మానిటైజేషన్ మొదలుపెట్టిన జియో సినిమా.. డబ్బులు కడితేనే హెచ్‌డీ కంటెంట్
జియో సినిమా ప్రీమియం కింద నెలకు 29 రూపాయలు చెల్లిస్తే ఒక్క డివైజ్‌లో హెచ్‌డీ కంటెంట్ చూడొచ్చు.
ఉచిత ప్రసారాలతో వీక్షకులకు చేరువైన జియో సినిమా ఇప్పుడు మానిటైజేషన్ మొదలుపెట్టింది. హైక్వాలిటీ ప్రసారాలు (హెచ్‌డీ కంటెంట్) కావాలంటే ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే. జియో సినిమా ప్రీమియం కింద నెలకు 29 రూపాయలు చెల్లిస్తే ఒక్క డివైజ్‌లో హెచ్‌డీ కంటెంట్ చూడొచ్చు. ఫ్యామిలీ ప్యాక్ కింద 89రూపాయలు కడితే నాలుగు డివైజ్‌లలో హెచ్‌డీ కంటెంట్ వీక్షించవచ్చని జియో ప్రకటించింది.
4కే క్వాలిటీ.. డౌన్‌లోడ్ ఆప్షన్ కూడా
డబ్బులు చెల్లిస్తే జియో టీవీ కంటెంట్‌ను 4కే వీడియో క్వాలిటీతో ఆస్వాదించవచ్చు. అంతేకాదు ఎలాంటి యాడ్స్ కూడా రావు. పైగా డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో కూడా చూడొచ్చు. కాబట్టి నెట్ అందుబాటులో లేనప్పుడు కూడా వినోదం మీ చేతిలో ఉంటుందని జియో చెబుతోంది. 4కే హెచ్‌డీ వీడియోలు చూడాలనుకునేవారు ఈ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నది జియో అంచనా.
ఇంటర్నేషనల్ కంటెంట్.. ఇండియన్ లాంగ్వేజెస్
జియో ప్రీమియం ప్లాన్ తీసుకున్నవారు ఇంటర్నేషనల్ కంటెంట్‌ను స్థానిక భాషల్లో చూడొచ్చు. పీకాక్, హెచ్‌బీఓ, పారామౌంట్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ వంటి ఇంటర్నేషనల్ స్టూడియోల సిరీస్‌లు, సినిమాలు కూడా ప్రీమియం ప్లాన్‌లో అందుబాటులో ఉంటాయని జియో ప్రకటించింది. పోకేమాన్,మోటూపత్లూ వంటి చిన్న పిల్లల షోలు కూడా అందుబాటులోకి వస్తాయి. చైల్డ్ లాక్ ఆప్షన్ కూడా ఉంది.