నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ జల్‌పల్లిలోని నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. మంచు విష్ణు, మంచు మనోజ్ బౌన్సర్లు మధ్య వాగ్వాదం జరిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మనోజ్‌ను విష్ణు బౌన్సర్లు అడ్డుకుని బయటకు తోసేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అంతకు ముందు తన ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్ మరోసారి స్పందించారు. తాను ఆస్తులు, డబ్బు కోసం పోరాటం చేయడం లేదని అన్నారు.
తాను కేవలం ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నానని తాజాగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తన ఇంటి దగ్గర హైడ్రామా నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. "నాకు న్యాయం జరగడం లేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను రక్షణ అడిగితే నా అనుచరులను బెదిరిస్తున్నారు. నాకు న్యాయం జరిగేవరకూ అందరినీ కలుస్తా. నా బిడ్డలు ఇంట్లో ఉండగా దాడి చేయడం సరికాదు. నా భార్యాపిల్లలకు రక్షణ కరవైంది. నా భార్యాపిల్లల రక్షణ కోసం బౌన్సర్లను తెచ్చుకున్నా. మా బౌన్సర్లను ఎందుకు బయటకు పంపారు. నేను డబ్బు, ఆస్తి కోసం పోరాటం చేయడం లేదు. నా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాను" అని మంచు మనోజ్ తెలిపారు.