Telugu Global
Cinema & Entertainment

ఇండియాలో హాలీవుడ్ వార్!

ఈ నెల మూడు హాలీవుడ్ బిగ్ సినిమాలు మన దేశంలో బాక్సాఫీసుతో తలపడుతున్నాయి.

ఇండియాలో హాలీవుడ్ వార్!
X

ఇండియాలో హాలీవుడ్ వార్!

ఈ నెల మూడు హాలీవుడ్ బిగ్ సినిమాలు మన దేశంలో బాక్సాఫీసుతో తలపడుతున్నాయి. వీటి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా 12 రోజుల క్రితమే ప్రారంభమై సంచలనం సృష్టిస్తున్నాయి. ‘మిషన్ ఇంపాసిబుల్ 7’ (జులై 12), ‘ఒపెన్‌ హైమర్‌’(జులై 21),‘బార్బీ’ (జులై 21) మూడు హాలీవుడ్ దిగ్గజ సినిమాలూ ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చేసేస్తున్నాయి. ఓ మూడు సినిమాలు తప్పితే, హాలీవుడ్ సినిమాలు ఈ సంవత్సరం మన దేశంలో గొప్ప ఫలితాలనే సాధిస్తున్నాయి. ఈ ట్రెండ్ ఏడాది పొడవునా కొనసాగుతుందని భావిస్తున్నారు. జూలై నెలలో పై మూడు హాలీవుడ్ సినిమాలూ మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీసు విజేతలుగా నిలిచే అవకాశముందని అంటున్నారు.

టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్ ఇంపాజసిబుల్ 7’ మన దేశ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ని కలిగి వుంది. వారం రోజుల క్రితమే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమై మంచి రెస్పాన్స్ ని పొందుతోంది. శుక్రవారం (జూలై 7) బుకింగ్స్ మామూలుగా వున్నాయి. ఆ తర్వాత 5-రోజుల ప్రారంభ వారాంతంలో పీవీఆర్- ఐనాక్స్, సినీపోలిస్ మల్టీప్లెక్సుల్లో 175,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ రోజు (జూలై 12) 85,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

‘మిషన్ ఇంపాసిబుల్ 7’ పై వచ్చిన అంతర్జాతీయ సమీక్షలూ అసాధారణమైనవి. ఈ మూవీ ఇప్పటివరకు వచ్చిన ఫ్రాంచైజీల్లో అత్యుత్తమమైనదిగా పేర్కొన్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా ఇదే రకమైన రెస్పాన్స్ వస్తే, ఓపెనింగ్ వీకెండ్ ఇండియాలో సులువుగా అన్ని భాషల్లో రూ. 60 కోట్లకి పైగా వసూలు చేయాలని అంచనా వేస్తున్నారు. .

ఇక క్రిస్టఫర్ నోలన్ సృష్టి ‘ఒపెన్ హైమర్’ కున్న క్రేజ్ కూడా ఇంతా అంతా కాదు. క్రిస్టఫర్ నోలన్ సినిమా అంటేనే మన జనాలు పడి చచ్చిపోతారు. ఇది జులై 1 నుంచే అడ్వాన్సు బుకింగ్స్ తో దూసుకు పోతోంది. సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్ లు ఇందులో నటించారు. దీని ఐమాక్స్ వెర్షన్‌ కి భారీ క్రేజ్‌ కన్పిస్తోంది. ఐమాక్స్ వెర్షన్ కి 22,500 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఒక్క ప్రారంభ రోజే పీవీఆర్- ఐనాక్స్ దాదాపు 10 వేల టిక్కెట్లని విక్రయించింది.

జులై 21 నే ‘ఒపెన్ హైమర్’ తో ‘బార్బీ’ తలపడుతోంది. గ్రెటా గెర్విగ్ 'బార్బీ', క్రిస్టోఫర్ నోలన్ 'ఒపెన్‌హైమర్' రెండూ 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న విడుదలలు. ఈ రెండు సినిమాలూ ఒక్క రోజే విడుదలవడంతో ఏది ముందు చూడాలో అభిమానులు తేల్చుకోలేకపోతున్నారని మీడియా పేర్కొంటోంది.

ఈ రెండు సినిమాలు ఎంత భిన్నంగా వుంటాయన్నది మరో ఆసక్తికర చర్చగా మారింది. గుర్తింపు పొందిన ‘లేడీ బర్డ్’ దర్శకురాలు గ్రెటా గెర్విగ్ ‘బార్బీ’ ని నియాన్-కలర్లో ఫాంటసికల్ ప్రపంచాన్ని సృష్టించి, నిజ ప్రపంచం పట్ల అవగాహన కల్గించే కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దింది. టైటిల్ పాత్రని మార్గట్ రాబీ పోషించింది.

ఇక క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘ఒపెన్‌హైమర్’ అణు బాంబు సృష్టికర్త బయోపిక్. భౌతిక శాస్త్రవేత్త ఒపెన్ హైమర్ పాత్రని సిలియన్ మర్ఫీ పోషించాడు. అణు బాంబుని కనుగొన్న ఒపెన్ హైమర్ ఉత్థాన పతనాల కథ ఇది.

పై మూడు బిగ్ మూవీస్ కష్టాల్లో వున్న హాలీవుడ్ స్టూడియోలకి ప్రోత్సాహకర ఫలితాలని అందిస్తాయని భావిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ది ఫ్లాష్’, 'ఎలిమెంటల్,' ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ ది డెస్టినీ’ మూడూ మన దేశంలోనూ ఫ్లాపయ్యాయి. వీటితో పోలిస్తే ‘మిషన్ ఇంపాసిబుల్ 7’, 'బార్బీ', ‘ఒపెన్‌హైమర్' వస్తే మూడూ చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి.

First Published:  12 July 2023 9:53 AM GMT
Next Story