Tamil Directors: ఇంకా అరవ దర్శకుల కస్టడీలోనే తెలుగు స్టార్లు!
Tamil Directors: తమిళ డైరెక్టర్లు టాలీవుడ్ లోకి వచ్చారంటే స్టార్స్ తోనే తీస్తారు. తెలుగు స్టార్స్ కి కూడా తమిళ దర్శకులంటే అంత ఆకర్షణ.
తెలుగు సినిమాలతో తమిళ దర్శకుల అనుబంధం ఈనాటిది కాదు. 1960 లలో కృష్ణన్- పంజు దర్శకత్వంలో ‘లేత మనసులు’ తీస్తే పెద్ద మ్యూజికల్ హిట్టయ్యింది. 1970 లలో ఏ భీమ్ సింగ్ ‘ఒకే కుటుంబం’ తీస్తే హిట్టయ్యింది. మళ్ళీ తర్వాత ‘కరుణామయుడు’ తీస్తే సూపర్ హిట్టయింది. 1980 లలో ఎస్ ఏ చంద్ర శేఖర్ ‘దేవాంతకుడు’, ‘చట్టానికి కళ్ళు లేవు’ తీస్తే హిట్టయ్యాయి. ఇక కె బాలచందర్ గురించి చెప్పక్కర్లేదు- 1960 లలో ‘భలే కోడళ్ళు’ నుంచీ 1980 లలో ‘రుద్రవీణ’ వరకూ 12 తెలుగు సినిమాలు తీస్తే ఓ రెండు తప్ప అన్నీ హిట్టయ్యాయి- ‘అంతులేని కథ’, ‘మరో చరిత్ర’, ‘ఆకలి రాజ్యం’, ‘గుప్పెడు మనసు’, ’47 రోజులు’, ‘ఇది కథ కాదు’ మొదలైనవి. భారతీ రాజా తీసిన ‘జమదగ్ని’ తప్ప ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’ రెండూ హిట్సే. సురేష్ కృష్ణన్ కూడా ‘ప్రేమ’, ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘ధర్మ చక్రం’, ‘మాస్టర్’ వంటి తెలుగు హిట్స్ ఇచ్చిన తమిళ దర్శకుడే. మణిరత్నం ‘గీతాంజలి’, భాస్కర్ ‘బొమ్మరిల్లు’, విక్రమ్ కుమార్ ‘మనం’, కరుణాకరన్ ‘తొలిప్రేమ’, ఎస్ జె సూర్య ‘ఖుషీ’... ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పదేళ్ళ క్రితం వరకూ తెలుగులో తమిళ దర్శకుల వైభవం బాగానే వుండేది. తర్వాత వరస పరాజయాల పరంపరతో మసకబార సాగింది వైభవం.. ఫ్రెష్ గా తమిళంలో ‘మానాడు' (2021), 'మన్కంఠ' (2011), 'చెన్నై 600026' (2007) వంటి హిట్స్ తీసిన దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగులో నాగచైతన్యతో ‘కస్టడీ’ తీసినా ఫ్లాపయ్యింది.
తమిళ డైరెక్టర్లు టాలీవుడ్ లోకి వచ్చారంటే స్టార్స్ తోనే తీస్తారు. తెలుగు స్టార్స్ కి కూడా తమిళ దర్శకులంటే అంత ఆకర్షణ. అయితే తమిళ దర్శకులు తెలుగు స్టార్స్ కి ఫ్లాప్సే ఇస్తున్నారన్న విషయం స్టార్స్ తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మి నటించుకుంటూ పోతున్నారు. కోలుకోలేని దెబ్బ తింటున్నారు.
ఏ ఆర్ మురుగ దాస్ మహేష్ బాబుతో ‘స్పైడర్’, ఎస్ జె సూర్య మహేష్ బాబుతో ‘నాని’ తీసి ఫ్లాప్స్ ఇచ్చారు. విజయ్ దేవరకొండతో ఆనంద్ శంకర్ తీసిన ‘నోటా’, రామ్ పోతినేని తో లింగుస్వామి తీసిన 'ది వారియర్’, ఆనంద్ దేవరకొండతో కెవి గుహన్ తీసిన 'హైవే' కూడా దారుణంగా ఫ్లాపయ్యాయి.
సమంత ప్రధాన పాత్రలో 'యశోద' కి దర్శకత్వం వహించిన హరి-హరీష్ లు, బాలకృష్ణతో 'రూలర్‌లో తీసిన కె ఎస్ రవికుమార్, నాగార్జునతో 'బావ నచ్చాడు' తీసిన ఇదే రవికుమార్ ఫ్లాప్ దర్శకులుగా మిగిలిపోయారు. పవన్ కళ్యాణ్ తో 'బంగారం’ తీసి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తమిళ దర్శకుడు ధరణి దారుణంగా విఫలమయ్యాడు. ఎస్ జె సూర్య మళ్ళీ పవన్ కళ్యాణ్ తో ‘కొమురం పులి’ తీసి ఫ్లాప్ తో సరిపెట్టాడు. విష్ణు వర్ధన్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటించిన 'పంజా' కూడా ఫ్లాపయ్యింది.
ఇక దర్శకుడు ప్రభు సాలమన్, రానాతో 'అరణ్య’ తీసి పరాజయం మిగిల్చాడు. తమిళ దర్శకులతో నాని నటించిన మూడు సినిమాలూ డిజాస్టర్లుగా నిలిచాయి. అంజనా అలీఖాన్‌తో ‘సెగ’, గౌతమ్ మీనన్‌తో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’, సముద్రకనితో ‘జెండాపై కపిరాజు’ మూడూ పరాజయాలే.
నాగ చైతన్య తనకి ‘ఏ మాయ చేశావే’ అనే హిట్టిచ్చిన గౌతమ్ మీనన్ తో ‘సాహసం శ్వాసగా సాగిపో తీస్తే పరాజయం పాలైంది. గోపీచంద్ హీరోగా నటించిన 'శంఖం' సినిమాతో డైరక్టర్ గా పరిచయమైన సిరుతై శివ తిరిగి గోపీచంద్ తో ‘శౌర్యం' తీశాడు, రవితేజతో 'దరువు' తీశాడు. రెండూ ఫ్లాపయ్యాయి. రవితేజతో సముద్రకని తీసిన 'శంభో శివ శంభో' మరో ఫ్లాప్.
ఇలా తమిళ దర్శకులు తెలుగు స్టార్స్ తో తీస్తున్న బిగ్ బడ్జెట్ సినిమాలు వరుసబెట్టి ఫ్లాప్ అవడంతో, ఇతరుల సంగతేమో గానీ రామ్ చరణ్ కి బాగా టెన్షన్ పెరిగిపోయినట్టు కన్పిస్తోంది. తాజాగా నాగచైతన్య నటించిన ‘కస్టడీ’ కూడా ఫ్లాప్ అవడంతో మెగా ఫ్యాన్స్ కూడా టెన్షన్ లో వున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు మెగా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నసరే టెన్షన్ తప్పడం లేదు. తమిళంలో బిగ్ స్టార్స్ తో హిట్ల మీద హిట్లు ఇస్తూ వచ్చిన శంకర్, రామ్ చరణ్ తో ‘గేమ్ చెంజర్ పూర్తి చేసే పనిలో వున్నాడు. పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి బాగానే స్పందించారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ రామ్ చరణ్ –శంకర్ కాంబో వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అయితే కనీసం 15 మంది తమిళ దర్శకులు తెలుగు స్టార్స్ తో తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో ఇప్పుడు శంకర్ చేతిలో ఏం జరుగుతుందోనని దిగులు పట్టుకుంది. రామ్ చరణ్ తో బాటు మరో ఇద్దరు స్టార్లు నటిస్తున్న సినిమాతో కూడా ఇవే ప్రశ్నలు. సముద్రకని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ లు నటిస్తున్న తమిళ రీమేక్ పట్ల కూడా టెన్షన్ టెన్షన్.
అసలు పానిండియా పోటీలో వెనుకబడిపోయిన తమిళ దర్శకులకి తెలుగు స్టార్స్ అవకాశమివ్వడ మేమిటని ప్రశ్నించే వారూ వున్నారు. ఇన్ని ఫ్లాపులు చూస్తూ కూడా అరవ దర్శకుల కస్టడీలో కెళ్ళిపోయి అలమటించడం దేనికి? ఇంకెన్ని ఫ్లాపులు తీసి అరవ దర్శకులు తాము అన్ ఫిట్ అని నిరూపించుకోవాలి? తమిళంలోనే హిట్స్ ఇవ్వలేకపో
తున్నారు. బాలీవుడ్ పరిస్థితే కోలీవుడ్ లో వుంది. ఇప్పటికే పాన్ వరల్డ్ పరిశ్రమగా ప్రపంచ దృష్టిలో పడ్డ టాలీవుడ్ తెలుగు దర్శకుల్ని పక్కన బెట్టి, దర్శకుల్ని అరువు తెచ్చుకోవడం పాన్ వరల్డ్ ట్యాగ్ నే ప్రశ్నార్ధకం చేస్తోంది.