Telugu Global
Cinema & Entertainment

హాలీవుడ్‌లో లీక్ చేస్తే ఇంటికే!

ఔట్ డోర్, ఇండోర్ లొకేషన్స్ లో సీసీ కెమెరాలు ఎలాగూ ఉంటాయి. సెక్యూరిటీ గార్డులు అందరి మీదా కన్నేసి రౌండ్స్ వేస్తూంటారు. మొబైల్స్ ని ఎలాగూ స్వాధీనం చేసుకుంటారు. ఇన్ని ఏర్పాట్లు ఉన్నాక వీడియోలు తీసి లీక్ చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు.

హాలీవుడ్‌లో లీక్ చేస్తే ఇంటికే!
X

బిగ్ స్టార్స్ నటిస్తున్న కొత్త సినిమాలు రిలీజ్ కావడానికి ఎంత కాలం పడుతుందో గానీ, వాటి వీడియోలు, ఫొటోలు మాత్రం జోరుగా లీకై పోతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనేకాదు హాలీవుడ్‌లో కూడా ఇదే పరిస్థితి. హాలీవుడ్‌లోనైతే గతంలో ఏకంగా హ్యాకర్లు సోనీ పిక్చర్స్ సర్వర్స్ నే హ్యాక్ చేసి రిలీజ్‌కి సిద్ధం చేసిన కొత్త సినిమాలు లీక్ చేసేశారు. బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలు రిలీజ్‌కి ముందే లీకైపోయాయి. ఇక సినిమా షూటింగ్ దృశ్యాల వీడియోలు, ఫొటోలు లీక్ అవడం సర్వసాధారణమైపోయింది. దీనికి పరాకాష్ట ఏమిటంటే, తమిళ స్టార్ సూర్య నటిస్తున్న సినిమా నిర్మాతలు - మర్యాదగా సోషల్ మీడియాలో లీకుని తొలగించకపోతే కాపీరైట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని లీకు వీరుల్ని బెదిరించడం!

ఈ వారం ఫ్రెష్‌గా ప్రభాస్, రజనీకాంత్, సూర్యలు నటిస్తున్న మూడు సినిమాల వీడియోలు, ఫొటోలు లీక్ అవడం ఈ ట్రెండ్ మాంచి ఊపులోనే ఉందనడానికి తార్కాణం. ప్రశ్న ఏమిటంటే, జనసందోహముండే షాపింగ్ మాల్స్ లో చోరీలు జరగకుండా కట్టు దిట్టమైన చర్యలుంటాయి, సినిమా షూటింగ్ లొకేషన్స్ లో అలాటి భద్రతా చర్యలు ఎందుకుండవనేది. ప్రభాస్ నటిస్తున్న 'సాలార్' షూటింగ్ స్పాట్ ఫొటో లీక్ అయిన వెంటనే దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసుకున్న నివారణ చర్యలు రొటీన్‌గా, చప్పగా ఉన్నాయి. షూటింగ్ స్పాట్‌లో ప్రతీ ఒక్కరూ సెల్ ఫోన్స్ ని డిపాజిట్ చేయాలని ఆదేశించాడు. ఇది అందరూ చేసే పనే. అయినా లీకులు లీకులే!

రజనీ కాంత్ నటిస్తున్న జైలర్ షూటింగ్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే సెప్టెంబర్ 5న హాలీవుడ్‌లో టామ్ క్రూజ్ నటిస్తున్న 'మిషన్ ఇంపాసిబుల్' తాజా సీక్వెల్ షూటింగ్ క్లిప్ సోషల్ మీడియాలో హల్‌చ‌ల్‌ చేయడంతో కంగుతిన్నారు. అమెరికాలో సినిమా సంస్థలే కాదు, ఆడియో కంపెనీలు కూడా ఈ లేకుల సమస్యని ఎదుర్కొంటున్నాయి. దీనికి ఒక భద్రతా ప్రోటోకాల్ కనిపెట్టారు. దీని ప్రకారం మ్యూజిక్ వీడియో షూట్‌లో సంగీతాన్ని ఉపయోగించరు. వీడియో షూట్‌లో పాల్గొనే టీములో అందరూ లేదా కొందరు ఆ పాట విని, దాని పిక్చరైజేషన్ గురించి తెలుసుకుంటారు. అంతేగానీ ఆ పాట కాపీని పొందలేరు. దర్శకుడి సూచనల మేరకు మోడల్స్ లేదా నటులు పాటకి తగ్గ మూవ్ మెంట్స్ ఇస్తారు. ఇవి మాంటేజ్ షాట్సే గనుక లిప్ మూవ్ మెంట్స్ తో పనుండదు.

ఇక రికార్డింగ్‌లో పాల్గొనే సంగీతకారులు, ఎడిటర్‌లు మొదలైనవారు ఎన్డీఎ (నాన్ డిస్ క్లోజర్ ఒప్పందం) మీద సంతకాలు చేస్తారు. ఈ ఒప్పందం ప్రకారం మ్యూజిక్ వీడియోకి సంబంధించిన ఎలాటి సమాచారం వెల్లడి చేయకూడదు. మరొకటేమిటంటే మ్యూజిక్ వీడియోలకి పనిచేసే ఎవరైనా తాము చేస్తున్న పనిని బయటి ప్రపంచానికి తెలియనివ్వరు. తాము ఏ రంగంలో ఉన్నారో కూడా తెలియనివ్వరు.

హాలీవుడ్ సినిమా లీకులకి సంబంధించి తీవ్ర చర్యలు చేపట్టారు. మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా (MPAA) లీకులు, రికార్డు చేసిన ఫుటేజీలు నిరోధించడానికి రూపొందించిన కొన్ని వ్యూహాలు ప్రామాణికమైనవి. పాఠశాల పిల్లలకు ఆన్‌లైన్ పైరసీ గురించి, కాపీరైట్ రక్షణ గురించి శిక్షణా కార్యక్రమాలు రూపొందించింది. 'మీరే ఒక కళా సృష్టి చేశారనుకోండి. దానిని మీ అనుమతి లేకుండా వేరొకరు ఉపయోగించినట్టయితే, మీకు ఎలా అనిపిస్తుంది? మీ కళా సృష్టికి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు. దానిని ఎవరైనా మీ అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తే మీరా డబ్బు సంపాదించగలరా? అలా మీ కళా సృష్టి ఉచితంగా పబ్లిక్ అయిపోతుందన్న మాట' అని బోధించింది.

ఇక స్టూడియోల్లో, స్పెషల్ ఎఫెక్ట్స్ సంస్థల్లో ప్రొఫెషనల్ సెక్యూరిటీ టీములు భద్రతని ఆడిట్ చేస్తారు. ఒక సినిమా తీస్తే అందులో చాలా మంది ప్రమేయం ఉంటుంది - స్పెషల్ ఎఫెక్ట్స్ టీములు, ఎడిటింగ్ టీములు, టెస్ట్ ఆడియన్స్ మొదలైనవారు. వీరందర్నీ క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తారు. 'స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్' స్క్రిప్ట్ లీకులు కూడా నిరోధించడానికి, డిస్నీ స్టూడియోస్ దాని పేజీలని ఎరుపు కాగితంపై ముద్రించింది. దీన్ని స్కాన్ చేసినా లేదా ఫొటోకాపీ చేసినా స్పష్టంగా కనిపించదు.

'కెప్టెన్ అమెరికా: సివిల్ వార్' తారాగణం చాలా కఠిన భద్రతా ప్రోటోకాల్‌ని పాటించాల్సి వచ్చింది. ఇందులో నటించిన ఎలిజబెత్ ఒల్సేన్ కి ఆ రోజు చిత్రీకరిస్తున్న స్క్రిప్టు పేజీల్ని ఇచ్చినప్పుడు, వాటిని ఇంటికి తీసుకెళ్ళడానికి మీకు అనుమతి లేదని చెప్పేశారు. 'పసిఫిక్ రిమ్' తారాగణం వారి స్క్రిప్టుని ఐప్యాడ్‌లో మాత్రమే చదవాల్సి వచ్చింది. నిర్దిష్ట సమయం తర్వాత స్క్రిప్ట్ దానికదే డిలీట్ అయిపోతుంది. 'ది హంగర్ గేమ్స్' స్క్రిప్ట్ కోడ్ పదాలతో ఉంది. దీని వల్ల లీక్ ఎక్కడ నుంచి జరిగిందో కనుగొనడం స్టూడియోకి సులభమైపోతుంది.

ఔట్ డోర్, ఇండోర్ లొకేషన్స్ లో సీసీ కెమెరాలు ఎలాగూ ఉంటాయి. సెక్యూరిటీ గార్డులు అందరి మీదా కన్నేసి రౌండ్స్ వేస్తూంటారు. మొబైల్స్ ని ఎలాగూ స్వాధీనం చేసుకుంటారు. ఇన్ని ఏర్పాట్లు ఉన్నాక వీడియోలు తీసి లీక్ చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు. స్పాట్ లోనే దొరికిపోతారు. దొంగ దొంగే. చట్టపరమైన చర్య లెదుర్కొని, మరెక్కడా పని దొరక్క ఇంటి ముఖం పట్టాల్సిందే.

First Published:  27 Sept 2022 2:56 PM IST
Next Story