ఇలా ప్రకటించి, అలా వాయిదా వేశారు
సమంత లీడ్ రోల్ పోషిస్తున్న భారీ బడ్జెట్ మూవీ శాకుంతలం. ఈమధ్య ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అంతలోనే వాయిదా వేశారు. దీనికి కారణం ఏంటి?
దర్శకుడు గుణశేఖర్ ఆవిష్కరిస్తోన్న అద్భుత దృశ్యకావ్యం 'శాకుంతలం'. మహాభారత ఇతిహాసంలో అద్భుతమైన ప్రేమ ఘట్టంగా చెప్పే అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజుల ప్రణయగాథ ఇది. శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు.
'శాకుంతలం' చిత్రాన్నిప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు ఇంతకుముందు ప్రకటించారు. అయితే ఇప్పుడీ డేట్ నుంచి సినిమా పక్కకు తప్పుకుంది. దీనికి ఓ ప్రధానమైన కారణం ఉంది.
శాకుంతలం లాంటి దృశ్య కావ్యాన్ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు మధురమైన అనుభూతికి లోనుకావాలి. అందుకే ఈ సినిమాను త్రీడీలో కూడా ఆందించే ప్రయత్నం చేస్తున్నారు. దీని కోసం విడుదలను వాయిదా వేశారు.
''అత్యంత భారీ స్థాయిలో శాకుంతలం చిత్రాన్ని మీకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. అందుకే, ఇంతకుముందు ప్రకటించిన సమయానికి మిమ్మల్ని థియేటర్లలో కలుసుకోలేకపోతున్నాం. ఇప్పటిదాకా అడుగడుగునా మమ్మల్ని ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. సరికొత్త విడుదల తేదీతో త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాం'' అంటూ చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ బ్యానర్లపై నీలిమ గుణ నిర్మాతగా శాకుంతలం సినిమా రూపొందుతోంది.