118 నిర్మిస్తే 7 మాత్రమే హిట్లు!
2023 జనవరి-జూన్ తొలి 6 మాసాల్లో తెలుగు సినిమాలు వివిధ హీరోలతో వివిధ జానర్లలో పుష్కలంగా విడుదలయ్యాయి.
2023 జనవరి-జూన్ తొలి 6 మాసాల్లో తెలుగు సినిమాలు వివిధ హీరోలతో వివిధ జానర్లలో పుష్కలంగా విడుదలయ్యాయి. మాస్ యాక్షన్, స్పై, పౌరాణికం, సామాజికం, రోమాంటిక్ కామెడీ, రోమాంటిక్ డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్, హార్రర్, అడ్వెంచర్ మొదలైన జానర్లలో ప్రేక్షకుల్ని మెప్పించడానికి, ఓటీటీల్ని ఆకర్షించడానికీ విపరీతంగా పోటీ పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచీ వూరు పేరు తెలియని కొత్త హీరోల వరకూ బాక్సాఫీసు రణరంగంలో తలబడ్డారు. చిరంజీవి, బాలకృష్ణ, ధనుష్, నాని, సాయి ధరమ్ తేజ్, ప్రియదర్శి, సుహాస్, శ్రీవిష్ణు మాత్రమే బావుటా ఎగరేసి; ప్రభాస్, రవితేజ, కళ్యాణ్ రామ్, నాగచైతన్య, అఖిల్, గోపీచంద్, నరేష్, నిఖిల్, సుధీర్ బాబు, విశ్వక్ సేన్, నాగ శౌర్య, బెల్లంకొండ గణేష్, సిద్ధార్థ్, సంతోష్ శోభన్, కిరణ్ అబ్బవరం, సమంత ప్రభృతులు సిగ్నల్స్ దించేశారు.
ఇక 86 మంది కొత్త హీరోలందరూ ఫిలిం రీళ్ళ కాలపు సినిమాలతో బాక్సుల్లో చేరిపోయి డిస్పోజల్ కి సిద్ధంగా వున్నారు. ఈ ఆరు మాసాల కాలంలో రికార్డు బ్రేక్ చేస్తూ 118 సినిమాలు విడుదలయ్యాయి. సగటున నెలకి 20 సినిమాలు. వారానికి 5 సినిమాలు. ప్రతిరోజూ 0.83 సినిమా తీసి ప్రేక్షకుల చేతుల్లో పెట్టారు. 118 సినిమాల్లో ప్రముఖ హీరోలు నటించినవి 31 అయితే, కొత్త హీరోలతో తీసినవి 87. ప్రముఖ హీరోలు నటించిన 31 లో 7 మాత్రమే హిట్టయితే, 24 ఫ్లాపయ్యాయి. ఇక కొత్త హీరోల మొత్తం 87 సినిమాలూ అట్టర్ ఫ్లాపయ్యాయి. విడుదలైన మొత్తం 118 సినిమాల్లో 7 మాత్రమే హిట్టయితే, మిగిలిన 111 సినిమాలూ ఫ్లాపయ్యాయి. విజయాల శాతం 5.93 మాత్రమే.
‘వాల్తేరు వీరయ్య’ (చిరంజీవి), వీర సింహా రెడ్డి (బాలకృష్ణ), ‘సార్’ (ధనుష్), ‘దసరా’ (నాని), ‘విరూపాక్ష’ (సాయి ధరమ్ తేజ్), ‘బలగం’ (ప్రియదర్శి), “రైటర్ పద్మభూషణ్’ (సుహాస్), ‘సామజవరగమన’ (శ్రీవిష్ణు) హిట్టయిన సినిమాలు.
ప్రముఖ హీరోల ఫ్లాపయిన సినిమాలు- ‘ఆదిపురుష్’ (ప్రభాస్), ‘రావణాసుర’ (రవితేజ), ‘అమిగోస్’ (కళ్యాణ్ రామ్), ‘కస్టడీ’ (నాగచైతన్య), ‘ఏజెంట్’ (అఖిల్), ‘రామబాణం’ (గోపీచంద్), ‘ఉగ్రం’ (నరేష్), ‘స్పై’ (నిఖిల్), ‘హంట్’ (సుధీర్ బాబు), ‘దాస్ కా ధమ్కీ’ (విశ్వక్ సేన్), ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (నాగ శౌర్య), ‘నేను స్టూడెంట్ సార్’ (బెల్లంకొండ గణేష్), ‘టక్కర్’ (సిద్ధార్థ్), ‘శ్రీదేవీ శోభన్ బాబు’, ‘అన్నీ మంచి శకునములే’ (సంతోష్ శోభన్), ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మీటర్’ (కిరణ్ అబ్బవరం), ‘మళ్ళీ పెళ్ళి’ (నరేష్), ‘పరేషాన్’ (తిరువీర్), ‘శాకుంతలం’ (సమంత) ప్రభృతులు సిగ్నల్స్ దించేశారు.
ఏ సంవత్సరం చూసినా అత్యధికంగా చిన్న సినిమాలే వుంటాయి. ఈ ఆరునెలల కాలంలో 87 సినిమాలతో 74 శాతం చిన్న సినిమాలు మార్కెట్ ని ఆక్రమించాయి. ఇవన్నీ చిరునామా లేకుండా పోయాయి. అయినా ఇదే సంఖ్యలో వస్తూనే వుంటాయి. ముప్పాతిక శాతం చిన్న సినిమా ల్ని తీసేస్తే, పాతిక శాతం ప్రముఖ హీరోల సినిమాలతోనే మార్కెట్ నడుస్తూంటుంది. వీటిలో మళ్ళీ విజయాలు 5 శాతమే. సినిమాల నాణ్యత దగ్గర వస్తోంది సమస్య. నాణ్యత లోపిస్తే వందల కోట్లు వెచ్చించి తీసిన ‘ఆదిపురుష్’ లాంటి పానిండియా సినిమాల్ని కూడా తిప్పి కొడుతున్నారు ప్రేక్షకులు. హిట్టయితే ఎందుకు హిట్టయ్యిందో, ఫ్లాపైతే ఎందుకు ఫ్లాపయ్యిందో నాణ్యతా ప్రమాణాల మూల్యాంకన లేకపోవడం వల్ల ఈ సమస్య.
నెట్ ఫ్లిక్స్ యుగంలో హాలీవుడ్ స్టూడియోలు ఏ సినిమాలు నిర్మించాలి, ఏవి నిర్మించకూడదు, నిర్మించే వాటిని ఎలా నిర్మించాలీ అనే విషయంలో నిశ్శబ్దంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) నుపయోగించుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. వాళ్ళ మార్కెట్ రీసెర్చిలు, ఆడియెన్స్ సర్వేలూ ఎలాగూ వుంటాయి. సినిమాల్ని ఎలా పంపిణీ చేయాలీ అనే దానిపై వ్యూహాత్మక నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో కూడా పరిశీలించ వచ్చు. స్టూడియో ఎగ్జిక్యూటివ్‌లు ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించే కీలక ప్రమాణాలు నిర్దేశించి వుంటాయి.
తెలుగులో హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొడితేనే సరిపోదు, వాళ్ళ వ్యాపార మోడల్ ని కూడా కాపీ కొడితేనే ఏవైనా ఫలితాలు వస్తాయి. వ్యాపార మోడల్ సినిమాలు తీయడానికి అవసరమైన క్రియేటివ్ మోడల్స్ తో ముడిపడి వుంటుంది. ఈ రెండు మోడల్స్ లేక ఏ మోడల్లో తెలుగు సినిమాలు తీసినా విజయాల శాతం పెరిగే అవకాశం లేదు. డిజిటల్ యుగంలో ఫిలిం రీళ్ళ కాలపు సినిమాలే మార్కెట్లోకి వస్తూంటాయి.