టాలీవుడ్ లో నెపోటిజంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..!
కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత నెపోటిజంపై మాట్లాడారు.
బాలీవుడ్ లో ప్రముఖ హీరోగా వెలుగొందుతున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో నెపోటిజంపై దేశంలో తీవ్రస్థాయిలో చర్చ సాగింది. టాలీవుడ్ లో కూడా నెపోటిజం ఉందని తరచూ వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి. గతంలో, ప్రస్తుతం స్టార్ హీరోలుగా, నిర్మాతలుగా వెలుగొందుతున్న వారి వారసులే టాలీవుడ్ మొత్తం నిండి వున్నారనే విమర్శలు వస్తుంటాయి. తాజాగా హీరోయిన్ సమంత టాలీవుడ్ లో నెపోటిజంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత నెపోటిజంపై మాట్లాడారు. ఒక ఆపిల్ కి మరో ఆపిల్ కి భిన్నం ఉంటుందని, నెపో పిల్లలు, నాన్ నెపో పిల్లలు.. ప్రతి ఒక్కరికీ వారికంటూ సొంత ఆలోచనలు, సొంత ప్రతిభ ఉంటుందని చెప్పారు. ఒక తండ్రి కోచ్ గా ఉన్నప్పుడు అతడి కుమారుడు గేమ్ ఆడుతున్న సమయంలో అతడు పక్కనే నిలబడి చూడగలడు కానీ, గేమ్ గెలవడానికి అతడు ఏం చేయలేడని పేర్కొంది. సినీ ఇండస్ట్రీలో కూడా అంతే అని అన్నారు.
తాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తన సినిమాలు ప్లాప్ అయితే ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుస్తుందన్నారు. అదే స్టార్ నటుల వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు సక్సెస్ కాలేకపోతే దేశం మొత్తం తెలుస్తుందన్నారు. వారిని వారసత్వంతో పోల్చుతూ ఎప్పుడూ ట్రోల్స్ చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు. సూపర్ స్టార్ గా ఉన్న వారందరూ గొప్ప నటులని, గొప్ప నటులుగా ఉన్న వారందరూ సూపర్ స్టార్స్ అని తాను అనుకోవడం లేదన్నారు. దైవానుగ్రహం తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలని అన్నారు. చివరికి సక్సెస్ నిర్ణయించేది ప్రేక్షకులే..అని సమంత పేర్కొంది. టాలీవుడ్ లో నెపోటిజంపై సమంత చేసిన కామెంట్లు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.