Skanda Movie Reveiw | స్కంద- రివ్యూ {2.25/5}
Skanda Telugu Movie Reveiw | ‘స్కంద’ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది. రామ్ కిది తొలి పానిండియా సినిమా.
చిత్రం: స్కంద
రచన- దర్శకత్వం: బోయపాటి శ్రీను
తారాగణం : రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, గౌతమి, ఇంద్రజ, ఊర్వశీ రౌతేలా, ప్రిన్స్ సెసిల్, శరత్ లోహితస్వా, అజయ్ పుర్కర్, దగ్గుబాటి రాజా, శ్రీకాంత్, పృథ్వీరాజ్ తదితరులు
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : సంతోష్ దితాకే
బ్యానర్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్, జీ స్టూడియోస్
నిర్మాతలు : శ్రీనివాస చిత్తూరి, పవన్ కుమార్
విడుదల : సెప్టెంబర్ 28, 2023
రేటింగ్: 2.25/5
2021 లో బాలకృష్ణతో ‘అఖండ’ ఘనవిజయం తర్వాత దర్శకుడు బోయపాటి శీను నుంచి మరో సినిమాని ఆశిస్తున్న ప్రేక్షకులకి, ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ రామ్ పోతినేని అలియాస్ ‘రాపో’ హీరోగా ‘స్కంద’ అనే మరో బోయపాటి టెంప్లెట్ మూవీ అందింది. సెప్టెంబర్ 28 నిజానికి ప్రభాస్ నటిస్తున్న ‘సాలార్’ విడుదల కావాల్సిన తేదీ. ఇది వాయిదా పడడంతో, అక్టోబర్ 20 న విడుదల కావాల్సిన ‘స్కంద’ సెప్టెంబర్ 28కి వచ్చేసింది. ‘స్కంద’ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది. రామ్ కిది తొలి పానిండియా సినిమా. మరి పానిండియా లెవెల్లో వుందా, లేక ఇతర భాషల్లో డబ్బింగ్ ఖర్చులు వృధా అన్పించేలా వుందా విషయంలో కెళ్ళి చూద్దాం...
కథ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయుడు (అజయ్ పుర్కర్), తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి (శరత్ లోహితస్వ) స్నేహంగా వుంటారు. రాయుడు కుమార్తె పెళ్ళవుతూండగా ఆమె రంజిత్ రెడ్డి కొడుకుతో లేచిపోతుంది. దీంతో ఇద్దరు సీఎంల మధ్య శతృత్వాలు రగుల్కొంటాయి. తన కుమార్తెని వెనక్కి తీసుకు రావడానికి భాస్కర్ (రామ్ పోతినేని) అనే కత్తిలాంటి కుర్రాడ్ని ఏపీ సీఎం పంపిస్తాడు. అటు తన కొడుక్కి ఏపీ సీఎం కూతురితో పెళ్ళి సన్నాహాలు చేస్తూంటాడు తెలంగాణ సీఎం. భాస్కర్ వచ్చేసి ఏపీ సీఎం కుమార్తెతో బాటు తెలంగాణ సీఎం కూతురు శ్రీలీల (శ్రీలీల) ని కూడా కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతాడు.
ఎవరీ భాస్కర్? ఇద్దరు సీఎంల కుమార్తెల్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు? జైల్లో వున్న పారిశ్రామికవేత్త రామకృష్ణం రాజు (శ్రీకాంత్) తో భాస్కర్ కున్న సంబంధమేమిటి? ఇద్దరు సీఎంల వల్ల గతంలో భాస్కర్ కుటుంబానికి జరిగిన అన్యాయమేమిటి? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.
ఎలావుంది కథ
బోయపాటి మార్కు టెంప్లెట్ కథే. కాకపోతే రెండు రాష్ట్రాల సీఎం లనే కొత్త పాత్రలు పుట్టుకొచ్చాయి. కొత్తగా తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య సినిమా అనేసరికి పుట్టే కుతూహలం వ్యవహారం చూసేసరికి ఇట్టే ఆవిరై పోతుంది. పేరుకే సీఎం పాత్రలుగానీ వాటితో కథ రొటీన్ ఫార్ములా కథే. ఇద్దరు ప్రత్యర్ధుల మధ్య హీరో ప్రవేశించడం, వ్యక్తిగత కారణాలతో వాళ్ళ కూతుళ్ళని అపహరించుకు పోవడం, ఫ్లాష్ బ్యాక్ వేసి వ్యక్తిగత కారణం చెప్పడం, ఫ్లాష్ బ్యాక్ పూర్తవగానే శత్రు వినాశానికి క్లయిమాక్స్ మొదలవడం... అనే తెలిసిన ఫ్యాక్షన్ సినిమాల టెంప్లెట్ లోనే కథ వుంటుంది.
కాకపోతే తెలిసిన కథని మరిపించడానికి భారీ యెత్తున సుదీర్ఘ యాక్షన్ దృశ్యాలతో నడిపాడు దర్శకుడు. రెండోది, కొత్త మెకోవర్ తో రామ్ ని మెటా మాస్ హీరోగా చూపించాడు. ఈ రెండూ ఫస్టాఫ్ ని మరిపించినా, సెకండాఫ్ వచ్చేసరికి టెంపో తగ్గి రొటీన్ మూస కథని క్యారీ చేయలేక పోయాయి. ఫ్లాష్ బ్యాక్ లో కుటుంబ విలువల కథ కొంత బలమిచ్చినా, భావోద్వేగాల నిర్వహణ అంతంత మాత్రమే. క్లయిమాక్స్ మరో భారీ యాక్షన్ దృశ్యాల కోసమే తప్ప కథ ముగించడానికి కాదు. ఫ్లాష్ బ్యాక్ ముగియగానే కథ ముగింపు తెలిసిపోతుంది.
కేవలం రామ్ మాస్ యాక్షన్ క్యారక్టర్, పొడిగించిన యాక్షన్ దృశ్యాలూ కలిపి ఈ సినిమా. ఈ యాక్షన్ లో విచ్చలవిడి హింస, రక్తపాతాలు, తలలు తెగిపడడాలూ మామూలే. వొంటి చేత్తో రామ్ వందమందిని మట్టి కరిపించే ఓవరాక్షన్ అతిగానే వున్నా - ఇది మాస్ సినిమా. మాస్ కోసం మాస్ కి నచ్చే బీసీ సెంటర్ సినిమా తీశాడు బోయపాటి.
నటనలు - సాంకేతికాలు
రామ్ కొత్త అవతారం సిల్వెస్టర్ స్టాలోన్ ‘రాంబో’ గా మారినట్టు అద్భుతంగా వుంది. బరువు పెరిగి, కండలూ వొత్తుగా గడ్డమూ పెంచి, యాంగ్రీ యంగ్ మాన్ గా నటించడానికి చేసిన కృషి మెచ్చదగింది. దీన్ని సపోర్టు చేసే కథా కథనాలు కూడా వుండాలి. ఉంటే ఇంకో ‘రాంబో’ అయ్యేది సినిమా. జీవితంలో అన్యాయానికి గురైన రాంబోకి ఆ స్థాయి మెప్పించే యాక్షన్ దెబ్బ తిన్న అతడి మనోభావాల బలం నుంచే వచ్చింది. రామ్ పాత్ర మనోభావాలు ఏం దెబ్బతిన్నాయో తెలీదు. ‘రాంబో’ రీమేక్ అయిన ‘చిరంజీవి ‘ఖైదీ’ (1983) చిరంజీవిని ఏకంగా స్టార్ గా మార్చేసిందంటే పరుచూరి బ్రదర్స్ ‘రాంబో’ ఆత్మని పట్టుకోవడం వల్లే. అలాటి రాంబో అవాల్సిన రామ్- రాంగోపాల్ వర్మ ‘జేమ్స్’ లాగా కార్డ్ బోర్డ్ క్యారక్టర్ గా వుండి పోయాడు.
ఈ మద్య టాప్ హీరోయిన్ అయిన శ్రీలీలకి తగిన పాత్ర లేదు. ఆమె డాన్సింగ్ స్కిల్స్ తో టాప్ హీరోయిన్ అయింది గనుక డాన్సులకి వాడుకుని వదిలేసినట్టున్నాడు బోయపాటి. మాస్ ప్రేక్షకులకి ఇది చాలు. ఇక ప్రత్యర్ధి పాత్రలు, సహాయ పాత్రలూ చాలా మంది నటించారు. తారాగణం ఎక్కువైపోయింది. సీనియర్లు గౌతమి, ఇంద్రజలకి కూడా పెద్దగా ప్రాముఖ్యం లేదు. ఒకే ఎక్స్ ప్రెషన్ తో శ్రీకాంత్ పారిశ్రామికవేత్త పాత్ర, నటన కృత్రిమమైనవే.
పాటల విషయంలో తమన్ తెలిపోయాడు. పాటలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. సుదీర్ఘ యాక్షన్ సీన్లకి నేపథ్య సంగీతపు మోత భరించగల్గాలి. ఇది మాస్ కి ఓకే. ఎడిటింగ్ ఎందుకు కుదరలేదోగానీ సినిమా నిడివి రెండు గంటలా 47 నిమిషాలు చాలా ఎక్కువ. ప్రొడక్షన్ విలువలు బోయపాటి స్థాయిలో వున్నాయి. మళ్ళీ బోయపాటి ఒక ‘అఖండ’ ఇవ్వాలంటే టెంప్లెట్ కథలు మనుకోవాలి.