ఒకే సినిమాలో మూడు భాషల హీరోలు.. ఇది పానిండియా పుణ్యమే
ఇప్పుడు ఒక భాషలో పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమా రూపొందుతోందంటే అది దేశంలోని అన్ని భాషల్లో విడుదల అవుతోంది. దీంతో ఇన్నాళ్లు ఒక్క భాషకే పరిమితం అవుతూ వచ్చిన పలువురు హీరోలు, నటులు సొంత భాషలోనే కాకుండా ఇతర భాషల్లో రూపొందుతున్న సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
బాహుబలికి ముందు వరకు సౌత్ చిత్రాలకు నార్త్‌లో పెద్దగా మార్కెట్ ఉండేది కాదు. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ సినిమాలకు సొంత రాష్ట్రాల్లో మాత్రమే మార్కెట్ ఉండేది. తెలుగు సినిమాలకు కన్నడతో పాటు మలయాళంలో కొంత మార్కెట్ ఉండేది. తమిళ సినిమాలకు తెలుగు, కన్నడలో ఆదరణ దక్కేది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో రూపొందే సినిమాలకు ఓవర్సీస్‌లోనూ కొంత మార్కెట్ ఉండేది. దీంతో లో బడ్జెట్‌లోనే సినిమాలు చేసుకోవాల్సిన పరిస్థితి. అలాగే హీరోలు కూడా సొంత భాషలో నటించేందుకు మాత్రమే ఇష్టపడేవారు.
అయితే రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా విడుదల తర్వాత సౌత్‌లో నిర్మిస్తున్న సినిమాలకు బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు రావడంతో పాటు మార్కెట్ పెరిగింది. బాహుబలి తర్వాత అక్కడ కేజీఎఫ్, కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ -2, కాంతారా వంటి సినిమాలు సంచలన విజయం సాధించాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డైరెక్టర్ రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో పరభాష నటులకు కూడా పెద్దపీట వేశారు.
ఇప్పుడు ఒక భాషలో పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమా రూపొందుతోందంటే అది దేశంలోని అన్ని భాషల్లో విడుదల అవుతోంది. దీంతో ఇన్నాళ్లు ఒక్క భాషకే పరిమితం అవుతూ వచ్చిన పలువురు హీరోలు, నటులు సొంత భాషలోనే కాకుండా ఇతర భాషల్లో రూపొందుతున్న సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పలు పాన్ ఇండియా సినిమాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన యాక్టర్స్ నటిస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సలార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు మరో కీలక పాత్రలో మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప-2 సినిమాలో మలయాళ హీరో ఫహద్ పాజిల్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా ఇందులో ఓ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కోలీవుడ్‌లో రజనీకాంత్ హీరోగా ప్రస్తుతం జైలర్ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం ప్రముఖ కన్నడ హీరో శివరాజ్ కుమార్ జతకలిశారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ ఓ పాత్ర చేస్తున్నాడు. బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రానున్న మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ రామ్ పాల్‌ని ఎంపిక చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని ప్రేక్షకులకు వివిధ భాషలకు చెందిన నటులను ఒకే సినిమాలో చూసే అవకాశం దక్కింది.