Raviteja | మరోసారి వాయిస్ ఓవర్ ఇచ్చిన రవితేజ
Raviteja - రవితేజకు వాయిస్ ఓవర్లు ఇవ్వడం కొత్త కాదు. గతంలో మర్యాదరామన్న లాంటి సినిమాలకు ఇచ్చాడు. ఇప్పుడు హను-మాన్ కు ఇస్తున్నాడు.
హనుమంతుడిని వానర రూపంలో కొలుస్తారు. హిందువులు, వానరంను దైవంగా భావించి పూజిస్తారు. 'హను-మాన్'లో వానరం ఉంది. దీనిది ఓ ప్రత్యేకమైన పాత్ర. 'హను-మాన్'లో వానరం పేరు కోటి, అది సినిమా అంతటా ఉంటుంది.
ఈ కీలక పాత్రకు మాస్ మహారాజా రవితేజ తన వాయిస్ ని అందించారు. కోటి పాత్రకు రవితేజ డబ్బింగ్ చెప్పారు. సాధారణంగా, వానరములు వాటి చంచలమైన స్వభావం, చమత్కారమైన చర్యలు, అత్యంత శక్తికి ప్రసిద్ధి చెందాయి. రవితేజ వాయిస్‌తో పాత్ర మరింత హ్యూమర్ గా, ఎనర్జిటిక్‌గా తయారైందంటున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రవితేజ సపోర్ట్ బిగ్ బెనిఫిట్ కానుంది. నిజానికి చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు సపోర్ట్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు రవితేజ. మాస్ మహారాజా రవితేజ సపోర్ట్ కు హను-మాన్ టీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఇంతకుముందు ప్రశాంత్ వర్మ తీసిన "అ!" అనే సినిమాకు కూడా రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ సినిమాలో ఓ బొన్సాయ్ చెట్టుకు వాయిస్ ఇవ్వగా, ఈసారి కోతి పాత్రకు వాయిస్ అందించాడు.
అఖండ భారత్‌లోని ఇతిహాసం నుండి ప్రేరణ పొందిన హను-మాన్ ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం. అంజనాద్రి అనే ఫాంటసీ లోకం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది.