కలిసొచ్చిన కాలంలో కలిసిరాని చిన్న సినిమాలు!
సినిమాలెలా వుండాలో థియేటర్లే నిర్ణయిస్తున్నాయి. ఒక మూసలో వుండే కమర్షియల్ ఫార్ములా సినిమాలే థియేటర్ల కవసరం. దీంతో ఆర్ట్, రియలిస్టిక్, ఇండిపెండెంట్ సినిమాలనే ఇతర క్రియేటివ్ వ్యాపకాలకి ప్రదర్శనా రంగంలో చోటు లేకుండా పోయింది.
సినిమాలెలా వుండాలో థియేటర్లే నిర్ణయిస్తున్నాయి. ఒక మూసలో వుండే కమర్షియల్ ఫార్ములా సినిమాలే థియేటర్ల కవసరం. దీంతో ఆర్ట్, రియలిస్టిక్, ఇండిపెండెంట్ సినిమాలనే ఇతర క్రియేటివ్ వ్యాపకాలకి ప్రదర్శనా రంగంలో చోటు లేకుండా పోయింది. గత రెండు దశాబ్దాలుగా మరీ థియేటర్లు ప్రేక్షకులంటే మూస ప్రేక్షకులేనని, సినిమాలంటే మూస కమర్షియల్ సినిమాలేనని భావించడంతో, మూసేతర సినిమాలు తీయాలనుకునే మేకర్స్ కి ప్రేక్షకులు కరువై పోయారు. దీంతో కె ఎన్ టీ శాస్త్రీలు, రాజేష్ టచ్ రివర్లు ఆర్ట్ సినిమాలతో ఫిలిమ్ ఫెస్టివల్స్ కి పరిమితమవాల్సి వచ్చింది. డాక్టర్ డి రామానాయుడు కూడా కమర్షియల్ సినిమాలు తీస్తూ మధ్య మధ్యలో 'అవార్డు సినిమా' తీస్తాననేవారు. ఇదేదో మనకి సంబంధించింది కాదులే అనుకునే వాళ్ళు ప్రేక్షకులు.
ఆర్ట్ సినిమా అంటే అంటరాని సినిమాగా అభిప్రాయం కల్గించారు. కోవిడ్ తో మనుషులే అంటరాని వాళ్ళయి, లాక్ డౌన్ తో థియేటర్లే మూతబడి, అవ్వాల్సిందంతా అయింది. లాక్ డౌన్ తో తెలుగు జాతి కూడా సామూహికంగా ఇళ్ళల్లో బందీ అయి, ఓటీటీల్లో నిర్బంధంగా సినిమాలు చూస్తున్నాక, ఆ ఓటీటీల్లో జీవితాలకి దగ్గరగా వుంటున్న వివిధ భాషల ఆర్ట్ -రియలిస్టిక్- ఇండిపెడెంట్ సినిమాల విలువ తెలిసి వచ్చింది. వచ్చాక వరస మారి చిన్న మూస సినిమాలకి ఎసరు వచ్చింది. ఇక చిన్న మూస సినిమాలు ఎలా వుంటే మార్కెట్ వుంటుందో అర్ధమైంది.
దీంతో థియేటర్లు మూస సినిమాలతో బాటు మూసేతర సినిమాలనూ అనుమతించసాగాయి. అయితే మూసేతర రియాలిస్టిక్, ఇండిపెండెంట్ సినిమాలనేవి దాదాపూ చిన్న సినిమాలుగానే వుంటాయి. తెలుగులో నూటికి 90 శాతం చిన్న సినిమాలే ఉత్పత్తి అవుతున్నాయి, అట్టర్ ఫ్లాప్ కూడా అవుతున్నాయి. ఇంత కాలం చిన్న మేకర్లు మూసలో సినిమాలు తీస్తూ మోసపోయారు. బిగ్ కమర్షియల్ మూసని ఫ్యాన్ బేస్ వున్న స్టార్ కాపాడతాడు. ఫ్యాన్స్ కూడా పెద్ద మూస సినిమాల్ని మోయడంలో ముందుంటారు. చిన్న మూస సినిమాల్ని కాపాడే నాథుడే లేడు. అయినా కూడా పెద్ద కమర్షియల్ మూస సినిమాలకి దాస్యం చేస్తున్నట్టు, చిన్న సినిమాలంటే పెద్ద మూస సినిమాల్లాగే తీయాలనుకుని అవే తీస్తూ, ఏడాదికి 100 మంది చొప్పున కొత్త మేకర్లు రావడం, ఫ్లాప్ చేసుకుని వెళ్లిపోవడం రొటీన్ గా జరిగిపోతోంది.
అయినా కూడా ఇప్పుడింకా పద్ధతి మార్చుకుని రియలిస్టిక్, ఇండిపెండెంట్ సినిమాలకి చిన్న మేకర్ సిద్ధం కాకపోతే - పూర్వంలాగే థియేటర్ కి ఎలాగూ పనికి రాడు, ఇప్పుడు ఓటీటీకి కూడా దూరమవాల్సి వస్తుంది. అసలు తెలుగు వాడైన ప్రభాస్ పానిండియా మూవీస్ తో ఆలిండియా స్థాయిలో తెలుగుకి కొత్త గుర్తింపు తెస్తున్నప్పుడు, ఈ అవకాశంతో చిన్న సినిమాలైనా పానిండియా కంటెంట్ తో తీసి -మార్కెట్ ని పెంచుకో వచ్చని ఆలోచించవచ్చు. కానీ ఆలోచనలేప్పుడూ అదే లోకల్ మార్కెట్లో, డబ్బులు రాని అవే మూస సినిమాల దగ్గరే వుంటున్నాయి.
లాక్ డౌన్ కి ముందు తలపెట్టిన చిన్న మూస సినిమాలు లాక్ డౌన్ తర్వాత విడుదలవుతూ వచ్చాయి. దీన్ని అర్ధం జేసుకోవచ్చు. కానీ ఓటీటీలతో లాక్ డౌన్ తర్వాత మారిన పరిస్థితుల్లో కూడా ఇంకా అవే మూస సినిమాలు తీయడంలో అర్ధం లేదు. వీటిని పెద్ద సినిమాలు లేని వారం అయిదారు చొప్పున విడుదల చేసుకునే అవకాశం దొరుకుతోంది. అదీ అన్ని కేంద్రాల్లో కాదు, కొన్ని పెద్ద కేంద్రాల్లో ఒక ఆట చొప్పున ప్రదర్శించుకునే అవకాశం. ఈ శుక్రవారం కూడా నాలుగు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. రుద్రవీణ, ఫోకస్, అనుకోని ప్రయాణం, తీహార్ కాలేజ్ అన్నవి.
వీటిలో రాజేంద్ర ప్రసాద్ నటించిన అనుకోని ప్రయాణం తప్ప మిగిలినవి కొత్త కొత్త నటీనటులతో కొత్త కొత్త దర్శకులు తీసినవే. అనుకోని ప్రయాణం సహా హైదరాబాద్, విజయవాడ, ఇంకెక్కెడా ఉదయం ఆటల్లో విడుదల కావడం లేదు. మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళ (కొన్ని చోట్ల రాత్రి 10.30కి) ఆటల్లో కేవలం ఒక్క షో కే ఇవి పరిమితం. ఈ సినిమాల గురించే ఎవరికీ తెలీదు. వీటికి రివ్యూలు కూడా రావు. రెండో రోజు ఆ ఒక్క కూడా వుండే నమ్మకం లేదు. ఇలా వుంటోంది వీటి మార్కెట్ పరిస్థితి. ఈ సినిమాలేవీ డిఫరెంట్ సినిమాలు దృష్టి నాకర్షించడానికి.
ఓటీటీలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటీటీలతో తెలుగు ప్రేక్షకులున్నారు, తెలుగు మేకర్స్ వుండడం లేదు. మేకర్స్ మారిన పరిస్థితి అంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ కి సీజనే అనుకుంటున్నారు. వీటిని రియలిస్టిక్ గా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అవి మూస ఫార్ములాలుగానే వుంటున్నాయి. రియలిస్టిక్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్సే కాదు, సీరియస్ రాజకీయ, సామాజిక సమస్యలే కాదు; ప్రేమ, కుటుంబం, హాస్యం లాంటివి కూడా రియలిస్టిక్సే అవుతాయి. కాకపోతే వీటికి మూసని వదిలించి రియలిస్టిక్ జానర్ మర్యాదలు కూర్చాలి. అప్పుడే రోజుకొక ఆట చొప్పునైనా కొన్ని రోజులు థియేటర్స్ లో ఆడతాయి.