Double Ismart | ఎట్టకేలకు మళ్లీ సెట్స్ పైకి...!
Double Ismart - పూరి-రామ్ కాంబోలో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ముంబయిలో మొదలైంది.
అనుమానాలకు చెక్ పడింది. డబుల్ ఇస్మార్ట్ సినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకుడు. చాన్నాళ్లుగా సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా ఆగిపోయింది. దీంతో సినిమాపై అనుమానాలు పెరిగాయి. డబ్బుల్లేక సినిమా షూటింగ్ నిలిచిపోయిందనే ప్రచారం నడిచింది.
ఎట్టకేలకు ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ డబుల్ ఇస్మార్ట్ సినిమాను మళ్లీ పట్టాలపైకి తీసుకొచ్చారు. ఈరోజు సెట్స్ పైకొచ్చిన ఈ సినిమాను ఫ్రెష్ గా మళ్లీ స్టార్ట్ చేశాడు పూరి జగన్నాధ్. చార్మి-పూరి నిర్మాతలుగా, రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ షూట్ మళ్లీ మొదలైంది.
ముంబయిలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. మూవీకి సంబంధించి ఇదే ఆఖరి షెడ్యూల్ అంటున్నారు. సంజయ్ దత్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా వెల్లడించకపోవడం విశేషం. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
నిజానికి శివరాత్రి కానుకగా మార్చి నెల్లోనే ఈ సినిమాను విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ షూటింగ్స్ లో జాప్యం వల్ల సినిమా అనుకున్న విధంగా సాగలేదు. చివరి షెడ్యూల్ ముగిసిన తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తారు.