Telugu Global
Cinema & Entertainment

సుస్మిత‌, అక్ష‌య్‌, న‌వాజుద్దీన్.. ట్రాన్స్‌జెండ‌ర్ పాత్ర‌పై అగ్ర‌న‌టుల‌ మోజు

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అప్పు సినిమాలో ట్రాన్స్‌జెండ‌ర్ పాత్రలో జీవించాడు. ఆ సినిమా 2000వ సంవత్సరంలో విడుదలైనప్పుడు అదో పెద్ద సంచలనం.

సుస్మిత‌, అక్ష‌య్‌, న‌వాజుద్దీన్.. ట్రాన్స్‌జెండ‌ర్ పాత్ర‌పై అగ్ర‌న‌టుల‌ మోజు
X

మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్ ఇటీవ‌ల వ‌చ్చిన తాళ్ వెబ్‌సిరీస్‌లో ట్రాన్స్‌జెండ‌ర్‌గా నటించి శ‌భాష్ అనిపించుకుంది. తాజాగా హ‌డ్డీ సినిమాలో ఇలాంటి పాత్ర‌తోనే బాలీవుడ్ నటుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. అంత‌కుముందు అక్ష‌య్‌కుమార్ వంటి అగ్ర క‌థానాయ‌కులు కూడా ట్రాన్స్‌జెండ‌ర్ పాత్ర పోషించారు.

అక్ష‌య్‌, ప్ర‌కాష్‌రాజ్‌, ప‌రేష్‌రావ‌ల్‌.. లిస్ట్ పెద్ద‌దే

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అప్పు సినిమాలో ట్రాన్స్‌జెండ‌ర్ పాత్రలో జీవించాడు. ఆ సినిమా 2000వ సంవత్సరంలో విడుదలైనప్పుడు అదో పెద్ద సంచలనం. లారెన్స్ న‌టించిన కాంచ‌న సినిమాలో కోలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్ హిజ్రాగా న‌టించారు. అదే సినిమాను బాలీవుడ్‌లో లక్ష్మీ బాంబ్ గా రీమేక్ చేశారు. ఇందులో బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ ట్రాన్స్ జెండర్ గా నటించి సంచలనం సృష్టించారు. తమన్నా సినిమాలో పరేష్ రావల్, సంఘర్ష్ లో అశుతోష్ రాణా కూడా ట్రాన్స్‌జెండ‌ర్ పాత్ర‌లో ఒదిగిపోయారు

హీరోలుగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా సినిమాపై బ‌ల‌మైన ముద్ర వేసే ఈ న‌టులంతా ఆడా, మ‌గా కాని ట్రాన్స్‌జెండ‌ర్ పాత్ర‌పై ఎందుకింత ఆస‌క్తి చూపిస్తున్నారంటే అంద‌రి స‌మాధానం ఒక్క‌టే న‌ట‌న‌కు ఆ పాత్ర‌లో అవ‌కాశం ఎక్కువ ఉంటుంద‌ని. స‌మాజంలో వారెన్నో ఛీత్కారాల‌కు, అవ‌మానాల‌కు గుర‌వుతుంటారు. ఆ ఆవేద‌న‌ను తెర‌పైన ప్ర‌ద‌ర్శించ‌గ‌లగ‌డం త‌మ న‌ట‌నా సామ‌ర్థ్యానికి మ‌చ్చుతున‌క అవుతుంద‌ని చెబుతున్నారు. కాంచ‌న సినిమాను, రీమేక్ ల‌క్ష్మీబాంబ్‌ను కూడా తీసిన న‌టుడు, ద‌ర్శ‌కుడు రాఘవ లారెన్స్ నిలువ‌నీడ లేని హిజ్రాల కోసం చెన్నై స‌మీపంలో కొంతస్థలాన్ని కూడా రాసిచ్చారు. అందులో భ‌వ‌నం నిర్మించి, వారికి ఆశ్ర‌య‌మివ్వాల‌న్న‌ది లారెన్స్ కోరిక‌.

*

First Published:  4 Sept 2023 6:14 AM GMT
Next Story