తన ఆరోగ్య పరిస్థితిని బయటపెట్టిన సమంత
సమంత ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రోజులుగా పుకార్లు చెలరేగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించింది సమంత.
సమంత ఉన్నట్టుండి సడెన్ గా విదేశాలకు వెళ్లిపోయిందన్నారు కొందరు. ఆమె తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ పుకార్లు పుట్టించారు. ఆమె ఓ రకమైన చర్మవ్యాధితో బాధపడుతోందని మరికొందరు రాసుకొచ్చారు. ఇలా సమంత ఆరోగ్య పరిస్థితిపై గడిచిన కొన్నాళ్లుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు తన హెల్త్ కండిషన్ పై సమంత స్పందించింది.
తను మయోస్టైటిస్ అనే సమస్యతో బాధపడుతోంది. ఈ సమస్య ఉన్నవాళ్లు తరచూ నీరసానికి గురవుతుంటారు. నడిచినా, నిల్చున్నా తొందరగా అలిసిపోతుంటారు. కండరాలు విపరీతంగా నొప్పి పెడుతుంటాయి. కొన్నాళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్న సమంత, తగ్గిపోతుందని అలా వదిలేసింది. అయితే రోజురోజుకు సమస్య పెరగడంతో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది.
తను శారీరకంగా, మానసికంగా ఎన్నో అడ్డంకుల్ని అధిగమించానని... ఈ శారీరక సమస్య కూడా తన నుంచి దూరంగా వెళ్లిపోతుందని ధైర్యంగా చెప్పుకొచ్చింది సమంత. ఈ సందర్భంగా చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకొని, డబ్బింగ్ చెబుతున్న ఫొటోను పోస్ట్ చేసింది.
సమంత ప్రకటనతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇన్నాళ్లూ చెలరేగిన పుకార్లకు చెక్ పడింది. ప్రస్తుతం ఆమె యశోద సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నవంబర్ 11న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.