బాలీవుడ్ బాట పట్టిన మురుగ దాస్
దక్షిణ స్టార్స్ తో దక్షిణ డైరెక్టర్లు తీస్తున్న పాన్-ఇండియన్ సినిమాలు ఒకెత్తు అయితే, బాలీవుడ్ స్టార్స్ తో దక్షిణ డైరెక్టర్లు పాన్ -ఇండియన్ సినిమాలు తీయడం ఇంకో యెత్తు.
దక్షిణ స్టార్స్ తో దక్షిణ డైరెక్టర్లు తీస్తున్న పాన్-ఇండియన్ సినిమాలు ఒకెత్తు అయితే, బాలీవుడ్ స్టార్స్ తో దక్షిణ డైరెక్టర్లు పాన్ -ఇండియన్ సినిమాలు తీయడం ఇంకో యెత్తు. ఇప్పుడు కొత్త తరం తెలుగు, తమిళ దర్శకులు ఈ బాటే పట్టారు. తమిళ దర్శకుడు అట్లీ, తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సెగ్మెంట్ లో ప్రూవ్ చేసుకున్నాక, ఇంకో ఇద్దరు ఎంటరవుతున్నారు. సందీప్ రెడ్డి వంగా షాహిద్ కపూర్ తో ‘కబీర్ సింగ్’, రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ అనే రెండు బ్లాక్బస్టర్లు కొడితే, అట్లీ వచ్చేసి షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ అనే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. వీళ్ళిద్దరూ కాక మరో ఇద్దరు తమిళ దర్శకులు బాలీవుడ్ వైపు బయల్దేరుతున్నారు. ఈ ఇద్దర్లో పా. రంజిత్ నవతరం దర్శకుడు కాగా, ఏఆర్ మురుగ దాస్ వెనకటి తరం దర్శకుడు. పా. రంజిత్ రణవీర్ సింగ్ తో ప్లాన్ చేస్తూంటే, మురుగ దాస్ సల్మాన్ ఖాన్ తో ఫైనల్ చేసుకున్నాడు.
మురుగ దాస్ కీదే బాలీ వుడ్ ఎంట్రీ కాదు. 2008 లో అమీర్ ఖాన్ తో ‘గజినీ’ అనే సూపర్ హిట్ తీసిన వాడే. ఇన్నాళ్ళ తర్వాత బాలీవుడ్ కి తిరిగి వెళ్తున్నారు. ఈ మధ్య తమిళంలో అతడి సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. అతను వి వి వినాయక్, సురేందర్ రెడ్డి, పూరీ జగన్నాథ్ తరం దర్శకుడు. తెలుగులో ఈ ముగ్గురూ ఇప్పుడు ఔట్ డెటెడ్ అయినట్టే మురుగ దాస్ స్కిల్స్ కూడా సన్నగిల్లాయి. 2002 లో ‘రమణ’ తో అతడి విజయయాత్ర ఆరంభమైంది. ఆ తర్వాత ‘గజినీ’, ‘స్టాలిన్’, ‘సెవెన్త్ సెన్స్’, ‘తుపాకీ’ తర్వాత 2014 లో ‘కత్తి’ వరకూ వచ్చి విజయాత్ర ఆగింది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘స్పైడర్’, విజయ్ తో ‘సర్కార్’, రజనీ కాంత్ తో ‘దర్బార్’ కొత్త తరం తమిళ దర్శకుల స్కిల్స్ ముందు రాణించలేకపోయాయి.
కొత్త తరం తమిళ దర్శకులు అట్లీ, పా. రంజిత్, హెచ్. వినోద్, లోకేష్ కనకారాజ్, కార్తీక్ సుబ్బరాజ్ మొదలైన వారు బిగ్ స్టార్స్ తో హిట్స్ తీస్తూంటే, కొత్త తరం ప్రేక్షకులు వీళ్ళ వైపు సాగిపోయారు. ఈ నేపథ్యంలో మురుగ దాస్ కి జర్నీ కష్టంగానే మారింది. నాలుగేళ్ళు ఖాళీగానే వుండాల్సి వచ్చింది. ఇక లాభం లేదని ‘జవాన్’ తో అట్లీ ఇచ్చిన స్ఫూర్తితో బాలీవుడ్ వైపు సాగిపోయి సల్మాన్ దగ్గర సెటిలయ్యాడు.
సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తో మురుగ దాస్ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ 'సికందర్' ని ప్రకటించాడు. సల్మాన్ - దాస్ ల కలయిక ఇప్పుడు మరో బలీయమైన కొత్త రికార్డుల్ని సృష్టించడం ఖాయమని బాలీవుడ్ లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సాజిద్ నాడియా వాలా నిర్మాతగా మేకింగ్‌లో ఇదొక భారీ బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు. విశేషమేమిటంటే, 2008 లో అమీర్ ఖాన్ తో మురుగ దాస్ ‘గజిని’ తీసి బాలీవుడ్ కి 100 కోట్ల క్లబ్‌ని పరిచయం చేసిన వాడే.
ఇప్పుడు సల్మాన్ -దాస్ అనే ఈ రెండు మెగా శక్తులు కలిసి మునుపెన్నడూ చూడని కమర్షియల్ ధమాకా ఇవ్వబోతున్నారని బాలీవుడ్ వర్గాలు ఆకాశాని కెత్తేస్తున్నాయి. ఇందులో సల్మాన్ ఖాన్ ని కొత్త అవతారంలో చూస్తారని వూరిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ నాడు విడుదలవుతుందని ప్రకటించారు. సల్మాన్-ఎఆర్ మురుగదాస్‌ల పాన్ ఇండియా కాంబినేషన్‌లో 'సికందర్' షారుఖ్ -అట్లీల 'జవాన్' తర్వాత మేకింగ్‌లో అదిరిపోతుందని హామీ ఇస్తున్నారు. చూద్దాం ఇప్పుడైనా మురుగ దాస్ అదృష్టం ఎలా వుంటుందో!.