Adipurush movie tickets: ప్రతి రామాలయానికి 100 టికెట్లు
Adipurush movie tickets: ఆదిపురుష్ కోసం శ్రేయాస్ మీడియా కూడా ముందుకొచ్చింది. వీళ్లు ఏం చేయబోతున్నారో చూద్దాం..
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ నటించిన ఆది పురుష్. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ఈ జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా మేకర్స్, దర్శకుడు కలిసి ఈమధ్య ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదేమిటంటే "రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటికి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం, ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన ఆది పురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి ధియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతోంది" అంటూ తమ ఆధ్యాత్మిక భావాన్ని తెలియజేశారు ఈ సినిమా యూనిట్.
ఈ మంచి కార్యాన్ని మరింత ప్రోత్సాహిస్తూ చాలామంది ప్రముఖులు ముందుకొస్తున్నారు. రణబీర్ కపూర్, రామ్ చరణ్, అభిషేక్ అగర్వాల్ లాంటి వాళ్లు.. ఆదిపురుష్ సినిమాకు సంబంధించి 10వేల టిక్కెట్లు చొప్పున కొనుగోలు చేసి, పేదలు, వృద్ధులు, వికలాంగులు, అనాథలకు పంచుతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి శ్రేయాస్ మీడియా కూడా చేరింది.
ఖమ్మం జిల్లాలోని, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి రామాలయానికి 100+1 (1 టికెట్ హనుమాన్ కి) టికెట్లు ఉచితంగా ఇవ్వాలని శ్రేయాస్ మీడియా నిర్ణయించింది. శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ తన సొంత డబ్బులతో ఈ టికెట్లు కొని ఆయా ఆలయాలకు అందించబోతున్నాడు.
టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.