పెద్ద ఓటీటీల ఉచితాలతో ప్రాంతీయ ఓటీటీల కటకట!
ఇలా పెద్ద ఓటీటీల ఉచితాల సంతర్పణని తట్టుకోవడానికి చిన్నచిన్న ప్రాంతీయ ఓటీటీలు తమవైన తెలివితేటలతో ఉచితాల్ని సృస్టిస్తూ ప్రేక్షకుల్ని నిలుపుకోవాడానికి, పెంచుకోవడానికీ నానా తంటాలు పడుతున్నాయి.
పెద్ద ఓటీటీలు వాటి మార్కెట్ విస్తరణా సామర్ధ్యంతో, ఆధిపత్యంతో లోతట్టు ప్రాంతాలకి సైతం చొచ్చుకు వెళుతూ, ఉచిత కంటెంట్ ని ఉదారంగా గుమ్మరిస్తూంటే, తట్టుకోలేక ప్రాంతీయ ఒటీటీలు అస్తిత్వ పోరాటం చేస్తున్నాయి. పెద్ద ఓటీటీలు తమ చిన్న ప్రత్యర్ధుల్ని కుదిపివేయడానికి ప్రకటనల ఆధారిత మానిటైజేషన్ మోడల్ ని కలిగి వుండడంతో ఉచిత స్ట్రీమింగ్ కి వీలుపడుతోంది.
గత సంవత్సరం జియో సినిమా ఐపీఎల్ తో పాటు కొత్త సినిమాలు, షోలు సహా స్థానిక భాషా కార్యక్రమాల్ని ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ వినియోగదారులకు ఎటువంటి రుసుము లేకుండా ప్రీమియం స్పోర్ట్స్ ఈవెంట్‌లని అందించింది. అమెజాన్ దాని ఉచిత సేవ ‘మినీటీవీ’ లో అంతర్జాతీయ కంటెంట్‌ని ప్రసారం చేయసాగింది.
అయితే ఓటీటీ అడ్వర్టైజింగ్ మార్కెట్ కి దాని స్వంత సవాళ్ళు దానికున్నాయి. ఈ - కామర్స్, సోషల్ మీడియా, షార్ట్-వీడియో ప్లాట్‌ఫారమ్‌లతో పాటు యూట్యూబ్, ఫేస్‌బుక్ ల వంటి ఇండస్ట్రీ దిగ్గజాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రధాన ప్రత్యర్థులుగా ఎదుగుతున్నాయి.
ఈ నేపధ్యంలో ప్రాంతీయ ఓటీటీల పట్ల సాంప్రదాయ ప్రకటనకర్తల ఆసక్తి ప్రస్తుతం గరిష్ట స్థాయిలో లేకపోయినా, మరాఠీ మాట్లాడే ప్రేక్షకులతో ప్రతిధ్వనించే సహకార కార్యక్రమాలని అన్వేషించడానికి బ్రాండ్‌లతో చురుకుగా చర్చలు జరుపుతున్నారు.
వీటి ఒరిజినల్ ప్రోగ్రామింగ్‌లో సృష్టించిన కంటెంట్ కి స్పాన్సర్‌షిప్‌లపై చిన్న ఓటీటీల నిర్వాహకులు దృష్టి పెట్టారు. మరాఠీ భాషలో ఓటీటీల విషయానికొస్తే, మరాఠీ కేంద్రీకృత కంటెంట్ మొదట్లో సముచిత ప్రకటనదారుల్ని ఆకర్షించవచ్చని, బ్రాండెడ్ కంటెంట్, స్పాన్సర్‌షిప్‌లు అసలు ప్రోగ్రామింగ్‌లోని ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్‌ల వంటి సహకార కార్యక్రమాలు అదనపు ఆదాయ మార్గాలకు అవకాశాల్ని అందజేస్తాయనీ భావిస్తున్నారు.
బ్రాండెడ్ కంటెంట్ అనేది సురక్షిత ప్రత్యామ్నాయం. ఇది గత ఏడాది కాలంగా వేగం పుంజుకుంటోంది. ముఖ్యంగా హోలీ, దీపావళి, నవరాత్రి వంటి పండుగల సమయాల్లో బ్రాండ్‌ల న్నిటికీ మార్కెట్ అవకాశాలున్నాయనీ, అయితే షోల కోసం కాన్సెప్టులు కంటెంట్ సృష్టికర్తల నుంచి రావాలని అంటున్నారు.
విదేశీ దిగ్గజ ఓటీటీలతో మార్కెట్లో పెద్ద పోటీ వున్నందున, కొన్ని సంస్థలు ఇప్పటికీ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌పై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. పంజాబీ ఓటీటీలు ఇటువైపుగా దృష్టి సారించాయి. ఒక పంజాబీ ఓటీటీ మొదటి ఎపిసోడ్‌లన్నింటినీ ఉచితంగా ప్రసారం చేస్తోంది. ప్రేక్షకులు సిరీస్‌ని ఒక నమూనాగా చూసుకుంటారు. ఇష్టపడితే తర్వాతి ఎపిసోడ్ చూసేందుకు చెల్లిస్తారు. చెల్లింపు సామర్థ్యం ప్రకారం విభిన్న ప్రేక్షకులకి విభిన్న ప్రణాళికలు ప్రాతిపదికన తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
ఒడియా కంటెంట్‌లో ప్రత్యేకత కలిగిన ఒక ప్రాంతీయ ఓటీటీ అనుచిత ప్రకటనల నుంచి ఉచిత స్ట్రీమింగ్ అనుభవాన్ని అందించే సంస్కృతిని పెంపొందించిందని తెలుస్తోంది. ఖచ్చితంగా చెప్పాలంటే, అడ్వర్టైజింగ్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్ (ఏవీఓడీ) మోడల్ కి పరిమితులు న్నాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారా అతిపెద్ద ప్లేయర్స్ మార్కెట్‌లో అసమానమైన వాటాని పొందుతారు. తద్వారా ఇతరులకి అధిక ప్రతికూల పరిస్థితులేర్పడతాయి. ఓటీటీకి బలమైన, విభిన్నమైన కంటెంట్ వుంటే ప్రకటనదారులు క్యూ కడతారు. ఉదాహరణకు, ఏవీఓడీలో ఐపీఎల్, ప్రపంచ కప్ వంటి ఉచిత స్ట్రీమింగులు. ఇవి సబ్‌స్క్రిప్షన్ రాబడిని పెంచుతాయి.
ఇంకొక విధానంలో, చిన్న ప్రాంతీయ భాషా స్ట్రీమింగ్ సేవలు మానిటైజేషన్ కి హైబ్రిడ్ మోడళ్లను ఎంచుకుంటున్నాయి. అంటే వివిధ ధరల పాయింట్లకి, స్థానిక మార్కెట్‌లపై లోతైన అవగాహన ఆధారంగా ప్రోగ్రాముల బండిల్ ని అభివృద్ధి చేయడం, శాంపిల్ చేయడానికి నిర్దిష్ట కంటెంట్‌ని ఉచితంగా అందించడం చేస్తారు. దీనికోసం చాలా మంది స్పాన్సర్‌షిప్‌లపై ఆధారపడుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి వ్యయంలో గణనీయమైన భాగాన్ని బ్రాండ్ భరిస్తుంది.
ఇలా పెద్ద ఓటీటీల ఉచితాల సంతర్పణని తట్టుకోవడానికి చిన్నచిన్న ప్రాంతీయ ఓటీటీలు తమవైన తెలివితేటలతో ఉచితాల్ని సృస్టిస్తూ ప్రేక్షకుల్ని నిలుపుకోవాడానికి, పెంచుకోవడానికీ నానా తంటాలు పడుతున్నాయి. దీంతో అయిపోలేదు, దిగ్గజ ఓటీటీలు భారీ సినిమాల్ని గుమ్మరిస్తూంటే దీన్ని కూడా తట్టుకోవడమెలా? దీని గురించి మరోసారి!