Mahesh Babu | మా 'శ్రీమంతుడు' ఒరిజినల్
Mahesh Babu - శ్రీమంతుడు సినిమా ఒరిజినల్ మూవీ అంటోంది మైత్రీ మూవీ మేకర్స్. కోర్టు తీర్పు ఇంకా రాలేదని మీడియాకు గుర్తుచేస్తోంది.
మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాపై కాపీరైట్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి స్పందించింది. శ్రీమంతుడు సినిమాకి , ఒక నవలకి సారూప్యత ఉందనే నిరాధారమైన ఆరోపణల గురించి మేకర్స్ స్పందించారు.
“శ్రీమంతుడు, ఆ నవల పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. రెండు వేటికవే భిన్నమైనవి. పుస్తకం, ఫిల్మ్ ను పరిశీలించే వారు ఈ వాస్తవాన్ని తక్షణమే ధృవీకరించవచ్చు. ఈ విషయం ప్రస్తుతం న్యాయ సమీక్షలో ఉంది. ఈ రోజు వరకు ఎటువంటి విచారణలు, తీర్పులు రాలేదు. అందువల్ల అప్పుడే ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం. 'శ్రీమంతుడు' ముఖ్య ఉద్దేశమైన గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్ పై మేము దృఢంగా నిలబడతాం."
శ్రీమంతుడు కథపై సదరు రచయిత చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవంటోంది యూనిట్. ఆ విషయం పై కోర్టు గాని, రచయితల సంఘము గాని ఎటువంటి తీర్పు ఇవ్వలేదనే వాస్తవం అందరు గ్రహించాలని... కోర్టు పరిధిలో ఉన్న అంశంపై అసత్య ప్రచారాలు చేస్తున్న ఎవరిమీదైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే.