Telugu Global
Cinema & Entertainment

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

సీనియర్ నటుడు కైకాల మృతితో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్నది.

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
X

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ (87) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో కైకాల బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్‌ను ఇంటికి పిలిపించారు. కాగా, పూర్తి పరీక్షలు చేసిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు చెప్పారు. ఈ రోజు తెల్లవారుజామున 4.00 గంటలకు కైకాల సత్యనారాయణ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.

సీనియర్ నటుడు కైకాల మృతితో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్నది. సత్యనారాయణ ఇంటికి పలువురు సినీ ప్రముఖలు చేరుకుంటున్నారు. కైకాల మృతికి వారు సంతాపం తెలిపుతున్నారు. కైకాల కుటుంబాన్ని ఓదార్చి, వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఉన్నారని తెలుసుకొని గతంలో చిరంజీవి కూడా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. పుట్టిన రోజు నాడు సత్యనారాయణతో బర్త్ డే కేక్ కూడా కట్ చేయించారు. ఆ రోజు చిరంజీవి తన ట్విట్టర్‌లో దానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. సత్యానారాయణ ప్రేక్షకులకు కనపడటం అదే చివరి సారి. సీనియర్ హీరో కృష్ణ చనిపోయిన కొన్నాళ్లకే సీనియర్ విలన్‌గా పేరు తెచ్చుకున్న సత్యనారాయణ మృతి సినీ అభిమానులను విషాదంలోకి నెట్టింది.

కైకాల సత్యనారాయణ కృష్ణా జిల్లా కౌతారం గ్రామంలో 1935లో జన్మించారు. గుడివాడ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సత్యనారాయణ.. నటనపై ఉన్న ఆసక్తితో అప్పటి నుంచే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. స్టేజీపై సత్యనారాయణ టాలెంట్‌ను చూసిన నిర్మాత డీఎల్ నారాయణ 'సిపాయి కూతురు' అవకాశం ఇచ్చారు. అనేక పౌరాణిక, జానపద, కమర్షియల్ సినిమాల్లో సత్యానారాయణ విలన్‌, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. సీనియర్ నట్లు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణా, శోభన్ బాబుతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

కెరీర్‌లో మొత్తం 777 చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ.. చివరిగా మహేశ్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో కనిపించారు. అనారోగ్యం కారణంగా ఆయన అప్పటి నుంచి ఇంటికే పరిమితం అయ్యారు. కైకాల సత్యనారాయణకు 2017లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు, 2011లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించాయి. ఇక సత్యానారాయణ రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. మచిలీపట్నం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. కానీ ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో నిర్వహించే అవకాశం ఉన్నది.

First Published:  23 Dec 2022 8:31 AM IST
Next Story