థియేటర్ల మనుగడ కోసం పాత సినిమాల రీ – రిలీజ్!
ఒకవైపు ఓటీటీలు, మరోవైపు థియేటర్లలో విడుదలవుతున్న రుచీపచీ లేని కొత్త సినిమాలు థియేటర్ల మనుగడకి సవాలుగా మారడంతో- కొత్త మార్గం పడుతున్నారు థియేటర్ల యజమానులు.
ఒకవైపు ఓటీటీలు, మరోవైపు థియేటర్లలో విడుదలవుతున్న రుచీపచీ లేని కొత్త సినిమాలు థియేటర్ల మనుగడకి సవాలుగా మారడంతో- కొత్త మార్గం పడుతున్నారు థియేటర్ల యజమానులు. కొత్త సినిమాలకి ప్రేక్షకుల ఆదరణ లభించక దేశవ్యాప్తంగా థియేటర్‌లలో బాక్సాఫీసు తగ్గుముఖం పట్టడంతో, కలెక్షన్లు పెంచుకునేందుకు పాత హిట్ సినిమాలని మళ్ళీ విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో ఈ పరిస్థితిని చక్కబర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో 1990-2000 మధ్య విడుదలైన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘జబ్ వి మెట్’, ‘మొహబ్బతే’ వంటి పాత హిట్స్, ఇంకా మరికొన్ని ఇతర హిట్ సినిమాలూ గత కొన్ని వారాలుగా రీ రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు టిక్కెట్ ధరల్ని నామమాత్రంగా వుంచుతున్నారు. కొత్త సినిమాలకి కలెక్షన్లే లేనప్పుడు పాత సినిమాలకి టికెట్ల ధరలు తగ్గిస్తే వచ్చే నష్టమేమీ లేదని భావిస్తున్నారు.
పాత హిట్స్ కి 50% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ వుండడం ఒక ఆశ్చర్య పర్చే విషయం. ముఖ్యంగా వారాంతాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాత హిట్స్ రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ వసూలు చేశాయి. ఈ సినిమాలు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వున్నప్పటికీ థియేటర్లకి ప్రేక్షకులు వస్తున్నారు. దీంతో కొంతమంది నిర్మాతలు, థియేటర్ల యజమానులూ పాత ప్రేక్షకుల్ని దృష్టిలో వుంచుకుని, 1990ల కంటే ముందు విడుదలైన సినిమాలు సహా పాత హిట్స్ ని ఇప్పుడు మళ్ళీ విడుదల చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
ఇంకో వ్యూహం ఇప్పటికే అమల్లో వుంది. పండుగల సమయంలో ఎవరైనా ఒక స్టార్ పాత క్లాసిక్స్ రెట్రో పేరుతో ఫెస్టివల్స్ నిర్వహించడం వల్ల, యువ ప్రేక్షకులకి వారు మిస్సయిన ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ని ఆనందించే అవకాశం లభిస్తోంది. ఇలాటి ఫెస్టివల్స్ పీవీఆర్ - ఐనాక్స్ గ్రూపు నిర్వహించింది. ఇంకా రెగ్యులర్ సినిమా ప్రేక్షక సమూహాల కావల ఇతర వినోద మాధ్యమాలకూ సమూహాలున్నాయని, దీన్ని కూడా క్యాష్ చేసుకుని థియేటర్ల మనుగడ కాపాడుకోవాలని భావిస్తున్నారు. ఈ కోవలో ఐసిసి క్రికెట్ టోర్నమెంట్‌లు, గేమింగ్ ఈవెంట్‌లు, అంతర్జాతీయ సంగీత కచేరీల ప్రత్యక్ష ప్రదర్శనల నుంచీ అయోధ్య టెంపుల్ ప్రారంభోత్సవం, రిపబ్లిక్ డే పరేడ్ వంటి ముఖ్యమైన జాతీయ ఈవెంట్‌ల వరకూ ప్రయోగాలు చేసి లాభం పొందారు కూడా.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ స్క్రీనింగ్‌లు భారీ కలెక్షన్లు పొందాయి. సగటు ఆక్యుపెన్సీ 73% పైగా వుంది. టికెట్ ధర రూ. 600 వసూలు చేసినా లెక్క చేయలేదు. అయోధ్య టెంపుల్ ప్రారంభోత్సవం, రిపబ్లిక్ డే ఈవెంట్‌ల స్క్రీనింగ్ ధర రూ.100 మాత్రమే. పైగా ఒక పానీయం, ఒక పాప్‌కార్న్ ఉచితం. జాతీయంగా అయోధ్య టెంపుల్ స్క్రీనింగ్ సగటు ఆక్యుపెన్సీని 70% కంటే ఎక్కువ సాధించింది, అయితే రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యేకంగా ఢిల్లీ, యూపీ ప్రాంతాల్లో 65% పైగా ఆక్యుపెన్సీని సాధించింది.
థియేటర్ల యజమానులు సినిమా థియేటర్లలో ప్రత్యామ్నాయ కంటెంట్‌ని ప్రదర్శించడానికి ఉత్సాహం చూపుతున్నారు. ప్రేక్షకులకి కొత్తగా విడుదలైన సినిమాల కంటే కూడా విభిన్న వినోద ఛాయిస్ లు అందించడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. కొత్త సినిమాలు తక్కువగా విడుదలవుతున్నప్పుడు, నిర్దిష్ట ఈవెంట్‌లు వున్న కాలంలో, ప్రత్యామ్నాయ కంటెంట్‌ని ప్రదర్శించడం వల్ల స్క్రీన్‌లని సమర్ధవంతంగా వినియో గించుకోవచ్చని, ఈ రూపంలో ప్రేక్షకుల్ని థియేటర్లకి లాగవచ్చనీ అర్ధం జేసుకుంటున్నారు.
ఇక త్వరలో సినీపొలిస్ మల్టీప్లెక్స్ గ్రూపు 1990ల నాటి మూడు సినిమాలతో రెట్రో ఫిల్మ్ ఫెస్టివల్నినిర్వహించాలని యోచిస్తోంది. అక్షయ్ కుమార్- సైఫలీ ఖాన్ ల ‘మై ఖిలాడీ తూ అనాడీ’, అక్షయ్ కుమార్ ‘ఖిలాడీ’, షారూఖ్ ఖాన్ ‘బాజీగర్’ - ఈ మూడు పాత హిట్స్ ఈ రెట్రోలో వుంటాయి. ఇంకా ఆస్కార్ కి నామినేట్ అయిన సినిమాల్ని ప్రదర్శించడానికి మార్చిలో ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్ని ప్లాన్ చేస్తోంది. మరింకా త్రీడీ సినిమాల ఫెస్టివల్ ని కూడా నిర్వహించబోతోంది.
కొత్త సినిమాలు విడుదలైన మరుసటి రోజే కుప్పకూలుతున్న సమయంలో ఈ వ్యూహాలు అమలు చేయక తప్పడం లేదని మల్టీప్లెక్స్ గ్రూపు చెబుతోంది. గత కొన్ని వారాలుగా హిందీ రాష్ట్రాల్లో ‘ఫైటర్’, ‘మై అటల్ హూ’, ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ వంటి సినిమాలు అధ్వాన్నంగా ఆడడంతో తలలు పట్టుకున్నారు.
థియేటర్ యాజమానుల మరో ముఖ్యమైన ఫిర్యాదు ఏమిటంటే, హిందీ చలనచిత్ర సంగీతానికీ - బాక్సాఫీస్ విజయాలకూ మధ్య ఒకప్పుడున్న శక్తివంతమైన సమన్వయం బలహీన పడుతోందనేది. ముఖ్యంగా చిన్న పట్టణాల్లోని ప్రేక్షకుల్లో హిట్ పాటలు సినిమా ప్రారంభ బాక్సాఫీస్ ఆదాయాన్ని కనీసం 20% పెంచుతాయని, ఇది కీలకమైన మార్కెటింగ్ సాధనంగా ఉపయోగపడుతుందనేది వారి వాదన. ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆవిర్భావం, రికార్డింగ్ స్టూడియోల ద్వారా మ్యూజిక్ మార్కెటింగ్ ప్రయత్నాలలో గుర్తించదగిన క్షీణత, ప్రీ-రిలీజ్ ఉత్సాహాన్ని సృష్టించడంలో ఫిల్మ్ సౌండ్‌ట్రాక్‌ల పాత్రని తగ్గిస్తోందని థియేటర్ యజమానులు అంటున్నారు. మల్టీప్లెక్స్ గ్రూపులు కూడా, ప్రేక్షకుల్ని థియేటర్‌లకి ఆకర్షించడంలో సంగీతం ప్రాముఖ్యాన్ని ఎత్తిచూపాయి.