'నాటు నాటు'- 'చెల్లో షో' ఛలో ఆస్కార్స్ కి!
మొత్తానికి రెండు నెలల ఉత్కంఠకి తెరపడింది. ఏమవుతాయి, మన సినిమా లేమవుతాయి, మన సినిమాలకి ఇప్పటికైనా అంత సత్తా వుందా, అంతర్జాతీయ పోటీల్ని తట్టుకుంటాయా, ఆస్కార్ పట్టించుకుంటుందా.
మొత్తానికి రెండు నెలల ఉత్కంఠకి తెరపడింది. ఏమవుతాయి, మన సినిమా లేమవుతాయి, మన సినిమాలకి ఇప్పటికైనా అంత సత్తా వుందా, అంతర్జాతీయ పోటీల్ని తట్టుకుంటాయా, ఆస్కార్ పట్టించుకుంటుందా... ఇంకా అదనీ ఇదనీ సస్పెన్స్ అనుభవించిన సంగతులన్నీ నిన్న సాయంత్రంతో తేటతెల్లమైపోయాయి! ఆ రెండు సినిమాలు - రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్', గుజరాతీ 'చెల్లో షో' ఎట్టకేలకు 95వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్) కి షార్ట్ లిస్ట్ అయ్యాయి.
1927 లో ఆస్కార్ అవార్డ్స్ ని స్థాపించిన నూరేళ్ళ పైబడిన చరిత్రలో మన దేశం రెండే సినిమాలకి ఆస్కార్ అవార్డులు సాధించాయి- అవి కూడా బ్రిటన్ దర్శకుల సినిమాలకి! 1983 లో మొదటి ఆస్కార్, 2003 లో మూడు ఆస్కార్లు. నామినేట్ అవడమే బ్రహ్మవిద్య అనుకుంటే, గెలవడం బ్రిటన్ దర్శకులు గెలిపిస్తేనేమిటి సంబరాలు జరుపుకుని సంతృప్తి పడ్డాం. అదీ మన గొప్పతనం.
దర్శకుడు పాన్ నళిన్ రూపొందించిన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన 'చెల్లో షో' (ది లాస్ట్ ఫిలిమ్ షో), ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు పొందిన ఎస్ ఎస్ రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' ఆస్కార్స్ 2023కి ఇండియా నుంచి అధికారిక ఎంట్రీలుగా పోటీలకి ఎంపికవడం హర్షదాయకంగా వుంది ఎదురు చూసిన అభిమానులకి.
అయితే 'చెల్లో షో' రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' తో బాటు, వివేక్ అగ్నిహోత్రి 'ది కాశ్మీర్ ఫైల్స్' రెండిటినీ అధిగమించి ఉత్తమ విదేశీ చలన చిత్రం విభాగంలో పోటీలకి షార్ట్ లిస్ట్ అవడం గమనార్హం. ''ఆర్ ఆర్ ఆర్' ఎనర్జిటిక్ సాంగ్ 'నాటు నాటు' కి షార్ట్ లిస్ట్ అయింది. ఉత్తమ పాటల కేటగిరీకి సంబంధించినంత వరకు, 81 ట్యూన్‌లలో 15 పాటలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. వీటిలో 'నాటు నాటు' తో బాటు, 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' నుంచి 'నథింగ్ ఈజ్ లాస్ట్', 'బ్లాక్ పాంథర్: వాకాండా ఫరెవర్' నుంచి 'లిఫ్ట్ మీ అప్', 'టాప్ గన్: మావెరిక్' నుంచి 'హోల్డ్ మై హ్యాండ్' వున్నాయి.
ఎంట్రీ పొందిన 92 దేశాల నుంచి అంతర్జాతీయ చలనచిత్రాలు ముందుకు వచ్చాయి. ఈ జాబితాలో క్లోజ్ (బెల్జియం), డెసిషన్ టు లీవ్ (దక్షిణ కొరియా), ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (జర్మనీ), బార్డో (మెక్సికో), జాయ్‌ల్యాండ్ (పాకిస్థాన్) వున్నాయి. ఇలా 91 దేశాల సినిమాలతో 'చెల్లో షో' పోటీ పడాల్సి వుంది. అలాగే 'నాటు నాటు' సాంగ్ 15 పాటలతో పోటీ పడాల్సి వుంది. ఇప్పట్నుంచీ ఇదో ఉత్కంఠ, సస్పెన్స్!
1983 లో భానూ అతైయా, 2009 లో ఏఆర్ రెహ్మాన్ హోరాహోరీ పోరులో ఆస్కార్ స్వర్ణ ప్రతిమలు చేజిక్కించుకుని ఔరా అన్పించారు. 1957 లో మహెబూబ్ ఖాన్ దర్శకత్వంలో 'మదర్ ఇండియా' ఇండియా నుంచి ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం విభాగంలో అయిన మొదటి సినిమాగా చరిత్రలో నమోదయ్యాక, 1961 లో ఇస్మాయిల్ మర్చంట్ నిర్మించిన 'ది క్రియేషన్ ఆఫ్ ఉమెన్' అకాడమీ అవార్డ్స్ కి నామినేట్ అయిన రెండో సినిమా అయింది.
1983 లో బ్రిటన్ దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో తీసిన 'గాంధీ' నామినేట్ అవడమేగాక భానూ అతైయాకి ఉత్తమ వస్త్రాలంకరణ పురస్కారం లభించింది. ఇది మన దేశానికి మొదటి ఆస్కార్. తర్వాత, 1987 లో ఇస్మాయిల్ మర్చంట్ 'ఏ రూమ్ విత్ ఏ విండో', 1989 లో మీరా నాయర్ 'సలాం బాంబే', 1993 లో ఇస్మాయిల్ మర్చంట్ 'హోవర్డ్స్ ఎండ్', 1994 లో మళ్ళీ ఇస్మాయిల్ మర్చంట్ 'ది రిమెయిన్స్ ఆఫ్ ది డే' తో నామినేషన్ల హీరో అయ్యాక, 2002 లో అమీర్ ఖాన్ 'లగాన్' నామినేట్ అయింది.
ఇక 2009 లోనే బ్రిటన్ దర్శకుడు డానీ బాయల్ 'స్లమ్ డాగ్ మిలియనీర్' తో ఇండియాకి 3 ఆస్కార్లు సొంతమయ్యాయి. ఉత్తమ సంగీతానికి ఏఆర్ రెహ్మాన్, ఉత్తమ గీత రచనకి గుల్జార్, ఉత్తమ శబ్ద గ్రహణానికి రసూల్ పోకుట్టి 3 ఆస్కార్లు సంపాదించి పెట్టారు. అయితే నామినేట్ అయిన మొత్త 10 కేటగిరీల్లో 8 గెలుచుకుంది 'స్లమ్ డాగ్ మిలియనీర్'. మిగిలిన 5 అవార్డులు విదేశీ సాంకేతికులు పొందారు. అలాగే 10 కేటగిరీల్లో నామినేట్ అయిన 'గాంధీ' 8 కూడా ఆస్కార్లు పొందింది. భానూ అతైయా తప్ప మిగిలిన సాంకేతికులు విదేశీయులు.
ఇలా బ్రిటన్ దర్శకులతోనే మన రెండు సినిమాలు ఆస్కార్ స్వర్ణ జ్ఞాపికలు సొంతం చేసుకోవడం జరిగితే, ఇప్పుడు 'చెల్లో షో' పరిస్థితేమిటి? అంతర్జాతీయ విభాగంలో పరిగణన పొందాలంటే ఆ సినిమా ఆ దేశ స్థానిక సంస్కృతిని ప్రతిబింబించాలి. హాలీవుడ్ సంస్కృతిని అనుమతించరు. ఇందుకే 'ఆర్ ఆర్ ఆర్' ఉత్తమ చలన చిత్రంగా అంతర్జాతీయ కేటగిరీలో షార్ట్ లిస్ట్ కాలేదు. 'చెల్లో షో' కి ఈ అర్హతతోనే షార్ట్ లిస్ట్ అవగల్గింది.
అయితే ఇంకా 91 దేశాలతో పోటీ పడితేనే అవార్డు సంగతి తేలేది. అక్కడ దర్శకుడు బ్రిటిషరా, ఇండియనా అని కాదు, ఏమిచ్చాడనేదే. దర్శకుడు పాన్ నళిన్ ఏమిచ్చాడో సినిమాలో చూశాం- పేద బాలల శాస్త్ర విజ్ఞాన తృష్ణ, సృజనాత్మక శక్తి! సినిమా రీళ్ళు అంతరించి, డిజిటలీకరణ చెందుతున్నసంధికాలంలో సానుకూల దృక్పథం, పురోగామి చైతన్యం! ఇది యూనివర్సల్ ఎమోషన్.
నామినేషన్ల ఓటింగ్ జనవరి 12 నుంచి 17 వరకు వుంటుంది. నామినేషన్లు జనవరి 24న ప్రకటిస్తారు. అవార్డులు మార్చి 12న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగే ఉత్సవంలో అందిస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో.