ఈ హీరో బ్రిటన్ లో కేస్ స్టడీ అయ్యాడు!
విజయవంతమైన మీడియం రేంజి సినిమాలతో స్టార్ హీరోగా ఆయుష్మాన్ ఖురానా కొనసాగిస్తున్న ప్రభావవంతమైన బాలీవుడ్ ప్రయాణం ఇప్పుడు బ్రిటన్లో కేస్ స్టడీగా మారింది.
విజయవంతమైన మీడియం రేంజి సినిమాలతో స్టార్ హీరోగా ఆయుష్మాన్ ఖురానా కొనసాగిస్తున్న ప్రభావవంతమైన బాలీవుడ్ ప్రయాణం ఇప్పుడు బ్రిటన్లో కేస్ స్టడీగా మారింది. బాలీవుడ్ స్టార్లు ప్రియాంక చోప్రా, అనిల్ కపూర్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, ఐశ్వర్యరాయ్ బచ్చన్ సహా ఎందరో బాలీవుడ్ తారలు తమ కెరీర్‌లో అంతర్జాతీయ గుర్తింపుని సాధించారు. అయితే ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ ప్రయాణం, దాని ప్రభావం బ్రిటన్లో కేస్ స్టడీగా రూపొందించారు. లండన్ కి చెందిన అగ్రశ్రేణి బిహేవియరల్ ఇన్‌సైట్స్ కంపెనీ కాన్వాస్8 ఈ కేస్ స్టడీని నిర్వహించింది. 'నటుడు ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ కొత్త గొంతుక ఎలా అయ్యాడు’ అనే శీర్షికతో ఖురానా స్వరం దేశస్థుల్లో ఎలా ప్రతిధ్వనిస్తుంది, అతను రిస్కీ అన్పించే సినిమాల్లో నటించి ఒక కొత్త విజయ మార్గాన్ని ఎలా నిర్మించుకున్నాడు- అనే పవర్ పాయింట్స్ ని వివరిస్తోందీ లోతైన కేస్ స్టడీ. టాలీవుడ్ వర్ధమాన హీరోలకి ఇది అవసరం లేదనేది వేరే విషయం. మనం మనం మూసలో వుంటే సరిపోతుంది.
కేస్ స్టడీ ఇంకా ఇలా వివరించింది, ‘ ఫార్ములా సినిమాలకు ప్రసిద్ధి చెందిన పరిశ్రమలో, బాలీవుడ్ స్టార్‌డమ్‌కి ఖురానా ప్రయాణమనేది మామూలు విషయం కాదు. ఖురానా ప్రయాణంలో ముఖ్యమైన అంశం రిస్కీ అన్పించే సినిమాల్ని ఎంపిక చేసుకోవడం. ‘డ్రీమ్ గర్ల్’ లో క్రాస్ జెండర్ గా, ‘డాక్టర్ జి’ లో మేల్ గైనకాలజిస్టుగా, ‘విక్కీ డోనర్’ లో వీర్యదాతగా రిస్కు తీసుకుని నటించాడు. ఇతరులు హీరోలు తిరస్కరించిన లేదా సాహసించని కథా వస్తువులకు ఎస్ చెప్పాడు’
‘భారత ప్రేక్షకులు సినిమాల్లో సాంప్రదాయేతర పాత్రల్ని అదరిస్తున్నారు. ఈ పరిణామం భారతీయ సినిమాల్ని కుదిపేస్తోంది. ప్రధాన స్రవంతి సినిమా నిర్మాతలు ప్రేక్షకుల్లో మారిన ఈ కోవిడ్ అనంతర అభిరుచిని రాబోయే సంవత్సరాల్లో మరింత స్పష్టంగా చూస్తామని నమ్ముతున్నారు. మరింత వాస్తవికతతో కూడిన ఆలోచనాత్మక అభిరుచిని ఆహ్వానిస్తున్నారు. 2023లో ఖురానా నటించిన జెండర్-క్రాసింగ్ కథతో ‘డ్రీమ్ గర్ల్ 2’ విజయంలో ఇలాటి కంటెంట్ ని ఇప్పటికే చూడవచ్చు. ఇది బాక్సాఫీసులో ఒక బిలియన్ వసూళ్ళని నమోదు చేసి, విజయవంతంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో భాగమైంది’ అని కేస్ స్టడీ పేర్కొంది.
రియాలిటీ షో కంటెస్టెంట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయుష్మాన్ ఖురానా, ఒక నటుడుగా, సంగీతకారుడుగా, యూనిసెఫ్ అంబాసిడర్ గా బహుముఖాలుగా విస్తరించినందుకు, 'గ్రాస్‌రూట్ ప్రాతినిధ్యం ద్వారా పెరుగుతున్న ప్రభావాన్ని' అంచనా వేసినందుకూ కేస్ స్టడీ ఆయుష్మాన్‌ను అభినందించింది. ‘టైమ్ మ్యాగజైన్ 2020’ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల్లో ఒకరిగా ఖురానాని ప్రకటించడం అతడి కీర్తిని శిఖరాలకి చేర్చిందనీ ప్రశంసించింది.
యూనిసెఫ్ తరపున అతను బాలల హక్కుల కోసం క్రియాశీలంగా పాల్గొనడం అతడికి 2023లో ‘టైమ్ 100 ఇంపాక్ట్’ అవార్డుని కూడా సంపాదించి పెట్టిందని, అతడి 11 సంవత్సరాల నట జీవితంలో అనేక ప్రశంసలందుకున్నాడనీ, దీనికి సమాజంలో లోతుగా పాతుకుపోయిన పాత్రలకి తను ప్రాధాన్యమివ్వడమే కారణమనీ పేర్కొంది.
ఆయుష్మాన్ ఖురానా కారణంగా భారత ప్రేక్షకులు మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో సామాజిక వాస్తవికత పట్ల అభిరుచిని పెంపొందించుకోవడం జరిగిందనీ, కేస్ స్టడీ హైలైట్ చేసింది. ఆయుష్మాన్ ఖురానా రోడీస్ విజేతగా వినోద పరిశ్రమలో తన కెరీర్ ని ప్రారంభించాడని, తర్వాత వీజే అయ్యాడనీ, 2012లో తొలి చలన చిత్రం ‘విక్కీ డోనర్’ తో హీరోగా వెలుగులో కొచ్చాడనీ కేస్ స్టడీ పేర్కొంది.
ఆయుష్మాన్ ఖురానా మొత్తం 12 మీడియం బడ్జెట్ సినిమాల్లో నటించాడు. ఎంత హిట్ హీరోగా అవతరించినా బడ్జెట్లు పెంచి భారీ సినిమాలు తీయించుకోలేదు. బిగ్ స్టార్స్ సినిమాల్లో కూడా నటించలేదు. అలా జరిగివుంటే మీడియం రేంజి నిర్మాతల ముద్దు బిడ్డగా అతనుండే వాడు కాదు. మీడియం రేంజి నిర్మాతలకి ఖురానాలాంటి మీడియం రేంజి హిట్ హీరో కావాలి. కనుక అతను క్రిక్కిరిసిన భారీ బడ్జెట్ల బిగ్ స్టార్స్ జోన్ లోకి ప్రవేశించకుండా, ఖాళీగా వున్న మీడియం రేంజి ఆట స్థలంలో మీడియం రేంజి నిర్మాతలకి అందుబాటులో వుంటూ తన ఆట తను ఆడుకుంటున్నాడు. మీడియం రేంజి సినిమాల బిగ్ స్టార్ అన్పించుకుంటున్నాడు.
అతను నటించిన కొన్ని సినిమాలు తెలుగు తమిళ మలయాళ భాషల్లో రీమేక్ అయ్యాయి. తెలుగులో ‘విక్కీ డోనర్’ సుమంత్ తో ‘నరుడా దోనరుడా’ గా రీమేకైంది. తమిళంలో హరీష్ కళ్యాణ్ తో ‘ధారాళ ప్రభు’ గా రీమేకైంది. ‘అంధాధున్’ నితిన్ తో ‘మాస్ట్రో’ గా, తమిళంలో ప్రశాంత్ తో ‘అంధగన్’ గా, మలయాళంలో’ పృథ్వీరాజ్ సుకుమారన్ తో ‘భ్రమరం’ గా రీమేకయ్యాయి. ‘బధాయి హో’ తెలుగు రీమేక్ ప్రకటించారు. ఆర్ జె బాలాజీతో తమిళ రీమేక్ ‘వీట్ల విశేషమ్’ విడుదలైంది. ‘ఆర్టికల్ 15’ తమిళంలో ‘నెంజుకు నీధి’ గా ఉదయనిధి స్టాలిన్ తో రీమేకైంది.
రీమేక్స్ గురించి తెలుసుకుని ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు ఖురానా, ‘నా సినిమాలు చాలా వరకు రీమేక్ అవుతున్నాయని తెలుసుకోవడం చాలా ఆనందంగా వుంది. మనం చూసిన భాషని, సంస్కృతిని, సరిహద్దులనూ అధిగమించే శక్తి సినిమాలకుంది కాబట్టి సినిమా ఎంత సార్వజనీనమైనదన్నదే నిజమైన పరీక్ష అని నేను ఎప్పుడూ నమ్ముతున్నాను. థియేటర్లలో ప్రేక్షకులకి కొత్తదనాన్ని అందించే కంటెంట్ కి నేను మద్దతుగా నిలబడాలన్న నా నిర్ణయం సరైందేనని ఇది ధృవీకరిస్తుంది’ అన్నాడు.
పోతే, 2023 లో ‘డ్రీమ్ గర్ల్2’ సక్సెస్ తర్వాత, ఈ సంవత్సరానికి గాను ‘లవ్ బర్డ్స్’ అనే రోమాంటిక్ కామెడీనీ, సౌరవ్ గంగూలీ బయోపిక్ గా ఒక క్రికెట్ మూవీనీ ఫైనల్ చేసే ప్రయత్నంలో వున్నాడు కేస్ స్టడీ స్టార్!