రొటీన్ ఫార్ములాతో డీలా పడుతున్న తెలుగు సినిమా
తెలుగు సినిమాకు రొటీన్ ఫార్ములా అనే వైరస్ పట్టుకుంది. ఒకపక్క ఇండియన్ సినిమాను తనదైన స్టైల్‌లో ఏలేస్తున్న టాలీవుడ్
తెలుగు సినిమాకు రొటీన్ ఫార్ములా అనే వైరస్ పట్టుకుంది. ఒకపక్క ఇండియన్ సినిమాను తనదైన స్టైల్‌లో ఏలేస్తున్న టాలీవుడ్.. మరోవైపు అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీస్తూ నష్టాలు మూట కట్టుకుంటుంది. ఇటీవల వస్తున్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయాన్ని గమనించొచ్చు.
జనాలు థియేటర్లకు రావట్లేదని, తెలుగు సినిమా నష్టాల్లో ఉందని ఇటీవల ప్రొడ్యూసర్లంతా కలిసి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే సీతారామం, బంబిసార, కార్తికేయ సినిమాల సక్సెస్‌తో ప్రొడ్యూసర్లకు సరైన సమాధానం దొరికింది. 'థియేటర్ వరకూ రావాలంటే సరైన కంటెంట్ ఉండాలి' అని ప్రేక్షకులు రుజువు చేశారు. ఇదిలా ఉంటే రొటీన్ యాక్షన్ ఫార్ములాను నమ్ముకుని తీస్తున్న కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద డీలాపడుతున్నాయి.
మొన్నటివరకూ టాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలకు మాస్ జనం బాగా కనెక్ట్ అయ్యేవారు. ఒకే ఫార్మాట్లో ఉన్నప్పటికీ అలాంటి చిత్రాలు జనానికి బాగా నచ్చేవి. పవర్ ఫుల్ విలన్, అతడికి సవాల్ విసిరే యాక్షన్ హీరో. ఇద్దరికీ ఫైట్. కట్ చేస్తే హీరో చేతిలో విలన్‌కు చావు దెబ్బలు. ఇది ఒకప్పటి ఫార్ములా. అయితే ఇప్పుడు కంటెంట్ మారింది. ప్రేక్షకులూ మారారు. ఇది గ్రహించని కొందరు దర్శకులు ఇప్పటికే అదే రొటీన్ ఫార్ములాను ఫాలో అవుతూ ఫెయిల్ అవుతున్నారు. హీరో పాత్రలో మార్పులు చేస్తున్నారు తప్ప హీరో లక్ష్యం, చేసే పనులు, కథ ఒకేలా ఉంటున్నాయి.
ఇటీవల విడుదలైన రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, రామ్ పోతినేని 'ది వారియర్', నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమాలు ఇదే కోవకు చెందుతాయి. ఈ సినిమాలన్నీ రొటీన్ కథాకథనాలతో ప్రేక్షకుల్ని బోర్ కొట్టించి, బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. ఓటీటీ రాకతో కంటెంట్ కు, క్రియేటివిటీకి పెద్ద పీట వేస్తున్న ప్రేక్షకులు రొటీన్ కథలు చూడ్డానికి థియేటర్ వరకూ రారు అని దర్శకులు గ్రహించాలని ఆడియెన్స్ అంటున్నారు. ప్రొడ్యూసర్లు కూడా కమర్షియల్ కోణంతో పాటు కొత్తదనం, క్రియేటివిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.