Telugu Global
Cinema & Entertainment

పవర్ స్టార్ ని బీట్ చేయలేక పోయిన రజనీ!

చెన్నైలో హాట్ టాపిక్ ఏమిటంటే- రజనీకాంత్ పవన్ కళ్యాణ్ ని బీట్ చేయలేక పోయారని! ‘బాబా’ రీ-రిలీజ్ ఓపెనింగ్ డే పవన్ కళ్యాణ్ ‘జల్సా’ ని బీట్ చేయడంలో విఫలమైందని చెప్పుకుంటున్నారు. ‘బాబా’ వసూలు చేసింది కోటి రూపాయలు, ‘జల్సా’ వసూలు చేసింది మూడు కోట్ల రూపాయలు!

పవర్ స్టార్ ని బీట్ చేయలేక పోయిన రజనీ!
X

పవర్ స్టార్ ని బీట్ చేయలేక పోయిన రజనీ!

రెండు దశాబ్దాల క్రితం స్వాతంత్య్ర దినోత్సవం నాడు లివింగ్ లెజెండ్ రజనీకాంత్ నటించిన 'బాబా' విలక్షణమైన క్రేజ్‌తో విడుదలైంది. కానీ ఆ వెంటనే పరాజయం పాలైంది. బాషా (1994), ముత్తు (1995), అరుణాచలం (1997), పడయప్ప (1999) వంటి వరస బ్లాక్‌బస్టర్స్ తో టాప్ లో వున్న సూపర్ స్టార్ రజనీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ బ్లాక్ బస్టర్స్ లో రజనీకాంత్ శత్రువుల్ని నాశనం చేసే సామాన్యుడిగా ప్రేక్షకుల్ని వెర్రెత్తించారు. అదే 'బాబా' లో ఆధ్యాత్మికుడిగా మారే నాస్తికుడుగా సాధారణ పాత్ర నటించి తీవ్ర నిరాశకి గురిచేశారు.

'బాబా' రజనీ కెరీర్‌లో అతిపెద్ద ఫ్లాప్స్ లో ఒకటి. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తుందనే ఆశతో రీ రిలీజ్ చేశారు. రజనీ బర్త్ డే డిసెంబర్ 12 అయితే, 10 వ తేదీనే సంబరాలు జరుపుకుంటూ విడుదల చేశారు. ఫలితం మళ్ళీ ఫ్లాప్! ప్రభాస్ నటించిన 'రెబల్' ఫ్లాప్ రీ రిలీజ్ చేస్తే మళ్ళీ ఫ్లాప్ అయినట్టే, ఫ్లాపైన రజనీ 'బాబా' మళ్ళీ ఫ్లాపయ్యింది! దీనికి సురేష్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. నిడివి 30 నిమిషాలు కత్తిరించి, రీ మాస్టర్ చేసి, రజనీ 72 వ పుట్టిన రోజు కానుకగా అందించారు.

డిసెంబరులో పెద్ద తమిళ సినిమాలేవీ లైన్‌లో లేవు. గత రెండు నెలలుగా థియేటర్లలో పెద్దగా సినిమాలు రాకపోవడంతో స్తబ్దత నెలకొంది. ఇది 'బాబా'కి అడ్వాంటేజ్‌ అవుతుందనుకున్నారు. అప్పట్లో రజనీ కాంత్ రాజకీయ రంగు పులుముకున్న సినిమాలు నటిస్తూ తన రాజకీయ రంగ ప్రవేశంపై సంకేతాలిచ్చేవారు. 'బాబా' లో కూడా రాజకీయ డైలాగులు చెబుతూ, అవినీతిపరులైన నాయకుల్ని విమర్శించే ధోరణి వుంది. కానీ హిమాలయాల్లో ఆధ్యాత్మికతని వెతుక్కునే పాత్రే అభిమానులకి మింగుడు పడలేదు. సినిమా ఫాంటసీకి పెద్ద పీట వేసింది. రజనీ పాత్ర హిమాలయాల నుంచి వచ్చిన- పునర్జన్మ ఎత్తిన ఓ సాధువు అవతారం. అకస్మాత్తుగా ఈ ఆధ్యాత్మికం వైపు తమ రజనీ ఎందుకు టర్న్ తీసుకున్నారో ఫ్యాన్స్ కి అర్ధం కాలేదు. అప్పట్లో ఈ కాన్సెప్ట్ తో పాటు, సినిమా మొత్తం విమర్శకుల్నీ, సినిమా అభిమానుల్నీ ఆకట్టుకోలేదు. సీరియస్ స్టోరీని చెప్పడానికి పాపులిస్ట్ రూట్‌ని ఎంచుకోవడం నచ్చలేదు. నాస్తికుడైన రజనీ పాత్ర తనది దైవిక జన్మ అని గ్రహించి, తనను తాను దైవ భక్తి వైపు మరల్చుకునే కథ బోరు కొట్టేసింది. డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది.

విశేషమేమిటంటే, ఇదే ఫాంటసీ జానర్ నేడు పాపులర్ సినిమాగా అద్భుతాలు చేస్తోంది. కాంతారా, కార్తికేయ, బ్రహ్మాస్త్ర వంటివి పానిండియా ఘన విజయాలుగా నిలుస్తున్నాయి. ఇదే ఊపులో ఈసారి ప్రేక్షకులు 'బాబా' పట్ల దయ చూపుతారని భావించారు. బాబా పట్ల తాము దయ చూపడ మేమిటి, బాబాయే తమ పట్ల దయ చూపాలని నమస్కారం పెట్టేశారు ప్రేక్షకులు.

రజనీ మూడు సంవత్సరాల విరామం తర్వాత రీరిలీజ్ 'బాబా' తో ముందుకు వచ్చినా తమిళనాడు అంతటా రెస్పాన్స్ చప్పగా వుంది. వారాంతంలో సోలోగా రీ రిలీజ్ అవడం, పైగా రజనీ పుట్టినరోజు కలిసి రావడంతో, రికార్డులు బద్దలు కొట్టే ఓపెనింగ్ కలెక్షన్స్ వుంటాయని మూవీని విడుదల చేసిన పీవీఆర్ మల్టీప్లెక్స్ సంస్థ భారీ ఆశలు పెట్టుకుంది.

ఇదంతా పక్కన బెట్టి ఇప్పుడు చెన్నైలో హాట్ టాపిక్ ఏమిటంటే- రజనీకాంత్ పవన్ కళ్యాణ్ ని బీట్ చేయలేక పోయారని! 'బాబా' రీ-రిలీజ్ ఓపెనింగ్ డే పవన్ కళ్యాణ్ 'జల్సా' ని బీట్ చేయడంలో విఫలమైందని చెప్పుకుంటున్నారు. 'బాబా' వసూలు చేసింది కోటి రూపాయలు, 'జల్సా' వసూలు చేసింది మూడు కోట్ల రూపాయలు!

రీ-రిలీజ్‌ తో, ఓపెనింగ్ డే కలెక్షన్లలో, పవన్ కళ్యాణ్ 'జల్సా' ప్రస్తుతానికి రికార్డ్ హోల్డర్. ఓపెనింగ్ డే గ్రాస్ దాదాపు 3 కోట్లకి చేరువైంది. ఈ సినిమా రీ-రిలీజ్‌ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.

ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ నోట ఒకే మాట- బాబా ఎందుకు? అన్నామలై, అరుణాచలం, బాషా వంటి సూపర్ హిట్స్ వుండగా? దీనికి సమాధానం ఎవరు చెప్తారు. నాడు 'బాబా' ఫ్లాప్ తర్వాత తిరిగి రజనీ పుంజుకుని, నయనతారతో కలిసి 'చంద్రముఖి' బ్లాక్‌బస్టర్‌లో నటించడానికి మూడేళ్ళూ పట్టింది!

పోతే, 'బాబా' రీ-రిలీజ్ వెర్షన్ కి చాలా మార్పులు చేశారు. కొన్ని భాగాలకు రజనీకాంత్ మళ్ళీ డబ్బింగ్ చెప్పారు. డాల్బీ అట్మాస్‌లో సౌండ్ క్వాలిటీ మెరుగు పర్చారు ఫిల్ముని డిజిటల్‌గా 4 కె లో రీమాస్టర్ చేశారు. రన్ టైమ్ 3 గంటల నుంచి రెండున్నర గంటలకి తగ్గించారు.

2002లో విడుదలైన 'బాబా' లో రజనీతో బాటు మనీషా కొయిరాలా, గౌండమణి, నంబియార్, సుజాత తదితరులు నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. రజనీకాంత్ తానే కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఆయన స్క్రిప్టు చేసిన చివరి సినిమా కూడా ఇదే!

First Published:  12 Dec 2022 1:37 PM IST
Next Story