Telugu Global
Cinema & Entertainment

Prema Desam Movie: ముస్తఫా ముస్తఫా' అంటూ మళ్ళీ వస్తున్న 'ప్రేమదేశం' !

Prema Desam Movie Re Release Date: మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘ప్రేమదేశం’ మళ్ళీ విడుదలవుతోంది. ఈ శుక్రవారం 9 వ తేదీ విడుదల. 25 సంవత్సరాల క్రితం 1996 లో యువతని ఉర్రూతలూగించిన ఈ ప్రేమ కావ్యం నేటి తరాన్ని పెద్ద తెరపై అలరించేందుకు సిద్ధమైంది.

Prema Desam Movie
X

ముస్తఫా ముస్తఫా’ అంటూ మళ్ళీ వస్తున్న ‘ప్రేమదేశం’

మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 'ప్రేమదేశం' మళ్ళీ విడుదలవుతోంది. ఈ శుక్రవారం 9 వ తేదీ విడుదల. 25 సంవత్సరాల క్రితం 1996 లో యువతని ఉర్రూతలూగించిన ఈ ప్రేమ కావ్యం నేటి తరాన్ని పెద్ద తెరపై అలరించేందుకు సిద్ధమైంది. నాటి యువ అబ్బాస్ -టబు- వినీత్ లు కాలేజీ రోమాన్స్ తో రెహ్మాన్ స్వరాలకి వెర్రెత్తించేలా వచ్చేస్తున్నారు. నేటి రీ రిలీజ్ ల ట్రెండ్ లో తన తడాఖా కూడా చూపించేందుకు రీమాస్టర్ అయి వచ్చేస్తోంది 'ప్రేమదేశం' – యూత్ కి జాతీయగీతంలా మారిపోయిన 'ముస్తఫా ముస్తఫా' ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ తో!

నాడు తమిళ వొరిజినల్ 'కాదల్ దేశం' గా, హిందీలో 'దునియా దిల్ వాలోంకీ' గా విడుదలై దేశవ్యాప్తంగా యూత్ మేనియా సృష్టించిన 'ప్రేమదేశం' ఎక్కడ చూసినా కనకవర్షమే కురిపించింది. ఆ రోజుల్లో తమిళంలోనే 10 కోట్లు వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు.

వేర్వేరు కాలేజీల్లో చదివే ఇద్దరు అబ్బాస్, వినీత్ లు బద్ద శతృత్వం వదిలి ప్రాణమిత్రులు కావడం, ఆపై స్నేహితురాలు టబునే ఇద్దరూ ప్రేమించడం జరిగి, చివరికి ఆమె ఎవర్ని జీవిత భాగస్వామిగా ఎంచుకొన్నదన్న రాడికల్ ముగింపుతో ఇదొక కాలం కంటే ముందున్న సంచలనం.

ఈ విజయానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం ప్రాణం పోసింది. ఇందులోని అన్నిపాటలూ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. 1. ముస్తఫా ముస్తఫా, 2. వెన్నెలా వెన్నెలా, 3. కనులు తెరిచిన, 4. హల్లో డాక్టర్ హార్టు మిస్సాయే, 5. ఓ వెన్నెలా తెలిపేదెలా, 6. నను నేను మరచినా...ఆరుపాటలూ నేటికీ హిట్సే. భువనచంద్ర అద్భుత సాహిత్యాన్ని అందించారు.

చెన్నై, బెంగుళూరు, ఊటీ, ముదుమలై, బందీపూర్, ముంబై, విశాఖపట్నం నగరాల పరిసర ప్రాంతాల్లో యూత్ ఫుల్ గా చిత్రీకరణ చేశాడు కెమెరామాన్ కేవీ ఆనంద్. అప్పటికి కొత్తవాళ్లతో నిర్మించిన 'ప్రేమ దేశం' కి కోటి రూపాయలతో కాలేజీ సెట్ వేశారంటే సినిమాపై ఎంత నమ్మకముందో అర్ధం జేసుకోవచ్చు. నిర్మాత కేటీ కుంజుమోన్ అప్పటికి ఓ 10 సినిమాలు నిర్మించారు. అయితే 1993 లో అర్జున్ తో 'జంటిల్ మన్' (తెలుగులో 'జంటిల్ మన్'), 1994 లో ప్రభుదేవాతో 'కాదలన్' ( తెలుగులో 'ప్రేమికుడు') సూపర్ డూపర్ హిట్లు నిర్మించి టాప్ నిర్మాతగా ఎదిగారు. ఈ రెండిటికీ శంకరే దర్శకుడు, రెహ్మానే సంగీత దర్శకుడు. సూపర్ హిట్లే పాటలు.

'ప్రేమదేశం' దర్శకుడు కదిర్ కి మూడో సినిమా. 1991 లో 'ఇదయం' (తెలుగులో 'హృదయం'), 1993 లో 'ఉలవన్' తీశాక, 1996 లో 'ప్రేమదేశం' తో టాప్ దర్శకుడయ్యాడు.

ఇక అబ్బాస్ హీరోగా ఎంపిక అవడం విచిత్రంగా జరిగింది. ముంబై మోడల్ అబ్బాస్ వెకేషన్‌లో బెంగుళూరులో ఓ సైబర్‌కేఫ్‌లో కనిపిస్తే దర్శకుడు కదిర్ తన ప్రాజెక్టు గురించి చెప్పాడు. అబ్బాస్ తనకి తమిళం తెలియదని ఆఫర్ తిరస్కరించి ముంబాయి తిరిగి వెళ్ళిపోయాడు. సంవత్సరం తర్వాత, అబ్బాస్‌కి నిర్మాత కుంజుమోన్ కాల్ చేసి స్క్రీన్ టెస్ట్ కి రావాల్సిందిగా పట్టుబట్టాడు. దీంతో స్క్రీన్ టెస్ట్ కి వచ్చి, సినిమాలో బుక్ అయిపోక తప్పలేదు అబ్బాస్ కి.

రెండో హీరో వినీత్ 1993లో శంకర్ దర్శకత్వం వహించిన 'జెంటిల్‌మన్‌' లో ఓ పాత్ర వేసి కుంజుమోన్‌ కి పరిచయమవడంతో వెతుక్కుంటూ ఆఫర్ వచ్చింది. ఇక బాలీవుడ్ హీరోయిన్ టబు తమిళంలో ఎంటర్ అవడానికి ఇదే అవకాశమని హీరోయిన్ గా అంగీకరించింది. అదే సంవత్సరం తెలుగులో నాగార్జునతో 'నిన్నే పెళ్ళాడుతా' లో నటించింది. తర్వాత 'మణిరత్నం 'ఇరువర్' (తెలుగులో 'ఇద్దరు') లో నటించింది. ఇక 'ప్రేమదేశం' లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీవిద్య, వడివేలు ఇక ముఖ్యపాత్రల్లో నటించారు. అప్పటికి స్ట్రగుల్ చేస్తున్న హీరో విక్రమ్ అబ్బాస్‌కి డబ్బింగ్ చెప్పాడు. చేయగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ శేఖర్ వినీత్‌కి, 'మరో చరిత్ర' హీరోయిన్ సరిత టబుకి డబ్బింగ్ చెప్పారు. తెలుగులో విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎ. కరుణాకరన్ ఈ సినిమాతో క్లాప్ అసిస్టెంట్‌గా కెరీర్‌ ని ప్రారంభించాడు

ఇంకో విశేషమేమిటంటే, ఇది బంగ్లాదేశ్‌లో కూడా రీమేక్ అయింది. 'నారీర్ మోన్‌' గా రీమేక్అయి బాగానే ఆడింది. ఇందులో హీరో హీరోయిన్లుగా రియాజ్, షకీల్ ఖాన్, షబ్నూర్ నటించారు.

తెలుగులో రీరిలీజ్ కి స్పందన బాగానే వుంటుందని ట్రేడ్ పండిట్లు అభిప్రాయపడుతున్నారు. హైదారాబాద్ లో 45 థియేటర్లలో, మిగతా తెలంగాణాలో 24 కేంద్రాల్లో విడుదలవుతోంది. హైదారాబాద్ గచ్చిబౌలి ఏఎంబి సినిమాస్ లో టికెట్లన్నీ బుక్కయిపోయాయి! వైజాగ్ రమాదేవి లో టికెట్లు అయిపోవస్తున్నాయి. విజయవాడ నవరంగ్ లో ఓపెన్ వున్నాయి. ప్రేక్షకులు త్వరపడాలి. మళ్ళీ వెండి తెరపై 'ప్రేమదేశం' చూసే అవకాశం రాదు.

First Published:  7 Dec 2022 7:11 AM GMT
Next Story