కొత్త అనుభూతినిచ్చే ఆ మూడు సినిమాలు
నవంబర్ 3న ఒక విచిత్రం జరిగింది. అర్జున్ కపూర్, భూమీ పెడ్నేకర్ లు నటించిన ‘ది లేడీ కిల్లర్’ విడుదలైంది. దీనికి దేశవ్యాప్తంగా 293 మాత్రమే టికెట్లు అమ్ముడయ్యాయి.
నవంబర్ 3న ఒక విచిత్రం జరిగింది. అర్జున్ కపూర్, భూమీ పెడ్నేకర్ లు నటించిన ‘ది లేడీ కిల్లర్’ విడుదలైంది. దీనికి దేశవ్యాప్తంగా 293 మాత్రమే టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా 11 స్క్రీన్ల లోనే విడుదలైంది ఒకటి, లేదా రెండు షోలతో. అయినా 5 వేలు కూడా వసూలు రాలేదు. సినిమా విడుదలకి ముందు ట్రైలర్ విడుదల చేశారు. కానీ ఎటువంటి ప్రమోషన్, సమాచారం లేకుండా సినిమాని విడుదల చేశారు. సినిమాకి ఇంత ఘోరంగా టికెట్లు అమ్ముడవడానికి కారణమేమిటా అని దర్శకుడు అజయ్ బహల్ ని సంప్రదిస్తే, అతను చల్లగా చెప్పాడు- సినిమా కంప్లీట్ ప్లెట్ చేయకుండా రిలీజ్ చేశామని. 117 పేజీల స్క్రిప్టులో 30 పేజీలు షూటింగే చేయలేదని... ‘భారీ సంఖ్యలో కనెక్ట్ అయ్యే సన్నివేశాలు, అర్జున్ కపూర్, భూమీ పెడ్నేకర్ ల మొత్తం రోమాన్స్, భూమి మద్యపానం అలవాటు, అర్జున్ తనకున్న ప్రతిదీ కోల్పోయి సిటీ నుంచి పారిపోవాలనుకునే ప్రయత్నం, అతడి నిరాశ, మానసిక సంఘర్షణ తాలూకు బిట్లన్నీ మిస్సయ్యాయి. కాబట్టి ఈ సినిమా అయోమయంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి టికెట్లు అమ్ముడు పోలేదు’ అని సెలవిచ్చాడు.
అయితే, తర్వాత అతను ప్లేటు ఫిరాయించి ఇంకో ప్రకటన ఇచ్చాడు- ‘అలా అడిగితే కావాలని వ్యంగ్యంగా అలా చెప్పాను. వ్యంగ్యం కొన్నిసార్లు తప్పుగా అర్థమవుతుందని అర్ధంజేసుకో లేకపోయాను. ‘లేడీకిల్లర్’ కంప్లీట్ సినిమాగా ప్రేక్షకుల కోసం విడుదలైంది. ఈ ప్రాజెక్టుతో నేను చాలా గర్వంగా ఫీలవుతున్నానని నొక్కి చెప్తున్నాను’ అన్నాడు.
ఇది చాలదన్నట్టు నవంబర్ 3న ఇంకో సినిమా విడుదలైంది. ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ అని ‘ది లేడీ కిల్లర్’ లాగే సహజ విరుద్ధ సినిమా. ఇది కూడా చాలదన్నట్టు ఇదే రోజు ఇంకోటి విడుదలైంది-‘హకస్ బకస్’ అని. ఈ రెండూ కూడా పూర్తి చేయకుండా అతుకులబొంత గా ఎడిటింగ్ చేసిన సినిమాలే. నిడివి కూడా చెప్పినంత లేవు. ప్రేక్షకులు తలలు పట్టుకుని పారిపోయారు.
అయినా నిర్మాతలు కేర్ చేయలేదు. ఇలా రిలీజ్ చేసింది ప్రేక్షకుల కోసం కాదు. ఓటీటీలకి అమ్ముకోవాలంటే రిలీజ్ చూపించాలి కాబట్టి రిలీజ్ చేసేశారు. రిలీజ్ కి సమయం లేక తీసినంత వరకూ తీసి రిలీజ్ చేసేశారు. ఓటీటీలు ఇచ్చిన డెడ్ లైన్ లోగా సినిమాలు అందించకపోతే ఒప్పందాలు రద్దయి పోతాయి. అందుకని ఈ అక్రమాలు.
‘ఇలా చేస్తే అంతా వృధా అయిపోతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలు కూడా చివరికిలా నష్టపోతారు. క్రెడిబిలిటీ ప్రశ్నార్థకమవుతుంది. ప్రేక్షకులు కూడా నమ్మకం కోల్పోతారు. కాబట్టి ఇలాంటి విషయాల్నిసీరియస్‌గా తీసుకోవడం చాలా అవసరం’ అని ఒక ట్రేడ్ ఎనలిస్టు అభిప్రాయపడ్డాడు.
హకస్ బకస్, లేడీకిల్లర్, శాస్త్రి విరుద్ధ్ శాస్రి.న మూడింటికీ నిర్మాణంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేయడంతో డబ్బు పుట్టలేదు. సినిమా రిలీజ్ అవుతుందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఇది నిర్మాతలకి మనోవేదనగా మారింది. ఇలాటి చిన్న ఇండిపెండెంట్ సినిమాలకి ఫైనాన్స్ కూడా దొరకదు. సినిమా నిర్మాణానికి ముందుగా ఓటీటీ ఒప్పందాలు చేసుకోవడంతో ఎటూ తోచని పరిస్థితి. ఈ సినిమాలు థియేటర్లలో ఆడతాయని నమ్మకం వుండదు. కేవలం ఓటీటీల నుంచి అందే మొత్తాల పైనే ఆధారపడి నిర్మాణం చేపడతారు. అలాటిది మధ్యలో నిధులు అయిపోతే ఏం చేయాలి?
థియేటర్లలో రిలీజ్ చేస్తేనే ఒప్పందం వుంటుందని ఓటీటీలు షరతు పెట్టి డెడ్ లైన్లు విధించడంలో ఒక మతలబు వుంది. సినిమా పబ్లిసీటీ ఖర్చులు తమకి తప్పుతాయని. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తే పబ్లిసిటీ ఖర్చులు ఓటీటీలే భరించాల్సి వస్తుంది. అందుకని ఈ వ్యయం నిర్మాతలే భరించేలా థియేట్రికల్ రిలీజ్ కోరుతారు. రిలీజ్ చేయాలి కాబట్టి నిర్మాణం పూర్తి కాని సినిమాల్ని ఇలా రిలీజ్ చేసేసి ఓ రాయి వేసి చూస్తున్నారు నిర్మాతలు. కానీ ఇలా బట్టబయాలయ్యాక పూర్తి చేయని సినిమాల్ని ఓటీటీలు ఎందుకు తీసుకుంటాయని ఆలోచించడం లేదు.
అయితే కూడబలుక్కున్నట్టు ఈ మూడు సినిమాలూ ఒకే రోజు విడుదల చేయడంతో, ఇంకెన్ని సినిమాలు ఇలాటివి వున్నాయని ఆరా తీస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. 100లో ఒక సినిమాకే ఇలా జరుగుతుందనీ కొందరి అంచనా. హాలీవుడ్ లో కూడా పూర్తి కాని సినిమాలు విడుదలై పోతాయి. ఎందుకు విడుదలవుతాయో రేపు తెలుసుకుందాం. తెలుగులో కొన్ని సినిమాలకి గ్రాఫిక్స్ నాసిరకంగా వున్నాయని ప్రేక్షకులే విమర్శిస్తూంటారు. ఇలా నిధుల కొరతతో జరగదు గానీ, ఓటీటీల డెడ్ లైన్ ని అందుకోవడం కోసం హడావిడిగా గ్రాఫిక్స్ పూర్తి చేయడంతో క్వాలిటీ తగ్గుతుంది.