Maruthi Nagar Subramanyam | హీరోగా రావు రమేష్
Maruthi Nagar Subramanyam - మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాతో హీరోగా పరిచయమౌతున్నారు రావు రమేష్. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు రావు రమేష్. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరోలు, నటీనటులు ఎంతో అభిమానించే వ్యక్తి. అతనితో నటించాలని కోరుకునే వాళ్ళెందరో! వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్... 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
రావు రమేష్ కథానాయకుడిగా, టైటిల్ రోల్‌లో నటించిన సినిమా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు.
అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రధారులు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా వినూత్నంగా ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
సాధారణంగా సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయించడం కామన్. 'మారుతి నగర్ సుబ్రమణ్యం' టీమ్ కొత్తగా ఆలోచించింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫస్ట్ లుక్ విడుదల చేయమని ప్రేక్షకుల్ని కోరింది. సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా క్యూఆర్ స్కానింగ్ ద్వారా లుక్ విడుదల చేయడం ఇదే తొలిసారి. ఫస్ట్ టైమ్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం' టీమ్ చేసిన కొత్త ప్రయత్నానికి సూపర్బ్ రెస్పాన్స్ లభించింది.
'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో రావు రమేష్ ఫస్ట్ లుక్ చూస్తే... గళ్ళ చొక్కా, లుంగీలో పక్కా మాసీగా కనిపిస్తున్నారు. ఈసారి ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తానని తెలిపారు.