Telugu Global
Cinema & Entertainment

Bedurulanka | రామ్ చరణ్ చేతుల మీదుగా బెదురులంక ట్రయిలర్ రిలీజ్

Bedurulanka Trailer - కార్తికేయ తాజా చిత్రం బెదురులంక. ఈ సినిమా ట్రయిలర్ ను రామ్ చరణ్ రిలీజ్ చేశాడు.

Bedurulanka | రామ్ చరణ్ చేతుల మీదుగా బెదురులంక ట్రయిలర్ రిలీజ్
X

డిసెంబర్ 21, 2012... ప్రపంచమంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు! ఆ రోజు యుగాంతం రాలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని లంక గ్రామాల్లో ఓ గ్రామమైన బెదురులంకలో కొందరు కేటుగాళ్ళు ప్రజల్లో భక్తిని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యుగాంతం అంటూ భయపెట్టి దేవుడి పేరుతో దోపిడీకి తెరతీశారు. వాళ్ళ మాయమాటలు నమ్మని శివ శంకర వరప్రసాద్ ఏం చేశాడు? అనేది ఆగస్టు 25న వెండితెరపై చూడాలి. శివశంకర వరప్రసాద్ గా కార్తికేయ నటించాడు.

కార్తికేయ గుమ్మకొండ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'బెదురులంక 2012'. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆగస్టు 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమైందీ సినిమా.

మెగాస్టార్ చిరంజీవికి కార్తికేయ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. 'బెదురులంక 2012'లో కార్తికేయ క్యారెక్టర్ పేరు కూడా అదే. ఇప్పుడీ సినిమా ట్రైలర్ ను చిరు తనయుడు రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేసిన అనంతరం సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కార్తికేయకు, చిత్ర బృందానికి రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్పాడు.

కామెడీ, రొమాన్స్, యాక్షన్, డ్రామా... 'బెదురులంక 2012'లో ప్రేక్షకులు కోరుకునే అంశాలు అన్నీ ఉన్నాయని ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పారు. శివశంకర వరప్రసాద్ పాత్రలో కార్తికేయ కనిపించగా... అతడిని పిచ్చిగా ప్రేమించే అమ్మాయిగా నేహా శెట్టి కనిపించింది. తాను సిగరెట్ కాల్చడం వల్ల పోతే తన లంగ్స్ పోతాయని, వస్తే తనకే క్యాన్సర్ వస్తుందని ఊరి పెద్దలకు శివ చెప్పడం చూస్తుంటే వాళ్ళను అతడు లెక్క చేయడని అర్థం అవుతోంది. యుగాంతం పేరుతో కొత్త నాటకానికి తెర తీసిన పెద్దలకు శివ ఎలా బుద్ధి చెప్పాడనేది ఈ సినిమా స్టోరీ.

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించాడు.

First Published:  16 Aug 2023 9:11 PM IST
Next Story