Telugu Global
Cinema & Entertainment

‘సాలార్’ బాక్సాఫీసు రన్ ఓవర్!

తాజా అప్‌డేట్ ప్రకారం, దీశీయ బాక్సాఫీసుకి ‘సాలార్ ‘ రూ. 405 కోట్ల నికర వసూళ్ళు చేసింది. ఇది రూ. 477.9 కోట్ల గ్రాస్ (అన్ని భాషలతో కలిపి) కి సమానం.

‘సాలార్’ బాక్సాఫీసు రన్ ఓవర్!
X

ప్రపంచవ్యాప్త బాక్సాఫీసులో ప్రభాస్ నటించిన గ్యాంగ్ స్టర్ యాక్షన్ ‘సాలార్’ 26 రోజుల రన్ పూర్తి చేసుకుని ముగింపు దశకి చేరుకుంది. రూ. 620 కోట్ల కంటే తక్కువ వసూళ్ళు చేసి ఇక త్వరలోనే థియేటర్ల నుంచి నిష్క్రమించబోతోంది. ప్రస్తుతం సినిమా పట్ల ప్రేక్షకుల్లో వున్నఆదరణని పరిగణనలోకి తీసుకుంటే, ఊహించిన దాని కంటే ముందుగానే క్రేజ్ తగ్గడం ఆశ్చర్యకరంగా వుంది. విచిత్రమేమిటంటే, రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ పట్టించుకోకుండా, ప్రభాస్ ఇప్పుడు ప్రమోషన్స్ చేపట్ట బోతున్నట్టు వార్తలు రావడం. వసూళ్ళు తగ్గు ముఖం పట్టాక ప్రాణం పోయాలనుకోవడం. సక్సెస్ మీట్లు పెట్టబోవడం.

ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లేకపోయినా సౌత్ లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. నార్త్ లో మాత్రం ‘కేజీఎఫ్ 2’ అంత రేంజిలో రాలేదు. రిలీజ్ కి ‘సాలార్’, ‘డంకీ’ రెండూ పోటీ పడ్డాయి. అయితే షారుక్ ఖాన్ నటించిన ‘డంకీ’ నిన్నటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 439 కోట్లు వసూలు చేసింది. దీని థియేట్రికల్ రన్ ముగింపుకి రాలేదు. రెండిటి వసూళ్ళూ ఆశించినంత రాలేదు. ‘సాలార్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ గత మూవీ ‘కేజీఎఫ్ 2’ (2022) ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన మొత్తం రూ. 1250 కోట్లలో సగం కూడా వసూలు చేయలేదు ‘సాలార్’. సినిమాలో బలహీనతలే కారణంగా తేలుతోంది.

ఇంకా ‘సాలార్ పార్ట్ 2’ రావాల్సి వుంది. మొదటి భాగం బలహీనతల్ని దృష్టిలో పెట్టుకుని రెండో భాగం కంటెంట్ లో మార్పు చేర్పులు చేస్తే తప్ప, ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ దూకుడుగా చేస్తే తప్ప ‘కేజీఎఫ్ 2’ స్థాయి కలెక్షన్స్ ఆశించలేం. అల్లు అర్జున్ పానిండియా హిట్ ‘పుష్ప’ తర్వాత ‘పుష్ప 2’ ని అనునిత్యం అప్ గ్రేడ్ చేస్తున్నారు. రజనీకాంత్ ‘జైలర్’ వచ్చిన తర్వాత దాన్ని మించిన మార్పు చేర్పులు, సందీప్ రెడ్డి ‘యానిమల్’ వచ్చిన తర్వాత దీన్ని మించిన స్థాయి మేకింగ్ కి అహర్నిశలూ కృషి చేస్తున్నారు.

‘సాలార్’ ని ‘కెజిఎఫ్‌’ తో కనెక్ట్ చేయాలనే ప్రశాంత్ నీల్ ప్లానులో భాగంగా హీరో యష్ అతిధి పాత్రని ఇందులో ప్రవేశపెడతారని మొదట్లో పుకార్లు వచ్చాయి. టీమ్ అధికారికంగా ధృవీకరించనప్పటికీ, ఈ పుకారు చాలా సంచలనం సృష్టించడానికి సహాయపడింది. ఇది నిజంగా జరిగి వుంటే ‘సాలార్’ బాక్సాఫీసు రేంజి అమాంతం పెరిగేది.

‘సాలార్’ డిసెంబర్ 22న విడుదలైంది. దీని ఓవర్సీస్ ప్రీమియర్లు డిసెంబర్ 2 నే జరిగాయి. దురదృష్టం కొద్దీ ఇది సోలో విడుదలకి నోచుకోలేదు. ‘డంకీ’ రూపంలో ఒక శక్తివంతమైన పోటీని ఎదుర్కోవలసి వచ్చింది . వచ్చిన తర్వాత విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షల్ని పొందింది. అయితే మాస్ సెంటర్లలో ప్రశంసలు అందుకుంది. ఫలితంగా, బాక్సాఫీసులో ఫర్వాలేదన్నట్టుగా నిలబడింది.

తాజా అప్‌డేట్ ప్రకారం, దీశీయ బాక్సాఫీసుకి ‘సాలార్ ‘ రూ. 405 కోట్ల నికర వసూళ్ళు చేసింది. ఇది రూ. 477.9 కోట్ల గ్రాస్ (అన్ని భాషలతో కలిపి) కి సమానం. ఈ మొత్తంతో దేశీయ మార్కెట్‌లో ఫర్వాలేదనిపించే ఫలితాన్ని సాధించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 135 కోట్ల గ్రాస్ బిజినెస్‌తో కమర్షియల్‌గా విజయం సాధించింది .రెండింటినీ కలిపి ‘సాలార్’ 26 రోజుల రన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రూ. 612.9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు, సినిమా బాగా స్లో అయ్యింది. ఇక కొన్ని రోజుల తర్వాత రన్‌ ని ముగించ వచ్చు.

ఇప్పుడు ప్రమోషన్స్ కాకుండా సంక్రాంతి సందర్భంగా చేపట్టి వుంటే మెరుగ్గా వుండేది. మూడు స్టార్ సినిమాలు ఫ్లాపయిన పరిస్థితిని కొత్త ప్రమోషన్స్ తో క్యాష్ చేసుకుని వుండేది. సంక్రాంతి పండక్కి ‘హనుమాన్’ దెబ్బకి ‘సాలార్’ కూడా తట్టుకోలేకపోయింది. అక్కడ్నించే కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. నిన్న 26 వ రోజు కేవలం రూ. 26 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి.

First Published:  18 Jan 2024 10:45 AM GMT
Next Story