ఎట్టకేలకు శ్రీనువైట్ల నుంచి సినిమా
దసరా సందర్భంగా కొత్త సినిమా ప్రకటించాడు శ్రీనువైట్ల. త్వరలోనే ఈ దర్శకుడు గోపీచంద్ తో సినిమా చేయబోతున్నాడు.

చాన్నాళ్లుగా సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడు శ్రీనువైట్లు. కానీ సరైన ప్రాజెక్టు సెట్ అవ్వడం లేదు. ఆమధ్య మంచు విష్ణుతో డబుల్ డోస్ అనే సినిమాను ఎనౌన్స్ చేసినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. అఖిల్ తో సినిమా అంటూ ప్రచారం జరిగినప్పటికీ దానిపై కూడా ప్రకటన రాలేదు. ఇలా కెరీర్ లో లాంగ్ గ్యాప్ ఎదుర్కొంటున్న ఈ దర్శకుడు, ఎట్టకేలకు తన కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు.
హీరో గోపీచంద్‌తో దర్శకుడు శ్రీనువైట్ల ఓ సినిమా చేయబోతున్నాడు. దసరా సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. హీరో గోపీచంద్ హిట్ అందుకొని చాలా కాలమైంది. మారుతితో చేసిన పక్కా కమర్షియల్ సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీనువైట్లతో సినిమా ప్రకటించాడు.
గోపీచంద్-శ్రీనువైట్ల ప్రాజెక్టుకు మరో విశేషం కూడా ఉంది. ఈ సినిమాకు గోపీమోహన్ కథ అందిస్తున్నాడు. వైట్ల-గోపి లాంగ్ గ్యాప్ తర్వాత కలిసి చేస్తున్న సినిమా ఇది. తన లాంగ్‌టైమ్ ఫ్రెండ్ గోపీమోహన్‌తో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని శ్రీనువైట్ల స్వయంగా ప్రకటించాడు.
శ్రీనువైట్ల మార్కు కామెడీతో పాటు యాక్షన్ కూడా మిక్స్ చేస్తూ ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ డిస్కషన్స్ పూర్తయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలౌతుంది.
దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత గోపీచంద్ సినిమాతో తిరిగి మెగాఫోన్ పట్టబోతున్నాడు శ్రీనువైట్ల. చివరగా రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేశాడు ఈ దర్శకుడు.