Telugu Global
Cinema & Entertainment

ఇలా తెలుగులో తంటాలు పడితే బెటర్!

2023 లో ఇప్పటి వరకు విడుదలైన 8 పానిండియాలూ ఫ్లాపే. కాబట్టి చివరికి తేలేదేమంటే, తెలుగులోనే హిట్టయ్యే లక్షణాలు కనబడకపోతే పానిండియా అవదు. లోకల్ కంటెంట్ తో తెలుగు సినిమా తీస్తే పానిండియా అవదు.

ఇలా తెలుగులో తంటాలు పడితే బెటర్!
X

“చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ తెలుగులో పెద్ద హిట్ అందుకున్నాడు. తెలుగులో మంచి బిజినెస్ చేసిన తర్వాత, ఇప్పుడు దీని నిర్మాతలు హిందీలో విడుదల చేయాలని కలలు కన్నారు. ఈ సినిమా హిందీలో డబ్ చేసి విడుదల చేస్తున్నా, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని చాలా మంది ప్రేక్షకులకి ఇప్పటికీ దీని గురించి తెలియదు...” మే నెలలో ప్రముఖ హిందీ దిన పత్రిక ‘అమర్ ఉజాలా’ లో తెలుగు పానిండియా సినిమా ‘విరూపాక్ష’ రివ్యూలో పై విధంగా పేర్కొన్నారు. ఇదే కాదు తెలుగు నుంచి పానిండియా పేరుతో ఐదేసి భాషల్లో విడుదలవుతున్న చాలా సినిమాలకి హిందీ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఈ సినిమాల గురించి అక్కడ ప్రచారమే చెయ్యక అక్కడి బయ్యర్లకి వదిలేస్తున్నారు. దర్శకుడు, హీరోహీరోయిన్లు తిరిగి ప్రచారం చేస్తే గానీ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళే అవకాశం లేదు. ఈ పని చేయడం లేదు. ఒక్క ‘టైగర్ నాగేశ్వరరావు’ కి సంబంధించి మాత్రం రవితేజకి హిందీ వచ్చు కాబట్టి అక్కడ విస్తృతంగా పర్యటించి ప్రమోట్ చేశారు. అయినా ‘టైగర్ నాగేశ్వరరావు’ ని కూడా హిందీ ప్రేక్షకులు పట్టించుకోలేదన్నది వేరే విషయం.

‘టైగర్ నాగేశ్వర రావు’ హిందీ వెర్షన్ ముంబాయి, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, కోల్ కత, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, చండీఘర్, భోపాల్, లక్నో 10 కేంద్రాల్లో విడుదలైంది. ఈ పది కేంద్రాల్లో కోల్ కత తప్పించి, గత ఏడు రోజులుగా 5.33%-10.50% మాత్రమే ఆక్యుపెన్సీ తో షోలు పడ్డాయి. కోల్ కత లో ఐదు షోలు వేస్తే ఒక్కో షోకి ఆక్యుపెన్సీ అత్యధికంగా 36% నమోదైంది. దాదాపు ఇదే పరిస్థితి ఈ సంవత్సరం విడుదలైన - శాకుంతలం, దసరా, విరూపాక్ష, దాస్ కా ధమ్కీ, ఏజెంట్, స్పై, స్కంద మొదలైన 7 తెలుగు పానిండియాల హిందీ వెర్షన్లకీ ఎదురైంది.

ఈ సంవత్సరం ఇప్పటి వరకు ‘టైగర్ నాగేశ్వరరావు’ తో కలిపి మొత్తం 8 పానిండియాలు విడుదలయ్యాయి. వీటి హిందీ వెర్షన్లే కాదు, మిగతా తమిళ మలయాళ కన్నడ వెర్షన్లకీ ఇదే గతి పట్టింది. దీనికి ప్రధాన కారణం వీటిలో 6 తెలుగులోనే ఫ్లాపయ్యాయి. దసరా, విరూపాక్ష తప్పించి, శాకుంతలం, దాస్ కా ధమ్కీ, ఏజెంట్, స్పై, స్కంద, టైగర్ నాగేశ్వరారావు తెలుగులోనే ఫ్లాపయితే ఇతర భాషాల్లో ఎలా హిట్టవుతాయి. వీటిని ఇష్టారాజ్యంగా తీసి ఇతర రాష్ట్రాల్లో తెలుగు పానిండియాల పేరు దెబ్బతీయడమే.

ఈ సినిమాలు హిందీ రాష్ట్రాల్లో టీవీ ఛానెళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతాయి. అక్కడి ప్రేక్షకులకి తెలుగు సినిమాల హిందీ డబ్బింగులంటే చాలా క్రేజ్ వుంది. ప్రభాస్ ‘బాహుబలి’, అల్లు అర్జున్ ‘పుష్ప’ , రామ్ చరణ్ -ఎన్టీ ఆర్ ల ‘ఆర్ ఆర్ ఆర్’ పానిండియాల్ని అంత హిట్ చేశారంటే అంతకి ముందు 15 ఏళ్ళుగా ఈ హీరోలు ఛానెళ్ళ ద్వారా హిందీ డబ్బింగులతో బాగా పాపులర్ అవడమే కారణం. ప్రతితోజూ మధ్యాహ్నమైతే చాలు అక్కడి ఛానెళ్ళలో ఈ స్టార్ హీరోల డబ్బింగుల మోతే. రవితేజకీ కూడా డబ్బింగ్ స్టార్ గా అక్కడ తక్కువ పేరు లేదు. కానీ దీన్ని సద్వినియోగం చేసుకునేలా ‘టైగర్ నాగేశ్వర రావు’ తీయలేక పోయారు.

అక్కడ డబ్బింగ్ స్టార్ కాని విజయ్ దేవరకొండ ‘లైగర్’ (2022) విడుదలకి విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్యా పాండే, దర్శకుడు పూరీ జగన్నాథ్ లు నార్త్ లో విస్తృతంగా ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్స్ కి తరలి వచ్చిన వేలమంది ప్రేక్షకుల్ని చూసి బాలీవుడ్ స్టార్లు సైతం విస్తుపోయారు. తీరా చూస్తే సినిమా అట్టర్ ఫ్లాపయ్యింది. కారణం తెలుగులోనే ఫ్లాపవడం. అదే నిఖిల్ నటించిన ‘కార్తికేయ2’ నార్త్ లో ప్రమోట్ చేయకుండానే రూ. 20.11 కోట్లు రాబట్టింది. అన్ని భాషలు కలిపి రూ. 121 కోట్లు వసూలు చేసి పెద్ద హిట్టయ్యింది రూ. 15 కోట్లతో నిర్మించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్.

తెలుగులో వందల కోట్లతో తీస్తున్న ‘పుష్ప’, ‘ఆర్ ఆర్ ఆర్’ వంటి భారీ పానిండియా సినిమాల వైభవం చూసి తక్కువ బడ్జెట్ తో తీసిన ఏది పడితే అది పానిండియాగా ప్రచారం చేసి రిలీజ్ చేస్తున్నారు. వీటి హీరోలు బయటి రాష్ట్రాల్లో ఎవరికీ తెలియరు. ‘దసరా’ తో నాని, ‘స్కంద’ తో రామ్ పోతినేని, ఏజెంట్’ తో అఖిల్ అక్కినేని, ‘దాస్ కా ధమ్కీ’ తో విశ్వక్సేన్ బయటి రాష్ట్రాల్లో తెలియరు. ‘కార్తికేయ2’ తో నిఖిల్ గుర్తింపు పొందినా, ‘స్పై’ కంటెంట్ బాగాలేక ఫ్లాపయ్యింది. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ కంటెంట్ బావుండి తెలుగులో హిట్టయినా, సాయి ధరమ్ తేజ్ తెలియక, ప్రమోషన్ లేక బయట ఫ్లాపయ్యింది. ఇక సమంత జాతీయ స్థాయిలో పాపులరైనా, ‘శాకుంతలం’ యూనివర్సల్ సబ్జెక్టే అయినా, మేకింగ్ పరంగా విఫలమై ఫ్లాపయింది.

2023 లో ఇప్పటి వరకు విడుదలైన 8 పానిండియాలూ ఫ్లాపే. కాబట్టి చివరికి తేలేదేమంటే, తెలుగులోనే హిట్టయ్యే లక్షణాలు కనబడకపోతే పానిండియా అవదు. లోకల్ కంటెంట్ తో తెలుగు సినిమా తీస్తే పానిండియా అవదు. అందరు హీరోలూ పానిండియాకి సరిపోరు. పరభాషా నటీనటులు లేకుండా తెలుగు ముఖాలతోనే తీస్తే పానిండియా అవదు. యూనివర్సల్ కంటెంట్ తో బాగా తీసినా తగిన ప్రమోషన్ లేకపోతే పానిండియా అవదు. సరిదిద్దుకోవాల్సిన సమస్యలు ఇవీ. సరిదిద్దుకో లేకపోతే తెలుగులోనే తంటాలు పడడం బెటర్!

First Published:  27 Oct 2023 8:41 AM GMT
Next Story