Telugu Global
Cinema & Entertainment

‘హమారే బారా’ కు సుప్రీం కోర్టు బ్రేక్

వివాదాస్పదంగా మారిన ‘హమారే బారా’ హిందీ సినిమా విడుదలకి సుప్రీం కోర్టు బ్రేకు వేసింది. బాంబే హైకోర్టులో సినిమా విడుదలపై పెండింగ్‌లో వున్న కేసు పరిష్కరించే వరకు ‘హమారే బారా’ (మా పన్నెండు మంది) ప్రదర్శనను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

‘హమారే బారా’ కు సుప్రీం కోర్టు బ్రేక్
X

వివాదాస్పదంగా మారిన ‘హమారే బారా’ హిందీ సినిమా విడుదలకి సుప్రీం కోర్టు బ్రేకు వేసింది. బాంబే హైకోర్టులో సినిమా విడుదలపై పెండింగ్‌లో వున్న కేసు పరిష్కరించే వరకు ‘హమారే బారా’ (మా పన్నెండు మంది) ప్రదర్శనను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్ 14న విడుదల కానున్న ఈ సినిమా ఇస్లామిక్ విశ్వాసాల్ని, వివాహిత ముస్లిం మహిళలనూ కించపరిచేలా వుందని పిటిషన్ దారు ఆరోపించారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా లతో కూడిన సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టులో పిటిషన్‌ని పరిష్కరించే వరకు, సందేహాస్పద సినిమా ప్రదర్శనని తాత్కాలికంగా నిలిపివేయాలని బెంచ్ ఆదేశించింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈరోజు సినిమా టీజర్‌ని చూశామని, అది అభ్యంతరకరంగా వుందని చెప్పారు. ‘ఈరోజు ఉదయం మేము టీజర్‌ని చూశాము. ఇది బోలెడు అభ్యంతరకర అంశాలతో వుంది. టీజర్ యూట్యూబ్‌లో అందుబాటులో వుంది’ అని జస్టిస్ మెహతా చెప్పారు.



‘టీజర్ చాలా అభ్యంతరకరంగా వుంది, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుని మంజూరు చేసింది’ అని సినిమా విడుదలపై స్టే విధిస్తూ, హైకోర్టు జారీ చేసిన మొదటి మధ్యంతర ఉత్తర్వుని ప్రస్తావిస్తూ జస్టిస్ నాథ్ చెప్పారు. క్లుప్తంగా చెప్పాలంటే, మొదట్లో, ‘హమారే బారా’ సినిమాకి మంజూరు చేసిన సెన్సార్ సర్టిఫికేషన్‌ని రద్దు చేయాలని, దాని విడుదలని నిషేధించాలనీ కోరుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సిబి ఎఫ్ సి ) కి వ్యతిరేకంగా పిటిషనర్ అజర్ బాషా తంబోలీ బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ముందుగా జూన్ 7న విడుదలకి సిద్ధమైన ఈ సినిమా, సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952లోని నిబంధనలకి, దానికి సంబంధించిన నియమాలకు, మార్గదర్శకాలకూ విరుద్ధంగా వుందని పిటిషనర్ ఆరోపించారు. ఈ సినిమా ట్రైలర్ దేశంలోని ఇస్లామిక్ విశ్వాసాల్ని, వివాహిత ముస్లిం మహిళలనూ కించపరిచేలా వుందని, ఈ సినిమా విడుదల రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2), ఆర్టికల్ 25లని ఉల్లంఘిస్తోందనీ ఆయన పేర్కొన్నారు.

ట్రయిలర్ ప్రకారం వివాహిత ముస్లిం మహిళలకి సమాజంలో వ్యక్తులుగా స్వతంత్ర హక్కులు లేవన్నట్టు చిత్రీకరించారని, ఖురాన్‌లోని ‘ఆయత్ 223’ ని తప్పుగా వ్యాఖ్యానించడం ఆధారంగా రూపొందించారనీ, సినిమా విడుదలకి ముందే మార్పులు చేర్పులు చేయాలని నిర్దేశించినప్పటికీ, ట్రైలర్‌లో సిబి ఎఫ్ సి మంజూరు చేసిన సర్టిఫికేషన్‌కి సంబంధించి ఎలాంటి డిస్‌క్లెయిమర్ లేదా రిఫరెన్స్ లేవనీ పిటిషనర్ పేర్కొన్నారు.

ఇదిలా వుండగా, అవసరమైన అన్ని విధానాలని అనుసరించిన తర్వాతే సినిమాకి సర్టిఫికేట్ మంజూరు చేసినట్టు సిబి ఎఫ్ సి వాదించింది. అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగులు తొలగించామని, యూట్యూబ్ లో, బుక్‌మైషోలో విడుదల చేసిన సినిమా ట్రైలర్‌లు ధృవీకరించిన ట్రైలర్‌లు కావనీ పేర్కొంది.

ఇరు పక్షాల వాదనల్ని విన్న తర్వాత, బాంబే హైకోర్టు మొదట పిటిషనర్ కి అనుకూలంగా జూన్ 14 వరకు సినిమాని పబ్లిక్ డొమైన్‌లో విడుదల చేయకుండా ప్రతివాదుల్ని నిలువరించింది. తర్వాత ముగ్గురు సభ్యులతో సమీక్షా కమిటీని ఏర్పాటు చేసింది. సినిమా చూసి దానిపై రిపోర్టు ఇవ్వమని కోరింది. అయితే కమిటీ మరిన్ని రోజులు గడువు కోరడంతో, వివాదాలకు ఆస్కారం లేకుండా సినిమాలోని డైలాగుల్ని తొలగించడానికి నిర్మాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో, కోర్టు సినిమా విడుదలకి అనుమతినిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ప్రమాదకరంగా పరిణమించిన గర్భంతో వున్న తన తల్లి ప్రాణాల్ని కాపాడుకోవడానికి, గర్భాన్ని తొలగించే హక్కుని అనుమతించమని తండ్రిని కోర్టుకి లాగిన యువతి కథతో ఈ సినిమా తీశారు. దీనికి కమల్ చంద్ర దర్శకుడు. అశ్వినీ కల్సేకర్, అన్నూ కపూర్, మనోజ్ జోషి, పారితోష్ తివారీ నటీనటులు. బీరేంద్ర భగత్, రవి గుప్తా నిర్మాతలు.

First Published:  13 Jun 2024 2:29 PM GMT
Next Story