Salaar Teaser: సలార్ అరాచకం.. టీజర్ తో రచ్చ లేపిన ప్రభాస్
Salaar Teaser: మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. సలార్ రెండు భాగాలుగా వస్తోంది. పార్ట్-1 కాల్పుల విరమణ సెప్టెంబర్-28న అంటూ ఆసక్తికరంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
Salaar Teaser: ప్రభాస్ అభిమానులకు పొద్దు పొద్దున్నే విందు భోజనం పెట్టారు సలార్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్. గతంలో ఎప్పుడూ తెల్లవారు ఝామున టీజర్లు రిలీజైన ఉదాహరణలు లేవు. కానీ ప్రభాస్ మూవీ టీజర్ కి ఆ మహూర్తం పెట్టారు, అనుకున్నట్టుగానే ఉదయం 5 గంటల 12 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేశారు. 1.46 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ఉదయాన్నే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.
అభిమానులకు పండగే..
ఆదిపురుష్ ఫలితంతో కాస్త నిరాశలో ఉన్న ప్రభాస్ అభిమానులు నిజంగా పండగ చేసుకునేలా ఉంది సలార్ టీజర్. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. సలార్ రెండు భాగాలుగా వస్తోంది. పార్ట్-1 కాల్పుల విరమణ సెప్టెంబర్-28న అంటూ ఆసక్తికరంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
ఊహకందని విధంగా..
యాక్షన్ సినిమాల్లో కొత్తగా సీన్లు రాయాలన్నా, ఫైట్ సీక్వెన్స్ లు కొత్తగా చూపించాలన్నా బాగా కష్టం. కానీ సలార్ కోసం ప్రశాంత్ నీల్ పడిన కష్టం టీజర్ లోనే స్పష్టంగా తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన యాక్షన్ సీన్లకు పోలిక లేకుండా ఇందులో ఆయన కదలికలున్నాయి. కత్తులు, తుపాకులు, బైక్ లు, గుర్రాలు కామన్ గానే ఉన్నా.. ప్రభాస్ ఎలివేషన్ అదిరిపోయింది. మరో విశేషం ఏంటంటే.. మొత్తం ఇంగ్లిష్ డైలాగులతో అన్ని భాషలకు ఒకటే టీజర్ కట్ చేశారు.
టీజర్ ని టినూ ఆనంద్ డైలాగులతో మొదలు పెట్టి, ఆయన డైలాగులతోనే ఎండ్ చేశారు. సింహం, చిరుత, పులి, ఏనుగు.. చాలా ప్రమాదకరం.. కానీ జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే, ఆ పార్క్ లో.. అంటూ ఆ డైలాగ్ అక్కడ కట్ అవుతుంది, అక్కడే ప్రభాస్ ఎంట్రీ మొదలవుతుంది. అంటే తాను చెప్పబోయే వ్యక్తి పెద్ద డైనోసార్ అనుకునేలా టినూ ఆనంద్ తో హైరేంజ్ లో బిల్డప్ ఇప్పించారు. ప్రభాస్ తో పాటు, మెయిన్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కి కూడా ఈ టీజర్ లో చోటు కల్పించారు. మొత్తమ్మీద ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునేలా, గర్వంగా చెప్పుకునేలా టీజర్ కట్ చేశారు, సినిమాపై మరింతగా అంచనాలు పెంచారు.