Rashmika - మీడియాకు రష్మిక స్వీట్ బాక్సులు
కొంతమంది మీడియా ప్రతినిధులకు స్వీట్ బాక్స్ లు పంపింది రష్మిక. తనను సపోర్ట్ చేయాలని కోరింది
బడా సినిమాల్లో అవకాశాలు అందుకోవడమే కాదు, మీడియాను మేనేజ్ చేయడంలో కూడా రష్మికకు చాలా టాలెంట్ ఉంది. సాధారణంగా హీరోయిన్లు మీడియాకు దూరంగా ఉంటారు. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుంటారు. కానీ రష్మిక మాత్రం రెగ్యులర్ గా మీడియాతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఆమె మరోసారి తన పీఆర్ టాలెంట్ చూపించింది.
టాలీవుడ్ కు చెందిన కొంతమంది సినీ జర్నలిస్టులకు ప్రత్యేకంగా స్వీట్ బాక్సులు పంపించింది రష్మిక. కలిసి చాలా రోజులైందని, చాలా గ్యాప్ వచ్చిందని అంటూనే.. భవిష్యత్తులో కూడా ఇలానే తనను సపోర్ట్ చేయాలని, ఆశీర్వదించాలంటూ ఓ నోట్ కూడా పంపించింది. దానిపై సంతకం చేసి మరీ స్వీట్ బాక్స్ అందించింది.
టాలీవుడ్ లో అతికొద్దిమంది, కీలకమైన సినీ జర్నలిస్టులకు మాత్రమే ఈ బాక్సులు అందాయి. కొందరికి బాక్సులు పంపించడంతో పాటు, పర్సనల్ గా ఫోన్ కూడా చేసి మాట్లాడింది రష్మిక.
ఈమధ్య 2 బాలీవుడ్ సినిమాలతో బిజీ అయింది రష్మిక. దీంతో టాలీవుడ్ లో ఆమెకు చిన్న గ్యాప్ వచ్చింది. పుష్ప-2 షూటింగ్ లో జాయిన్ అయినప్పటికీ, మీడియాను కలిసే అవకాశం మాత్రం రాలేదు. దీనికితోడు ఆమె వ్యక్తిగత జీవితంపై కొన్ని పుకార్లు, ఇంకొన్ని వివాదాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె 'కొందరికి' గిఫ్ట్ బాక్సులు పంపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో పుష్ప-2 సినిమాతో పాటు రెయిన్ బో అనే మరో సినిమాను కూడా లాంఛ్ చేసింది.