా వాటితో ప్రేక్షకుల్ని తీసుకురావడానికి ఇటీవలి వ్యూహాలుగా ఆపరేటర్లు ప్రయోగించారు. బడ్జెట్ స్పృహతో వుండే చిన్న ఆపరేటర్లు కొంచెం సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారు.

పోతే, అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో రెండు డజన్లకి పైగా థియేటర్లని నిర్వహిస్తున్న సినీపొలిస్, కోడి రెక్కల నుంచీ ఎండ్రకాయల పులుసు వరకూ అనేక రకాల ఆహార పానీయాల్ని అందించే లగ్జరీ డైన్-ఇన్ థియేటర్ చైన్ గా పేరు తెచ్చుకుంది. సినీపొలిస్ అంటే ‘సినిమా ప్లస్ భోజనం’ గా ప్రసిద్ధి పొందింది. ఎక్కువ మంది ప్రేక్షకులు ఇంట్లో పెద్ద హై-డెఫినిషన్ టీవీలని కలిగి వున్నారని, అలాగే టాప్ నాచ్ రెస్టారెంట్‌ల నుంచి ఆర్డర్ చేసే సామర్థ్యం కూడా వాళ్ళ కుందనీ, ఇవి రెండూ మేం ఒకేచోట అందిస్తున్నామనీ చెప్పుకుంటోంది యాజమాన్యం. ఈ ధోరణి మందగించే అవకాశం లేదని, సినిమా థియేటర్ వ్యాపారపు భవిష్యత్తు గురించి పరిశ్రమలోని వ్యక్తులు అందరూ ఆశాజనకంగా వున్నారనీ చెప్తోంది.

ఇండియాలో 20 వేలు వున్న థియేటర్లు 6 వేల స్థితికి వచ్చాయి. జనాభా అమెరికాలో కంటే 4 రెట్లు ఎక్కువ. ఈ జనాభాలో 80 శాతం మాస్ జనాలు. ఇంత పెద్ద మార్కెట్ ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసేసి నష్టపోతున్నారు. వినోద పన్ను రూపేణా ప్రభుత్వాలు థియేటర్ల నుంచి వేల కోట్లు వసూలు చేయడమే తప్ప ఈ సెక్టార్ అభివృద్ధికి తోడ్పడింది లేదు. కనీసం మల్టీప్లెక్సులకి అయిదేళ్ళ పాటు టాక్స్ హాలిడే ఇచ్చినట్టు, కొన్నేళ్ళ పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లకి పన్నులు ఎత్తేస్తే లోతట్టు ప్రాంతాల్లో కొత్త థియేటర్లు కూడా రంగంలో కొచ్చి అభివృద్ధి చెందుతాయి.

First Published:  6 Jun 2024 11:32 AM GMT
Next Story