Telugu Global
Cinema & Entertainment

రోజుకు ఒక ఎపిసోడ్ విడుదల వ్యూహం బెడిసి కొట్టింది!

ఓటీటీల్లో స్వదేశీ విదేశీ సిరీస్ ల రూపకర్తలు స్ట్రీమింగ్ కోసం విభిన్న విడుదల వ్యూహాల్ని అవలంబిస్తారనేది తెలిసిందే.

రోజుకు ఒక ఎపిసోడ్ విడుదల వ్యూహం బెడిసి కొట్టింది!
X

ఓటీటీల్లో స్వదేశీ విదేశీ సిరీస్ ల రూపకర్తలు స్ట్రీమింగ్ కోసం విభిన్న విడుదల వ్యూహాల్ని అవలంబిస్తారనేది తెలిసిందే. కొన్ని షోష్ కి ఎపిసోడ్స్ ని ఒకేసారి విడుదల చేస్తారు. ఉదాహరణకు, అమెజాన్ ప్రైమ్ వీడియో 'ది ఫ్యామిలీ మ్యాన్', 'జాక్ ర్యాన్' వంటి ఎపిసోడ్స్ ఒకేసారి విడుదల చేసింది. సర్వ సాధారణంగా ఈ మోడల్ నే అందరూ అవలంబిస్తారు. ఆరు నుంచి 8 ఎపిసోడ్సుగా వుండే ఈ షోస్ ని ప్రేక్షకులు ఒకేసారి లేదా, వీలుని బట్టి అప్పుడొకటి అప్పుడొకటి చూసుకునే వెసులుబాటు వుంటుంది. అయితే కొన్ని ఓటీటీలు వారపు ఎపిసోడ్ విడుదల వ్యూహాన్ని కూడా అనుసరిస్తున్నాయి. ఉదా, డిస్నీ+ హాట్‌స్టార్ లో 'క్రిమినల్ జస్టిస్: అధూరా సచ్', మార్వెల్ షోలు వంటివి. వీటన్నిటికీ భిన్నంగా జియో సినిమా అపూర్వంగా రోజుకొక ఎపిసోడ్ మోడల్ ని ప్రవేశ పెట్టింది- ‘అసుర్-సీజన్ 2’ సిరీస్ తో. డైలీ సీరియల్ లాగా. టీవీలో డైలీ సీరియల్ లీక్ కాదు. కానీ ‘అసుర్ -సీజన్ 2’ మొత్తం అన్ని ఎపిసోడ్ లు ఒకేసారి ఆన్ లైన్ లో లీక్ అయిపోయి జియో కొంప ముంచాయి!

గత నెలలోనే కొత్తగా ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టిన ముఖేష్ అంబానీకి చెందిన జియో సినిమా, కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం చేస్తూ పోటీదార్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. జియో మొబైల్ తో అనుసంధానించి ఉచితంగా అందిస్తున్న మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ జియో సావన్, టీవీ ఛానెళ్ళ స్ట్రీమింగ్ సర్వీస్ జియో టీవీ, ఆన్‌లైన్ షాపింగ్ యాప్ జియో మార్ట్, క్లౌడ్ ఆధారిత బ్యాకప్ సర్వీస్ జియో క్లౌడ్ సహా అనేక ఇతర సేవలు జియో మొబైల్ ని పాపులర్ చేశాయి. ఈ సేవల్ని జియో సినిమా ఓటీటీ సర్వీ సుకి బదలాయించే యోచనతో వుందిప్పుడు.

ఈ మోడల్ సరీగ్గా అమెజాన్ ప్రైమ్ అందిస్తున్న మోడల్ కి పోటీగా నిలుస్తుంది. పైన పేర్కొన్న అన్ని సేవల్ని జియో ఒకే గొడుగు కిందకి తీసుకు వస్తే, అది భవిష్యత్తులో దేశీయ ఓటీటీ పరిశ్రమపై ఆధిపత్యంతో బాటు, ఇతర ఓటీటీ కంపెనీల్ని రంగం నుంచి తప్పించే సామర్ధ్యంతో వుండగలదని ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలోనే జియో సినిమా తలపెట్టిన కొత్త స్ట్రీమింగ్ మోడల్ రోజుకొక ఎపిసోడ్ సిరీస్. దీనికి జూన్ ఒకటిన ‘అసుర్- సీజన్ 2’ తో శ్రీకారం చుట్టింది. రోజుకొక ఎపిసోడ్ చొప్పున స్ట్రీమింగ్ చేస్తూంటే విశేష స్పందన వచ్చింది. మూడు రోజుల్లో మూడు ఎపిసోడ్లు విడుదల చేశారో లేదో- మొత్తం 8 ఎపిసోడ్లు ఒకేసారి ఆన్ లైన్లో లీక్ అయిపోయాయి!

దీంతో విధిలేక మిగిలిన 5 ఎపిసోడ్స్ ని స్ట్రీమింగ్ చేసేసి పునరాలోచనలో పడింది జియో సినిమా. జియో సినిమా 'రోజుకు ఒక ఎపిసోడ్' విడుదల మోడల్ ఒక పాఠం కూడా అయింది ఇతర ఓటీటీలు నేర్చుకోవడానికి. ఈ మోడల్ ని ప్రవేశ పెట్టడానికి జియో తార్కిక దృక్కోణం ఏమిటంటే, ప్రేక్షకుల్లో గణనీయ భాగం ఓటీటీ కంటెంట్ మొత్తం సీజన్‌ ని ఒకేసారి చూడడం కంటే, 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు సమయాన్ని వెచ్చించి ఒక ఎపిసోడ్ మాత్రమే చూస్తారు. ఒక పూర్తి నిడివి సినిమాని కొన్ని దఫాలుగా చూసే ప్రేక్షకులూ వున్నారు. కేవలం వారాంతాల్లో కానీ, వారాంతపు రోజుల్లో గానీ అతిగా వీక్షిస్తారు. కాబట్టి రోజుకు ఒక ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేయడం జియో సినిమా తెలివైన వ్యూహంగానే కనిపిస్తుంది.

కానీ ఓటీటీ కంటెంట్‌ని అతిగా వీక్షించే సమయం వుండే విద్యార్థులు, గృహిణులు, రిటైర్డ్ వ్యక్తులు మొదలైన వారికి 'రోజుకు ఒక ఎపిసోడ్' విడుదల మోడల్ నిరాశ కలిగించవచ్చు. అయితే ఈ మోడల్ కరెక్ట్ కాదని పైరసీదార్లు జియో సినిమాని కరెక్ట్ చేశారు. ‘అసుర్- సీజన్ 2’ పౌరాణిక థ్రిల్లర్ వెబ్ సిరీస్ అన్ని ఎపిసోడ్స్ ని ప్రేక్షకులకి ఒకేసారి అందించేశారు. వివిధ పైరసీ సైట్‌లు హెచ్ డీ ఫార్మాట్‌లో పూర్తి సీజన్‌ ని అప్ లోడ్ చేసేశాయి. అనేక టొరెంట్ సైట్‌లలో, ఆన్‌లైన్‌లో లీక్ అయిన పూర్తి వెబ్ సిరీస్ ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. టెలిగ్రామ్ వంటి అప్లికేషన్‌లలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అందుబాటులో వుంచాయి.

జూన్ 1న జియో సినిమాలో విడుదలైన ‘అసుర్-సీజన్ 2’ బాగా హిట్టయి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో వుంది. దీంతో బాటు Onlinemoviewatches, 123movies, 123movierulz, Filmyzilla పైరసీ సైట్లలో కూడా ట్రెండింగ్ లో వుంది.

వినోద రంగంలో పైరసీ అనేది ప్రధాన సమస్య, దీన్ని ప్రేక్షకులు మాత్రమే అరికట్టగలరు. కాపీరైట్ తో వున్న సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయడం వల్ల కలిగే ప్రతికూల పరిణామాల గురించి ప్రేక్షకులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. చట్టం నుంచి తక్షణ ప్రమాదం లేకున్నా, ఈ డౌన్ లోడ్ల ద్వారా మొబైళ్ళలో, కంప్యూటర్లలో మాల్వేర్ జొరబడి వ్యక్తిగత సమాచారం స్వాహా అయిపోతుంది.

‘అసుర్’ మొదటి సీజన్‌ ని తన్వీర్ బుక్‌వాలా నిర్మించారు. దీన్ని జియో ‘వూట్’ ఓటీటీ ద్వారా ప్రసారం చేసింది. రెండవ సీజన్‌ ని బొంబాయి ఫేబుల్స్, సెజల్ షా, భవేష్ మండలియా గౌరవ్ శుక్లా నిర్మించారు. ఇది జియోసినిమాలో ప్రసారమైంది. ఈ వెబ్ సిరీస్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం కథ. తనని తాను అసుర కాళీ అవతారంగా ప్రకటించుకున్న సీరియల్ కిల్లర్ ని పట్టుకునే కథ. దీనికి ఓని సేన్ దర్శకుడు. అర్షద్ వార్సీ, బరున్ సోబ్తి, అనుప్రియ గోయెంకా, రిధి డోగ్రా నటీనటులు.



First Published:  11 Jun 2023 12:17 PM IST
Next Story