ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ బంద్.. కానీ సగం-సగం
ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ నిలిచిపోనున్నాయా? ఇది నిజమే.కాకపోతే పూర్తి నిజం కాదు. కొన్ని షూటింగ్స్ జరుగుతాయి, కొన్ని జరగవు.
మరో 4 రోజుల్లో టాలీవుడ్ లో షూటింగ్స్ నిలిచిపోతున్నాయి. ఇన్నాళ్లూ ఊహాగానంగా ఉన్న ఈ మేటర్ ఇప్పుడు ఫిక్స్ అయింది. ఈ మేరకు కొంతమంది నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. షూటింగ్స్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ బంద్ అనేది పూర్తిస్థాయిలో జరగడం లేదు. కొన్ని నిర్మాతల సంఘాలు ఓకే అన్నాయి, మరికొన్ని సంఘాలు నో చెబుతున్నాయి. దీంతో పెద్ద సినిమాల షూటింగ్స్ కు ఆటంకాలు తొలిగినట్టయింది.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన నిర్మాతలు మాత్రం తమ షూటింగ్స్ ను కొనసాగించబోతున్నారు. ఈ 3 సంస్థల్లో ఉన్నది బడా ప్రొడ్యూసర్లే. కాబట్టి పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ కు సమస్య లేదు. ఎటొచ్చి చిన్న సినిమాలు, మిడ్-రేంజ్ మూవీస్ తోనే సమస్య ఉంది.
ఇప్పుడున్న రెమ్యూనరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ తో సినిమాలు చేయలేమంటున్నారు మీడియం బడ్జెట్ నిర్మాతలు. వీళ్లంతా 1వ తేదీ నుంచి షూటింంగ్స్ బంద్ పెడుతున్నారు. దీంతో కార్తికేయ, శ్రీవిష్ణు, రాజ్ తరుణ్ లాంటి కొందరు చిన్న హీరోల సినిమాల షూటింగ్స్ కొన్నాళ్లు ఆగబోతున్నాయి.
ఇక త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న మహేష్ బాబు షూటింగ్ ఆగిపోతుందనే వార్తలో నిజం లేదు. ఆగస్ట్ 15-16 తేదీల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. అప్పటికే షూటింగ్స్ అన్నీ తిరిగి యథాతథంగా కొనసాగుతాయని నిర్మాతలే ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.