తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలదే ఆధిపత్యం- నటి అమలాపాల్
న్యూడ్ వీడియోలతో తన మాజీ ప్రియుడు తనను బెదిరిస్తున్నాడంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచిన హీరోయిన్ అమలా పాల్
న్యూడ్ వీడియోలతో తన మాజీ ప్రియుడు తనను బెదిరిస్తున్నాడంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచిన హీరోయిన్ అమలా పాల్.. రెండో పెళ్లి వివాదంలోనూ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఆమె తెలుగు ఇండస్ట్రీలో నటించింది. అతి తక్కువ చిత్రాల్లోనే కాగా.. వాటివల్ల ఆమెకు వచ్చిన గుర్తింపు కూడా పెద్దగా ఏమీ లేదు. అదే అభిప్రాయంతోనే ఏమో తాజాగా ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలదే ఆధిపత్యం అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. తాజాగా మీడియాతో ఆమె మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో హీరోయిన్‌లను గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తారని ఆమె పేర్కొంది. కొన్ని పాటలు, ప్రేమ సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేస్తారని తెలిపింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, వారు కూడా గ్లామర్ పాత్రలకే పరిమితమని వివరించింది.
తెలుగు సినిమాల్లో ఎక్కువ శాతం కమర్షియల్‌గానే ఉంటాయని ఆమె తెలిపింది. అందుకే ఆ ఇండస్ట్రీకి తాను చేరువవలేకపోయానని చెప్పింది. తన సినిమా కెరీర్‌ను తమిళ ఇండస్ట్రీతో ప్రారంభించడం తన అదృష్టమని ఈ సందర్భంగా చెప్పింది. కొత్త హీరోయిన్ల కోసం వెతుకుతున్నప్పుడు తాను తాను కోలీవుడ్‌లోకి అడుగు పెట్టానని తెలిపింది. అయితే తాను నటించిన తొలి రెండు చిత్రాలూ నేటికీ విడుదల కాలేదని చెప్పింది. మూడో చిత్రం `మైనా` మంచి విజయం సాధించడంతో ఒక్కసారిగా తనకు స్టార్‌డమ్ వచ్చిందని వివరించింది.
తెలుగులో చివరగా `పిట్ట కథలు` చిత్రంలో నటించిన అమలా పాల్.. తొలి చిత్రం మాత్రం `లవ్ ఫెయిల్యూర్`. నానితో `జెండాపై కపిరాజు`, అల్లు అర్జున్‌తో `ఇద్దరమ్మాయిలతో`, నాగ చైతన్యతో `బెజవాడ`, రామ్‌చరణ్‌తో `నాయక్` చిత్రాల్లో అలరించిన అమలా పాల్.. తెలుగు సినిమాల్లో నటించింది చాలా తక్కువ చిత్రాలే. ఆమె ధనుష్‌తో కలసి నటించిన `రఘువరన్ బీటెక్` చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు చిత్రాల్లో ఇప్పటివరకు అమలా పాల్ 43 చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె నటించిన `కడవర్` చిత్రం ఓటీటీలో విడుదలైంది.