Telugu Global
Cinema & Entertainment

అతను జోకర్, రాక్షసుడు : రాబర్ట్ డీ నీరో ఫలితం : అవార్డు ఊడింది!

హాలీవుడ్ దిగ్గజ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత, 80 ఏళ్ళ రాబర్ట్ డీ నీరో మాజీ ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని జోకర్, రాక్షసుడు అన్నందుకు లీడర్షిప్ అవార్డు ఊడిపోయింది.

అతను జోకర్, రాక్షసుడు : రాబర్ట్ డీ నీరో ఫలితం : అవార్డు ఊడింది!
X

హాలీవుడ్ దిగ్గజ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత, 80 ఏళ్ళ రాబర్ట్ డీ నీరో మాజీ ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని జోకర్, రాక్షసుడు అన్నందుకు లీడర్షిప్ అవార్డు ఊడిపోయింది. ఆయనకి వచ్చే మంగళవారం ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్రాడ్‌కాస్టర్స్ సర్వీస్ టు అమెరికా’ అవార్డుని అందించాల్సి వుంది. డీ నీరో చాలా సంవత్సరాలుగా ట్రంప్‌ ని తరచుగా విమర్శిస్తూనే వున్నారు. ట్రంప్ పై క్రిమినల్ విచారణ పూర్తయి, జులై 11 న శిక్షని నిర్ధారించాల్సి వుంది. ఈ తరుణంలో ట్రంప్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు హాలీవుడ్ లెజెండ్ రాబర్ట్ డి నీరో ప్రతిష్టాత్మక లీడర్షిప్ అవార్డుని కోల్పోవాల్సి వచ్చింది.

ప్రతి అమెరికన్ కీ స్వేచ్ఛా ప్రసంగం చేసేందుకు గల హక్కుని తాము గట్టిగా సమర్ధిస్తున్నప్పటికీ, డీ నీరో చర్యలు తాము గుర్తించాలని ఆశించిన దాతృత్వపు పని నుంచి దృష్టిని మళ్ళిస్తున్నాయనీ, అందువల్ల అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామనీ పై సంస్థ ప్రకటించింది.

చాలా సంవత్సరాలుగా ట్రంప్‌ని తరచుగా విమర్శించే డీ నీరోని , జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉపన్యాసమివ్వడానికి ఆహ్వానించారు. డొనాల్డ్ ట్రంప్ జనవరి 6, 2021న యూఎస్ క్యాపిటల్‌లో హింసని, విధ్వంసాన్నీ ప్రేరేపించాడని పేర్కొంటూ ట్రంప్‌ని చీల్చి చెండాడారు డీ నీరో. అతను దేశానికి "ముప్పు" అని హెచ్చరించారు. ‘'మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు. ట్రంప్ వైట్‌హౌస్‌కి తిరిగి వస్తే, మీరు స్వేచ్చ విషయం మర్చిపోవాలిక, ఎన్నికల సంగతి సరే సరి” అన్నారు. ట్రంప్ ని జోకర్ అని పిలుస్తూ, మనం సీరియస్ గా తీసుకోని ఎందరో జోకర్లు క్రూర నియంతలుగా మారిన చరిత్ర పాఠాల్లోంచి మనం నేర్చుకోవడం లేదన్నారు.

"ట్రంప్‌తో ఇది మనకు రెండో పరీక్ష. ఇప్పుడు మనం ఎవ్వరమూ నవ్వడం లేదు. మళ్ళీ అతను అధికారంలోకి రాకుండా ఓటు వేసే అవకాశం ఇదే మనకు. ఈసారి అధికారంలోకి వస్తే ఇక వదిలిపెట్టడు. మీకు ఇప్పుడే స్పష్టం చేస్తున్నా” అన్నారు డీ నీరో.

ఒక మీడియా సంస్థతో కూడా మాట్లాడిన డీ నీరో, మిస్టర్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా వుండకూడదని అన్నారు. "డోనాల్డ్ ట్రంప్ గురించి నా అభిప్రాయం మీకు తెలుసు, అతను ఒక రాక్షసుడు. అతన్ని అనుమతించకూడదు... వినండి! అతను మళ్ళీ అమెరికా అధ్యక్షుడు కాడు, కాలేడు, ఎప్పటికీ” అని స్పష్టం చేశారు.

ఇలా అవార్డులు కోల్పోయిన సినిమా సెలబ్రిటీలు చాలా మందే వున్నారు. అయితే అవార్డు తీసుకోవడానికి తిరస్కరించిన వాళ్ళు కూడా ఉన్నారు. తీసుకున్న అవార్డుని మరొకరికి ఇచ్చేసి అదెటు పోయిందో తెలీని తారలు కూడా వున్నారు. 1973 లో ‘గాడ్ ఫాదర్’ గ్రేట్ నటుడు మార్లన్ బ్రాండోకి ఆస్కార్ ఉత్తమ నటుడి అవార్డు ప్రకటిస్తే స్వీకరించడానికి అతను వెళ్ళనే లేదు. తన బదులు నటి సచిన్ లిటిల్‌ఫెదర్ ని వేడుకకి పంపి, సినిమాల్లో అమెరికన్ ఆదివాసుల్ని అభ్యంతరకరంగా చూపిస్తున్నందుకు గాను అవార్డుని తిరస్కరిస్తున్నట్టు ఆమె చేత చెప్పించాడు.

ఇక టాప్ హీరోయిన్ యాంజెలీనా జోలీ తనకి లభించిన ఉత్తమ నటి ఆస్కార్ అవార్డుని తన తల్లి కిచ్చేస్తే, ఆమె మరణం తర్వాత ఆ అవార్డు ఎటు పోయిందో జాడ దొరక లేదు. 2017 లో ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’ లో నటనకి గాను కెవిన్ స్పేసీని అంతర్జాతీయ ఎమ్మీ ఫౌండర్స్ అవార్డుతో సత్కరించనున్నట్టు ప్రకటించారు. ఇంతలో 31 సంవత్సరాల క్రితం అతను పాల్పడిన అతడి లైంగిక దుష్ప్రవర్తన గురించి వార్తలు రావడంతో అవార్డుని రద్దు చేశారు.

బిల్ కాస్బీ కామెడీ లెజెండ్‌గా ప్రసిద్ధుడు. 2009 లో అమెరికన్ హాస్యంలో మార్క్ ట్వైన్ బహుమతిని అందుకున్నాడు. అయితే 2018 లో కాస్బీపై అనేక లైంగిక దుష్ప్రవర్తనల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అవి రుజువు కూడా కావడంతో మార్క్ ట్వైన్ అవార్డు మాత్రమే కాదు, అతడి గౌరవ డిగ్రీలు, టెలివిజన్ అకాడమీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోని అతడి విగ్రహం సహా అనేక ప్రశంసల్ని అతన్నుంచి లాక్కున్నారు.

మరి మన సినిమా సెలెబ్రిటీల సంగతి? గుట్కా హీరోల గురించి చెప్పుకోవాలి. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్‌ల కిచ్చిన పద్మ అవార్డుల్ని ను రద్దు చేయాలని పిల్ దాఖలైంది. తప్పుదోవ పట్టించే గుట్కా యాడ్స్ లో నటించి ప్రమోట్ చేసినందుకు ఈ పిల్ దాఖలైంది. అలహాబాద్ హై కోర్టు ఈ పిల్ పై మే 9, 2024 న విచారణ చేపట్టింది.

'పద్మ' అవార్డుల్ని రద్దు చేయడానికి మార్గదర్శకాల్ని రూపొందించాలని, సదరు నటులపై చట్టపరమైన చర్యల్ని ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించాలనీ పిల్ దాఖలు చేసిన న్యాయవాదులు కోరారు. ఇలా అవార్డులు పొందడమంటే బాధ్యత పెంచుకోవడమని గుర్తించకపోతే ఎవరికైనా చిక్కులు తప్పవు. 2010 లో పద్మశ్రీ అవార్డు పొందిన బాలీవుడ్ హీరో సైఫలీ ఖాన్ అయితే ఒక హోటల్లో విదేశీయులపై దాడి చేసి కొట్టిన కేసు వుండనే వుంది. ఈ కేసులో దోషిగా తేలితే పద్మశ్రీ అవార్డు ఊడక తప్పదు!

First Published:  3 Jun 2024 11:30 AM GMT
Next Story