శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం
బాలుడు వేగంగా కోలుకుంటున్నాడన్న దిల్ రాజు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరఫున రూ. కోటి, పుష్ప2 నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్ చెరో రూ. 50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిహారం చెక్కలను ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజుకు నిర్మాత అల్లు అరవింద్ అందించారు. దిల్ రాజు, పుష్ప2 నిర్మాత రవిశంకర్‌తో కలిసి అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలుడి తండ్రి భాస్కర్‌తో మాట్లాడారు. అనంతరం అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. వెంటిలేషన్ తీసేశారు. బాలుడు త్వరలోనే మనందరి మధ్య తిరుగుతాడని ఆశిస్తున్నాను. న్యాయపరమైన అంశాల కారణంగా బాధిత కుటుంబ సభ్యులను కలవలేకపోతున్నాను. అన్నిరకాల అనుమతులు తీసుకుని శ్రీతేజ్‌ను 10 రోజుల కిందట పరామర్శించాను. ఆ సమయంలో వెంటిలేషన్‌పై ఉన్నాడని అల్లు అరవింద్ తెలిపారు.
దిల్ రాజు మాట్లాడుతూ..నిన్నటికి, ఈరోజుకు బాలుడి ఆరోగ్యం కాస్త మెరుగు పడింది. అతని ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడింది. అతని హెల్త్ కండిషన్ బాగున్నదని డాక్టర్లు చెప్పారు. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప2, నిర్మాతలు, డైరెక్టర్ ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ అడిగాం. సినీ ప్రముఖుతో సీఎంను కలిసి చర్చిస్తాం. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలం కలిసి వెళ్తాం. గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుంది అన్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ అయినందుకు సీఎంను కలుస్తున్నారా? ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య చోటు చేసుకున్న పరిణామాల గురించి వెళ్తున్నారా? అని దిల్‌రాజును మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..తాను సీని పరిశ్రమ వ్యక్తినని, ఇండస్ట్రీ-ప్రభుత్వం మధ్య వారధిగా ఉండాలని సీఎం బాధ్యత ఇచ్చారు. అదే చేస్తున్నానని అన్నారు. అల్లు అర్జున్‌ను కలిశారా? అని అడగ్గా ఇంకా లేదని, త్వరలోనే కలుస్తానని చెప్పారు.