ఆర్జీవీకి హైకోర్టులో ఊరట
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆర్జీవీపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజురు చేసింది. వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై పెట్టిన పోస్టులపై ఆంధ్రప్రదేశ్ లో రామ్ గోపాల్ వర్మపై పలు కేసులు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై కొన్ని రోజుల క్రితం కేసు నమోదైన విషయం తెలిసిందే.
వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటి యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. దీంతోపాటు సినిమా పోస్టర్లపై అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లలో వర్మ మీద కేసులు నమోదు అయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.