Murali Mohan | మురళీమోహన్ ఆరోగ్య రహస్యం ఇదే
Murali Mohan - ఇన్నేళ్లయినా మురళీ మోహన్ అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు.. ఆయన ఆరోగ్య రహస్యం ఏంటి?
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత క్రమశిక్షణ చాలా అవసరం. వ్యాయామం చేయాలని అందరూ అనుకుంటారు, కానీ కొంతమంది మాత్రమే చేస్తారు. పొద్దున్నే లేచి వాకింగ్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ కొందరే ఆచరణలో పెడతారు. ఈ గీతను దాటినప్పుడే క్రమశిక్షణ అలవడుతుందంటారు సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్. వ్యక్తిగతంగా ఎంత క్రమశిక్షణతో ఉంటే, అంత ఆరోగ్యంగా ఉంటామనేది ఈయన చెబుతున్న సలహా.
84 ఏళ్ల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఆ క్రమశిక్షణే కారణం అంటున్నారు మురళీ మోహన్. బద్దకించకుండా రోజూ వాకింగ్ చేయడం, చిన్న వ్యాయామాలు చేయడం అందరికీ ఎంతో అవసరం అని చెబుతున్నారు.
ఇక ఆహార అలవాట్ల విషయానికొస్తే... ఉదయం రాగి జావ తాగుతారు, కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటారు. మధ్యాహ్నం అందర్లానే అన్నం తింటారు. కాకపోతే చాలా తక్కువ రైస్. ఇంకా చెప్పాలంటే 4-5 ముద్దలు మాత్రమే. వాటితో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు తింటారు. ఇక సాయంత్రం మిల్లెట్స్ తో చేసిన ఏదైనా ఒక స్నాక్ తింటారంట. రాత్రికి మళ్లీ లైట్ గా ఏదైనా ఉప్మా లేదా రాగి ముద్ద లాంటిది తింటారంట. మధ్యమధ్యలో ఓ 3 సార్లు కాఫీ తాగుతారంట.
ఇలా భోజనం, వ్యాయామం విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటానని, అందుకే ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు మురళీమోహన్. కొందరికి ఆరోగ్యం వంశపారంపర్యంగా వస్తుందని, అలా అని ఇష్టమొచ్చినట్టు ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు.