కరెంటు బిల్లులు కట్టలేక షోలు క్యాన్సిల్!
యాజమాన్యాలు కరెంటు బిల్లులు కట్టలేక షోలు రద్ధు చేసి కూర్చుంటున్నారనీ, పరిస్థితి ఆగమ్య గోచరంగా వుందనీ, ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు శ్రీధర్ పిళ్ళై ట్విట్టర్ వేదికగా నిర్మాతల దృష్టికి తెచ్చారు.
తమిళనాడులో సినిమా థియేటర్లు ఎదుర్కొంటున్న సవాళ్ళు నిర్మాతలకి పట్టడం లేదని ట్రేడ్ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ ఒక్కరూ పట్టణ ప్రేక్షకుల్ని మర్చిపోయి మెట్రో నగరాల ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడంలో పడ్డారని, దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ మెట్రో సిమాలకి ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ అవుతున్నాయనీ విమర్శిస్తున్నారు. యాజమాన్యాలు కరెంటు బిల్లులు కట్టలేక షోలు రద్ధు చేసి కూర్చుంటున్నారనీ, పరిస్థితి ఆగమ్య గోచరంగా వుందనీ, ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు శ్రీధర్ పిళ్ళై ట్విట్టర్ వేదికగా నిర్మాతల దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో అటు బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ హిందీ సినిమాలు అర్బన్ సినిమాలుగా - మాస్ సినిమాలుగా విభజన జరిగి, మాస్ సినిమాలు బాలీవుడ్ నుంచి వివక్ష నెదుర్కొంటున్నాయనీ ట్వీట్ చేశారు.
సౌత్- నార్త్ సినిమా పరిశ్రమలు పానిండియా మార్కెట్ లో పాగా వేయాలని చూస్తున్నందువల్ల ఈ పరిస్థితి. స్టార్లు పానిండియా సినిమాలు డిమాండ్ చేస్తున్నారు, నిర్మాతలు వందల కోట్లు తెచ్చి ధారబోస్తున్నారు. దర్శకులు హింస, బీభత్స భయానకాలు జోడించి పరమ సీరియస్ చీకటి సినిమాలు (డార్క్ మూవీస్) తీస్తున్నారు. దీంతో పట్టణ, పల్లె ప్రేక్షకుల నవరసాల కలర్ఫుల్ మాస్ ఎంటర్ టైనర్లు కరువై సింగిల్ స్క్రీన్ థియేటర్లు దిక్కులు చూస్తున్నాయి. ఇలా ఒకే మూసలో తీస్తున్న పానిండియా సినిమాలన్నీ చాలావరకూ ఫ్లాపే అవుతున్నాయి.
ఈ వారం రవితేజ ‘ఈగల్’ ని ‘సహదేవ్’ గా హిందీలో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు పట్టించుకోలేదు. దీనికి ముందు ‘టైగర్ నాగేశ్వరరావు’ ని కూడా పట్టించుకోలేదు. అక్కడి మాస్ సెంటర్లలో. రవితేజతో బాటు ఇంకా చాలా మంది తెలుగు స్టార్లు ఇంటింటా టీవీ ఛానెల్స్ లో హిందీ డబ్బింగుల ద్వారా బాగా చేరువయ్యారు. హిందీ డబ్బింగులతో ప్రభాస్ అక్కడ ఇంటింటా పాపులరవక పోతే ‘బహుబలి’ లో తనెవరో తెలిసేవాడు కాదు. సినిమాకి అంత వూపూ వచ్చేది కాదు.
రవితేజ కూడా హిందీ డబ్బింగులతో నార్త్ లో మాస్ హీరోగా పాపులర్ అయిన వాడే. అలాటిది చీకటి సినిమాలతో నార్త్ కి వెళ్తే చెల్లు చీటీ లభిస్తోంది. తెలుగులోనూ తనకి ఇదే పరిస్థితి. 2024 ప్రారంభం తమిళ సినిమాలకి గొప్ప ప్రారంభం కాదు. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివకార్తికేయన్ ‘ఆయలాన్’ రెండు స్టార్ సినిమాలు ఫ్లాపయ్యాయి. ఈవారం రజనీకాంత్ ‘లాల్ సలాం’ కూడా ఫ్లాపయ్యింది. కొత్త సినిమాల థియేటర్ రన్ ఒక వారానికి తగ్గించేశారు. కొన్ని సందర్భాల్లో వారాంతపు మూడు రోజులకే తగ్గించేశారు. విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో మధ్యాహ్నం ఆట రద్ధు చేస్తున్నారు. పనిదినాలలో ఉదయం ఆటలు కూడా రద్దు చేస్తున్నారు. ప్రేక్షకులు సరిగ్గా థియేటర్లకి రాకపోవడంతో క్యాంటీన్ల విక్రయాలు అంతంత మాత్రంగానే వుంటున్నాయి.
ఇక ఓటీటీలకి పెరుగుతున్న ఆదరణ వల్ల మెట్రో ప్రేక్షకులు కూడా థియేటర్లకి దూరంగా వుంటున్నారు. నెలలోపు సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తూంటే థియేటర్లకి వెళ్ళడం మానేస్తున్నారు. వచ్చే రెండు నెలల్లో డజనుకి పైగా తమిళ సినిమాలు విడుదలవుతాయి. ఇదేమైనా పరిస్థితిలో మార్పు తెస్తుందేమోనని ఆశలు పెట్టుకుంటున్నారు.
బాలీవుడ్ లో అర్బన్ సినిమా- మాస్ సినిమా అనే విభజనకి బాధ్యత ప్రేక్షకులపై లేదని, మెట్రోపాలిటన్ ప్రాంతాలకి మించి ప్రతిధ్వనించే కంటెంట్ ని రూపొందించడానికి కష్టపడే నిర్మాతలపై పూర్తి బాధ్యత వుందనీ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అభిప్రాయం. తప్పు సినిమా చూసే ప్రేక్షకులది కానే కాదని, కానీ సినిమా నిర్మాతలు / దర్శకులు ప్రేక్షకులకి మహానగరాలకి మించి మిగతా ప్రాంతాల్లో ప్రతిధ్వనించే మాస్ కంటెంట్ ని అందించలేక పోతున్నారనీ, సినిమా వ్యాపారంలో ఈ అసమానత మాస్ సెంటర్లని దూరంగా వుంచుతోందనీ అభిప్రాయపడ్డాడు. దీనికి ఇటీవలి తాజా ఉదాహరణల్ని పేర్కొన్నాడు : షారుఖ్ ఖాన్ ‘డంకీ’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమాలు. ఈ రెండూ అర్బన్ సెంటర్స్ గా- మాస్ పాకెట్స్ గా సినిమా వ్యాపార క్షేత్రాల్ని ఎలా విభజించాయో చెప్పాడు. ‘డంకీ’ మాస్ పాకెట్స్ దాకా ప్రతిధ్వనించి వసూళ్ళు చేస్తే, ‘ఫైటర్’ అర్బన్ సెంటర్స్ కి పరిమితమై విఫలమైందన్నాడు.
ఓటీటీలకి ఈ నాలెడ్జి ఎక్కువుంది. పల్లెలదాకా చొచ్చుకు వెళ్తూ అక్కడి ప్రాంతీయతలతో వెబ్ సిరీస్ నీ, ఓటీటీ మూవీస్ నీ రూపొందించుకుని ఏ ప్రణాళికా లేని సినిమాలకి గట్టి పోటీ నిస్తున్నాయి. ఇలా ప్రాంతీయంగా ‘ఆహా’ లాంటి ఓటీటీలు దేశంలో 40 కి పైగా వున్నాయి. సినిమా అనేది మాస్ మీడియా. పానిండియా చీకటి గుయ్యరాల మాఫియా బీభత్సాలే అనుకుంటే స్టార్లు మసక బారిపోతారు. నాకో ‘కేజీఎఫ్’ కావాలి, నాకో ‘విక్రమ్’ కావాలీ అంటారేగానీ, ఒకసారి ‘జైలర్’ కూడా కావాలని అడిగి చూస్తే బావుంటుంది. నార్త్ లో హిందీ ‘జైలర్’ ఓటీటీ విండో కారణంగా నగరాల్లో మల్టీప్లెక్సుల్లో విడుదల కాలేదు. సింగిల్ స్క్రీన్స్ లోనే పల్లెల దాకా వెళ్తే 600 కోట్లు వచ్చాయి. నిర్మాత రజనీకి వంద కోట్లు అదనంగా చెక్కు అందించి ట్వీట్ చేయగలిగాడు.