Telugu Global
Cinema & Entertainment

రవితేజకి టైగర్ చాలా స్పెషల్

ఈ దసరాకి బాలకృష్ణ, రవితేజ, విజయ్ ఫ్యాన్స్ కి చాలా భిన్నంగా రెగ్యులర్ మాస్ ఎంటర్ టైనర్స్ బదులు సీరియస్ యాక్షన్ డ్రామాలు అందుతున్నాయి.

రవితేజకి టైగర్ చాలా స్పెషల్
X

ఈ దసరాకి బాలకృష్ణ, రవితేజ, విజయ్ ఫ్యాన్స్ కి చాలా భిన్నంగా రెగ్యులర్ మాస్ ఎంటర్ టైనర్స్ బదులు సీరియస్ యాక్షన్ డ్రామాలు అందుతున్నాయి. కామెడీ లేదు, రోమాన్సు లేదు, పాటల్లేవు, డాన్సుల్లేవు వంటి ఫిర్యాదుల భయం లేకుండా ఈ స్టార్లు తామెలా వుండాలని కోరుకుంటున్నారో, ఎలాటి సినిమాలతో మార్పు తేవాలనుకుంటున్నారో తెలియజెప్తూ ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వర రావు’, ‘లియో’ అనే భారీ బడ్జెట్ సినిమాలతో ముందు కొస్తున్నారు. ఈ మూడూ యాక్షన్ ప్రధాన సీరియస్ సినిమాలే. అందులోనూ ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘లియో’ డార్క్ మూవీస్ జానర్ కిందికొచ్చే అతి వయొలెంట్ సినిమాలు. ‘లియో’ కైతే ఇందులో హింసని తట్టుకోవడానికి దిటవు గుండెలుండాలని ప్రచారం జరుగుతోంది.

శుభమాని పండక్కి హాయిగా ఎంజాయ్ చూసే సినిమాలుగాక, హింసాత్మక సినిమాలు రావడం ఫ్యాక్షన్ సినిమాలు మొదలైనప్పట్నుంచీ వుంది. కుటుంబ సినిమాల పేరుతో పండగ పూట కూడా కుటుంబాల్ని నరుక్కోవడాలు, రక్తాలు పారించడాలు, పగబట్టి భీకర ప్రతిజ్ఞలు చేయడాలూ...వంటి చిత్రీకరణలతో స్టార్లు వెలిగిపోతున్నారు. ఈ దసరాకీ రకరకాల మారణాయుధాలకి ఆయుధ పూజ చేసుకుని, ప్రేక్షకుల డిఫెన్స్ మెకానిజం మీద మీద ప్రయోగించడానికి వచ్చేస్తున్నారు.

ఇలా మాస్ మహారాజా రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ ఓ కరుడు గట్టిన దొంగ బయోపిక్. దొంగతనాల్ని వృత్తిగా చేసుకున్న ఎరుకల కులస్థుల్ని సంస్కరించే లక్ష్యంతో 1910 లో గుంటూరు జిల్లాలో స్టూవర్ట్ పురం అనే సెటిల్మెంట్ ని ఏర్పాటు చేశాడు బ్రిటిష్ దొర హెరాల్డ్ స్టూవర్ట్. కానీ ఆ తెగ దొంగతనాలు మానుకోలేదు. స్టూవర్ట్ పురం అంటేనే దొంగల పురం అనేట్టు చేశారు. అలా 1970 లలో సమస్యగా మారిన కర్రెద్దుల నాగేశ్వర రావు అనే గజ దొంగ కథే ‘టైగర్ నాగేశ్వరరావు’.

ఇతను గజ్జెల ప్రసాద్ అనే ఇంకో దొంగతో కలిసి బ్యాంకుల్ని, నగల షాపుల్నీ దోపిడీ చేసేవాడు. అప్పటి మద్రాసు దాకా అతడి దోపిడీల చరిత్ర వుండేది. దోచుకున్న సొత్తులో అధికభాగం పేదలకి పంచిపెట్టి అభినవ రాబిన్ హుడ్ అన్పించుకునే వాడు. పోలీసులే అతడికి టైగర్ అని పేరు పెట్టారు. 1987 లో మద్రాసు పోలీసులకి లొంగిపోయాడు. ఆ తర్వాత ఎన్ కౌంటరై పోయాడు.

ఈ టైగర్ నాగేశ్వరరావు పాత్రే రవితేజ నటిస్తున్నది. స్టూవర్ట్ పురం మీద గతంలో ఓ సినిమా వచ్చింది. 1991 లో చిరంజీవి నటించిన ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’. ఇది పూర్తిగా కాల్పనిక మాఫియా కథ. ‘టైగర్ నాగేశ్వరావు’ నిజ కథ. 2012 లో దొంగల దండుతో కన్నడలో ‘దండుపాళ్య’ (తెలుగులో ‘దండుపాళ్యం’) వచ్చింది. ఇది కర్ణాటకలో అతి క్రూరులైన దొంగల ముఠా కథ. వీళ్ళు విచ్చలవిడి హత్యలు చేసి దోచుకుంటారు. ఇది అతి పెద్ద హిట్టయింది. తర్వాత 2,3,4 భాగాలు తీశారు.

రవితేజ ‘టైగర్’ ట్రైలర్ తో డార్క్ క్యారక్టర్ పరిచయమైపోయింది కాబట్టి, కథ దేని గురించో వెల్లడైంది కాబట్టి, ప్రేక్షకులు యింకేం ఆశించకుండా కర్రెద్దుల నాగేశ్వర రావుగా రవితేజ ఎలా నటించాడో చూడడానికి వెళ్తారు. ఐతే ఎందుకో ఈ సినిమాకి మార్కెట్ లో అంత హైప్ రావడంలేదు. బుకింగ్స్ కూడా బలహీనంగా వున్నాయి. థియేటర్లు కూడా సరైనవి లభింఛలేదు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ రిలీజ్ చేస్తున్న ‘లియో’ కే ఎక్కువ సంఖ్యలో, ఎక్కువ ప్రధాన సెంటర్స్ లో థియేటర్లు దక్కాయి. ఈ విషయంలో ‘భగవంత్ కేసరి’ కూడా వెనుకబడే వుంది.

ఇందులో రవితేజతో బాటు నుపూర్ సానన్, రేణూ దేశాయ్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, నాజర్, ప్రదీప్ రావత్ లు నటించారు. ఆర్. మాధి ఛాయాగ్రహణం, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం. నిర్మాత అభిషేక్ అగర్వాల్, రచన- దర్శకత్వం వంశీ. అక్టోబర్ 20 విడుదల. రవితేజకీ మొదటిసారిగా ఇది 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా.

First Published:  17 Oct 2023 3:35 PM IST
Next Story