Samajavaragamana Teaser Review: కుటుంబం.. కామెడీ.. సామజవరగమన
Samajavaragamana Teaser Review: శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం సామజవరగమన. కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.

Samajavaragamana Teaser Review: కుటుంబం.. కామెడీ.. సామజవరగమన
శ్రీవిష్ణుకు కామెడీ కొత్త కాదు, గతంలోనే చేశాడు, మంచి కామెడీ టైమింగ్ ఉంది. అయితే ఈమధ్య కాలంలో సీరియస్ మూవీస్ వైపు మళ్లాడు. మరీ ముఖ్యంగా యాక్షన్ ఇమేజ్ ట్రై చేసి బోల్తాపడ్డాడు. దీంతో ఇప్పుడు మళ్లీ మూలాల్లోకి వచ్చాడు. ఫక్తు కామెడీ సినిమా రెడీ చేశాడు. అదే సామజవరగమన.
శ్రీవిష్ణు తాజా చిత్రం సామజవరగమన. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. స్టోరీ ఏంటనే విషయాన్ని పక్కనపెట్టి, హీరో క్యారెక్టరైజేషన్ ఏంటనే విషయాన్ని ఎలివేట్ చేయడానికి టీజర్ ను వాడుకున్నారు. ఏషియన్ సినిమాస్ లో పనిచేసే హీరో, ప్రేమకు వ్యతిరేకం. దీనికి ఓ కారణం కూడా చూపించారు.
డిగ్రీ చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని డీప్ గా లవ్ చేస్తే, అందరి ముందు ఆ పిల్ల ఇతగాడికి రాఖీ కట్టేస్తుంది. అప్పట్నుంచి ప్రేమంటే అసహ్యం. ఏ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పినా ఆమెతో రాఖీ కట్టించుకునే టిపికల్ క్యారెక్టర్ మనోడిది. అలాంటి వ్యక్తిని హీరోయిన్ ప్రేమిస్తుంది.
అక్కడ్నుంచి కథ ఎలా మలుపులు తిరిగిందనేది ఈ సినిమా స్టోరీ. ఆ 'సామజవరగమన' కు ఫ్యామిలీ కామెడీ సెట్ చేశాడు దర్శకుడు రామ్ అబ్బరాజు. టీజర్ లో శ్రీవిష్ణుతో పాటు నరేష్, వెన్నెల కిషోర్ లాంటి కీలక పాత్రలన్నింటినీ పరిచయం చేశారు.
ఈ టీజర్ కు గోపీసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఫన్ జోడించింది. రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను రాజేష్ దండా నిర్మించాడు. మే 18న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. రాజ రాజ చోర తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేకపోయిన శ్రీవిష్ణు.. సామజవరగమనపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.