Ram Gopal Varma: కొత్త సినిమా ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma: ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో ఎవ్వరికీ తెలీదు. ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇలా ఊహాతీతంగా ఉండే వర్మ, ఇప్పుడు మరో సినిమా ప్రకటించాడు.

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసొచ్చిన వెంటనే ఆర్జీవీ నుంచి కొత్త సినిమా ప్రకటన రావడం, పైగా అది పొలిటికల్ సినిమా కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రాజెక్టుపై పడింది.
"నేను అతి త్వరలో "వ్యూహం" అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన "వ్యూహం" కధ, రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది."
ఇలా తన కొత్త సినిమాను ప్రకటించాడు వర్మ. ఈ సినిమాను 2 భాగాలుగా తీయబోతున్నాడు ఈ దర్శకుడు. మొదటి భాగానికి వ్యూహం, రెండో భాగానికి శపథం అనే టైటిల్స్ పెట్టాడు. ఈ రెండు భాగాల్లో రాజకీయ అరాచకాలు పుష్కలంగా ఉంటాయంటున్నాడు.
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం "వ్యూహం" షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి పార్ట్ 2 "శపథం" తో మరో షాక్ ఇస్తానంటున్నాడు వర్మ. గతంలో ఆర్జీవీతో వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్, ఈ కొత్త సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.