Singer Sunitha: సునీత కొడుకు హీరోగా సినిమా
Singer Sunitha's son Akash debuts as a hero - గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకు నిర్మాత.

పరిచయాలుంటే అవకాశాలు ఆటోమేటిగ్గా వస్తాయి. సర్కిల్ ఉండాలే కానీ, ఇండస్ట్రీలో ఎవరైనా హీరో అయిపోవచ్చు. జేబులో డబ్బులంటే సినిమా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కోవలో సింగర్ సునీత కొడుకు కూడా హీరోగా మారుతున్నాడు. ఇటు సునీతకు, అటు ఆమె భర్త మ్యాంగో రామ్ కు ఇండస్ట్రీలో బాగా పరిచయాలున్నాయి. ఆ పరిచయాలతో హీరో అయిపోయాడు సునీత తనయుడు ఆకాష్.
దర్శకుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ‘‘సర్కారు నౌకరి’’ అనే సినిమా ప్రారంభమైంది. గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా, నూతన నటి భావనా వళపండల్ హీరోయిన్ గా ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతున్నారు.
ఓపెనింగ్ రోజున మ్యాంగో మీడియా అధినేత, గాయని సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్రరావు దేవుడి పటాలపై క్లాప్ ఇచ్చారు. అనంతరం హీరోహీరోయిన్లపై తీసిన తొలిషాట్ కు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా గాయని సునీత కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఫిబ్రవరి 6 నుంచి నిరవధికంగా షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో ఆకాష్, భావనా వళపండల్, తనికెళ్ల భరణి, మణిచందన లాంటి వాళ్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.