Telugu Global
Cinema & Entertainment

అన్ రియల్ టెక్నాలజీతో మహేశ్ బాబును కండలు తిరిగిన వీరుడిగా చూపించనున్న రాజమౌళి

రాజమౌళి కొత్త మూవీ అనగానే కొత్త టెక్నాలజీ ఏదో వుంటుంది. మాహేష్ బాబు మూవీతో ఆ కొత్త టెక్నాలజీ ఏమిటి?

అన్ రియల్ టెక్నాలజీతో మహేశ్ బాబును కండలు తిరిగిన వీరుడిగా చూపించనున్న రాజమౌళి
X

ఎస్ ఎస్ రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటో తెలిసిందే... మహేష్ బాబుతో ఫారెస్ట్ అడ్వెంచర్. రాజమౌళి కొత్త మూవీ అనగానే కొత్త టెక్నాలజీ ఏదో వుంటుంది. మాహేష్ బాబు మూవీతో ఆ కొత్త టెక్నాలజీ ఏమిటి? ఈ టెక్నాలజీ గనుక వెండితెర మీది కొస్తే బాలీవుడ్ దేశం వదిలి పారిపోవడమే. ఇప్పటికే సౌత్ పానిండియాల ధాటికి బాలీవుడ్ ఉనికి ప్రశ్నార్ధకమవుతోంది. ఇక భవిష్యత్తులో సౌత్ పానిండియాలే ఇండియన్ సినిమాలై, హిందీ సినిమాలు వుండక పోయినా ఆశ్చర్యం లేదు.

రాజమౌళి టీం పారిస్ కెళ్ళి వచ్చింది. అక్కడ అన్ రియల్ టెక్నాలజీని అందిస్తున్న సంస్థతో మాట్లాడి వచ్చారు. ఇక భవిష్యత్ సినిమాలు అన్ రియల్ టెక్నాలజీతోనే వుంటాయన్న విప్లవాత్మక మార్పు జరగబోతోంది. రియల్ - వర్చువల్ ఈ రెండిటి మేలు కలయికతో అన్ రియల్ దృశ్యాలు ఇప్పుడున్న వీఎఫ్ఎక్స్- సీజీ దృశ్యాలకన్నా మిన్నగా వుంటాయి. మాహేష్ బాబు సినిమాలో కొన్ని అసాధ్యమనిపించే స్టంట్స్ వుంటాయని, దీన్ని అన్‌ రియల్ టెక్నాలజీతో మాహేష్ రియలిస్టిక్ సీజీ ప్రతిరూపాన్ని సృష్టించి స్టంట్స్ చేయిస్తారని చెప్పుకుంటున్నారు. మరొకటేమిటంటే మహేష్ కండలు తిరిగిన వీరుడి రూపాన్ని ఈ అన్ రియల్ టెక్నాలజీయే సుసాధ్యం చేస్తుంది.

2014 లో రజనీకాంత్ తో 'కొచ్చడియాన్' (విక్రమ సింహా) విడుదలైంది. అందులో రజనీ కాంత్ నటించలేదు. దేశంలో తొలిసారిగా ఫోటో రియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ అనే టెక్నాలజీతో రజనీకాంత్ ని సృష్టించారు. ఆ ప్రయోగంతో సినిమా సినిమా లాగా అన్పించక, త్రీడీ యానిమేషన్ లా అన్పించి విఫలమైంది. ఇప్పుడు వార్తల్లో వున్న అన్ రియల్ టెక్నాలజీ వినూత్నమైనది. దీన్ని ఇరవై ఏళ్ళుగా వీడియో గేమ్స్ కి వాడుతూనే వున్నారు. హాలీవుడ్ లో స్టీవెన్ స్పీల్ బెర్గ్ తొలిసారిగా 2001 లో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' మూవీతో సినిమాల్లో ప్రవేశ పెట్టాడు. ఇందులో కల్పిత రోగ్ సిటీని దృశ్యమానం చేయడంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడింది.

అప్పటి నుంచి 'రోగ్ వన్: ఏ స్టార్ వార్స్ స్టోరీ', 'వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్', 'ఫోర్డ్ వెర్సస్ ఫెరారీ', 'స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్', 'ది బ్యాట్‌మాన్' వంటి సినిమాల్లో ఈ టెక్నాలజీని వాడారు. అమెరికాలోని ఎపిక్ గేమ్స్ సంస్థ ఈ టెక్నాలజీని ఆవిష్కరించింది. ఇప్పుడీ సాఫ్ట్ వేర్ ని అన్ రియల్ ఇంజిన్ అని పిలుస్తున్నారు. దీంతో ఇంకా సౌలభ్యాలేమిటంటే సినిమా నిర్మాణ వ్యయం తగ్గిపోవడం, సెట్ డిజైన్స్ ని విజువలైజ్ చేయడం, విభిన్న కెమెరా కోణాలని అన్వేషించడం వంటివి. అన్‌రియల్ ఇంజిన్ నాల్గవ ఎడిషన్ బొమ్మల్ని నూటికి నూరు పాళ్ళు వాస్తవికతతో చూపిస్తుంది.

ఒక సూపర్ హీరో రియల్ టైమ్ లో సీజీ ఇమేజరీ రాక్షసుడుతో పోరాడుతున్నాడని అనుకుందాం. ఇప్పుడున్న నిర్మాణ పద్ధతులతో, హీరో ఎదురుగా రాక్షసుడు వున్నట్టు వూహించుకుని పోరాడతాడు. గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేసిన ఈ దృశ్యాన్ని ఎడిట్ చేసి రాక్షసుడి సీజీ ఇమేజరీ తో కలుపుతారు. అన్ రియల్ టెక్నాలజీతో హీరో ఎదురుగానే రాక్షసుడి సీజీ ఇమేజరీ కన్పిస్తూంటుంది. దీనివల్ల షూటింగ్, ఎడిటింగ్ సమయాలు తగ్గిపోతాయి.

'ఆర్ ఆర్ ఆర్', 'రాధేశ్యామ్' లలో ఈ టెక్నాలజీని ఉపయోగించలేదని కాదు. కేవలం ఒక సన్నివేశానికి వాడారు. 'ఆర్ ఆర్ ఆర్' లో అడవిలో మంటలు, నీటి అడుగున యాక్షన్ దృశ్యాలు పునఃసృష్టి చేయడానికి ఉపయోగించారు. 'రాధే శ్యామ్‌' లో ప్రభాస్ ఫోన్ బూత్ లోంచి బయటికి వచ్చే దృశాన్ని ఇక్కడే షూట్ చేసి, ఆ ఫుటేజీని అన్‌రియల్ ఇంజిన్‌లో ఫీడ్ చేశారు. అలా ఆ బూత్ లండన్లో వున్నట్టు క్ర్రియేట్ అయింది.

ఈ ఇంజిన్ లో ప్రివిజువలైజేషన్ వంటి సాఫ్ట్ వేర్ టూల్స్ వున్నాయి. ఇది షూటింగ్ ప్రారంభమయ్యే ముందే చిత్రీకరించడానికి, సవరించడానికి, అప్ లోడ్ చేయడానికీ అనుమతిస్తుంది. ఇక్కడ పోస్ట్-ప్రొడక్షన్ ప్రక్రియ కూడా చాలావరకూ తగ్గుతుంది. దీంతో కొన్ని ఉద్యోగాలు కూడా పోవచ్చు. సినిమాల నిర్మాణ వ్యయం బాగా తగ్గడానికి ఇవన్నీ తోడ్పడతాయి.

ఇంతకీ మౌళి- మహేష్ ల సినిమా దేని గురించి? రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకారం తనూ మౌళీ విల్బర్ స్మిత్‌కి పెద్ద ఫ్యాన్స్. విల్బర్ స్మిత్ హిస్టారికల్ అడ్వెంచర్స్ రాసే నవలా రచయిత. నాలుగు శతాబ్దాలుగా దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ ప్రమేయాన్ని కాల్పనిక చరిత్రగా చేసి రాయడంలో దిట్ట. అడవుల నేపథ్యంలో అక్కడి వివక్షని, తిరుగుబాటునీ థ్రిల్లింగ్ గా రాస్తాడు. అది మహేష్ బాబు సినిమా కథకి ఇదే కాన్ఫ్లిక్ట్ పాయింట్. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రాజమౌళి స్టయిల్‌లో ఇది మరో మంచికీ చెడుకీ మధ్య మెగా వార్ గా వుంటుంది.

First Published:  7 Sept 2022 12:54 PM IST
Next Story