'సర్దార్-2' సెట్ లో ప్రమాదం.. స్టంట్ మ్యాన్ మృతి
తమిళ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న 'సర్దార్ -2' సెట్ లో ప్రమాదం జరిగింది. ఫైట్ సీన్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి స్టంట్ మ్యాన్ మృతి చెందాడు.
తమిళ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న 'సర్దార్ -2' సెట్ లో ప్రమాదం జరిగింది. ఫైట్ సీన్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి స్టంట్ మ్యాన్ మృతి చెందాడు. మరో ఇద్దరు అసిస్టెంట్ స్టంట్ మ్యాన్ లకు కూడా గాయాలు అయ్యాయి. కార్తీ హీరోగా 2022లో తెరకెక్కిన సర్దార్ ఘన విజయం సాధించింది. దీనికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం 'సర్దార్ -2' మూవీ తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఫైటింగ్ సీన్స్ కు సంబంధించిన ప్రాక్టీస్ ఇవాళ చెన్నైలో వేసిన ఓ సెట్ లో నిర్వహించారు. ఫైట్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా స్టంట్ మ్యాన్ ఎజుమలై 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడితోపాటు మరో ఇద్దరు అసిస్టెంట్ స్టంట్ మ్యాన్ లకు కూడా గాయాలు అయ్యాయి. ఆ సమయంలో సెట్లో హీరో కార్తీ కూడా అక్కడే ఉన్నాడు. గాయపడ్డ ఎజుమలై, మరో ఇద్దరు అసిస్టెంట్ మ్యాన్ లను చిత్ర బృందం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించింది.
అయితే అప్పటికే స్టంట్ మ్యాన్ ఎజుమలై మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోవడం వల్ల ఛాతి భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయని, అలాగే ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చెన్నై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల పలు తమిళ సినిమాల షూటింగ్ సమయంలో ప్రమాదాలు జరిగాయి. భారతీయుడు -2 షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి ఫైట్ మాస్టర్ సహా ముగ్గురు మృతి చెందారు. తమిళ అగ్ర హీరోలు అజిత్, విశాల్, విజయ్ ఆంటోనీలు కూడా తమ గత చిత్రాల షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాల్లో గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.